దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి | YSRCP writes a letter to the DGP on flex banners | Sakshi
Sakshi News home page

దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి

Jan 31 2026 4:39 AM | Updated on Jan 31 2026 4:39 AM

YSRCP writes a letter to the DGP on flex banners

అలాంటి వాటిపై నిషేధాజ్ఞలు జారీ చేయండి

డీజీపీకి వైఎస్సార్‌సీపీ లేఖ

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి వివాదంపై దర్యాప్తు చేసిన సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఛార్జ్ షీట్  నేపథ్యంలో తమ పార్టీ, నాయకులను నిందిస్తూ రాష్ట్రంలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని వైఎస్సార్‌సీపీ కోరింది. ఈ మేరకు డీజీపీకి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి శుక్రవారం లేఖ రాశారు. సీబీఐ సిట్‌ ఛార్జ్ షీట్ లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ, తమ పార్టీని నిందిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతోపాటు నాయకుల పరువుకు భంగం కలిగించే విధంగా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. నిజానికి సిట్‌ ఛార్జ్ షీట్ లో వైఎస్సార్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిపై ఎలాంటి నేరారోపణలు చేయలేదని, అయినా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తూ, వారి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, వారి ఫొటోలతో సహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించారు. 

అందుకే వాటిని ఏర్పాటు చేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు, భవిష్యత్‌లో మళ్లీ అలాంటి పనులు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తూ, పరువుకు నష్టం కలిగించేలా ఆ ఫ్లెక్సీలు డిజైన్‌ చేసిన, ప్రింట్‌ చేసిన, వాటికి నిధులు సమకూర్చిన, రవాణా చేసిన వారితోపాటు, అవి ఏర్పాటు చేసిన వారిపైనా వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా అలాంటి ఫ్లెక్సీల ఏర్పాటుకు ప్లాన్‌ చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని, కాబట్టి శాంతికి విఘాతం కలిగించే ఆ చర్యలను నిరోధించేలా వెంటనే నిషేధాజ్ఞలు జారీ చేయాలని లేళ్ల అప్పిరెడ్డి ఆ లేఖలో డీజీపీని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement