దేశంలో ప్రతి వంద మందిలో 30 మంది చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు.
ముగిసిన పీడియాట్రిక్ డెర్మటాలజీ-2016 సదస్సు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి వంద మందిలో 30 మంది చర్మ సంబంధ వ్యాధితో బాధపడుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడ్డారు. జన్యుపరమైన లోపంతో పాటు గర్భస్థ సమయంలో తల్లి మోతాదుకు మించి మందులు వాడటం వల్ల పుట్టిన పిల్లల్లో చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు. ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ ట్విన్ సిటీస్ బ్రాంచ్(ఐపీఏ టీసీబీ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హైదరాబాద్ బేగంపేటలో నిర్వహించిన నాలుగో పీడియాట్రిక్ డెర్మటాలజీ సదస్సు-2016 ఆదివారం ముగిసింది. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సురేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 390 మంది చిన్నపిల్లల వైద్య నిపుణులు పాల్గొన్నారు.
పిల్లల్లో వస్తున్న చర్మ సంబంధ వ్యాధులు, పీడియాట్రిక్ సర్జరీలపై చర్చించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఐపీఏ టీసీబీ అధ్యక్షుడు డాక్టర్ రంగయ్య, కోశాధికారి డాక్టర్ షబ్బీర్ అహ్మద్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన గాంధీ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థి శ్రీనాథ్‌కు చంద్రశేఖర్ చౌదరి బంగారు పతకాన్ని అందజేశారు. ‘చర్మం పొడిబారటం, గోకితే తెల్లని పొడి రావడం లాంటి వ్యాధులపై చాలా మందికి సరైన అవగాహన లేదు. దీంతో వ్యాధి ముదిరి చర్మ కేన్సర్‌కు కారణమవుతోంది. తక్కువ గాఢత ఉన్న సబ్బులకు వాడటం ద్వారా పిల్లలను చర్మ వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చు’ అని ప్రొఫెసర్ థామస్ చెప్పారు.