అక్రమ సంపాదనతో భారీ ప్రచారం

అక్రమ సంపాదనతో భారీ ప్రచారం - Sakshi


♦  టీఆర్‌ఎస్‌పై ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజం

♦  అరాచకాలను ఎండగట్టాలి

♦  ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ ఉగ్రవాది: భట్టి


 సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ అక్రమ సంపాదనతో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బూటకపు ప్రచారం చేసుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి చాలా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలోని అభివృద్ధిని తమ ఘనతగా టీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

 

 శనివారం గాంధీభవన్‌లో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ నాయకుల అరాచకాలను, అప్రజాస్వామిక పద్ధతులను ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలవడానికి టీఆర్‌ఎస్ అన్ని అడ్డదారులను తొక్కుతోందంటూ వీటిపై టీపీసీసీ రూపొందించిన వీడియో క్లిప్పింగులను విద్యార్థి నేతలకు ఉత్తమ్ చూపించారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలు, మెట్రో రైలు, ఔటర్ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి వాటికి కాంగ్రెస్ చేసిన కృషిని ప్రజలకు వివరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న సెటిలర్లకు అందరితోపాటు సమానహక్కులుంటాయన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే వృథా అయినట్టేనని పేర్కొన్నారు.

 

 టీఆర్‌ఎస్ కుట్రలు: భట్టి

 ప్రతిపక్షాలను లేకుండా చేయాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఉగ్రవాదిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటికే టీఆర్‌ఎస్ సర్కారు చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో శాస్త్రీయత, పారదర్శకత లేకుండా వ్యవహరిస్తున్నదన్నారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా, ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినా అధికారపక్షం బరితెగించి పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌లోని ఏ దామాషా ప్రకారం డివిజన్ల రిజర్వేషన్లు చేశారని ప్రశ్నించారు.

 

 చండీయాగం దాతలెవరు: షబ్బీర్ అలీ

 సీఎం కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి 7.5 కోట్లు ఖర్చు అయినట్టు స్వయంగా ఆయనే చెప్పారని, దానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను చెప్పాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ప్రచార పిచ్చి పట్టుకుందని, పబ్లిక్ టాయిలెట్లను కూడా కేసీఆర్ ఫొటోలతో నింపేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళ్ల దగ్గర మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ ఫొటోలు న్నాయని, ముస్లిం వేషధారణలో ఉన్న ఒవైసీ ఫొటోను అక్కడ పెట్టి ముస్లిం లను అవమానిస్తున్నారన్నారు. ముస్లింలకు కేసీఆర్, అసదుద్దీన్ క్షమాపణ చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును మించిన అబద్ధాలకోరు దేశంలోనే లేరని విమర్శించారు.

 

 వీసాలపై న్యాయసలహాలు

 అమెరికా వెళ్లి ఇబ్బం దులు పడుతున్న తెలంగాణ విద్యార్థులకు ఆదివారం న్యాయ నిపుణుల ద్వారా ఉచితంగా న్యాయసలహాలను అందిస్తామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ, టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ వినోద్‌కుమార్ తెలిపారు. అమెరికా వెళ్తున్న విద్యార్థులు అవగాహన లేకపోవడం వల్ల ఆర్థికంగా నష్ట పోతు న్నారని, అక్కడ ఇబ్బందులు పడుతున్నా రని చెప్పారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top