ప్రజారోగ్యం వ్యాపారం కాదు.. ప్రజల ప్రాథమిక హక్కు
వైద్యసీట్లు పూర్తిగా ప్రభుత్వ కోటాలోనే భర్తీ చేయాలి
వైద్యవిద్య పరిరక్షణ సదస్సులో వక్తల డిమాండ్
కృష్ణలంక (విజయవాడ తూర్పు): ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం వ్యాపారం కాదని.. ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని బాలోత్సవ భవన్‌లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (పీడీఎస్‌ఓ) ఆధ్వర్యంలో ఆదివారం ‘వైద్య విద్య ప్రైవేటీకరణ–సమాజంపై దాని ప్రభావం’ అనే అంశంపై విద్యార్థి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్ అధ్యక్షతన వైద్యవిద్య పరిరక్షణ సదస్సు జరిగింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ కన్వినర్ డాక్టర్ అలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చేందుకే పీపీపీ పద్ధతిని ఎంచుకున్నారని విమర్శించారు. ప్రైవేట్ కాలేజీలు ఫ్రీ సీట్ల కోసమే రూ.లక్షలు వసూలు చేస్తున్నాయన్నారు. వైద్యంలో నాణ్యత ప్రభుత్వ ఆస్పత్రులతోనే సాధ్యమన్నారు. సంపద సృష్టిస్తామని చెబుతూ సంపద మొత్తాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతున్నారని, అందులో భాగంగానే ఇటీవల ప్రారంభించిన ఐదు మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను సైతం అమ్మకానికి పెట్టారన్నారు.
ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా అంతా కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మరో ప్రధాన వక్త డాక్టర్ ఘంటా వెంకట్రావు మాట్లాడుతూ.. 107, 108 జీవోలను పూర్తిగా రద్దుచేసి 100 శాతం సీట్లు ప్రభుత్వ కోటాలో భర్తీ చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన నారా లోకేశ్ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లను విక్రయించడం అన్యాయమన్నారు.
వైద్య విద్యను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే మార్గమని స్పష్టం చేశారు. పీడీఎస్‌ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ మాట్లాడుతూ.. పాలకులు వైద్య రంగాన్ని వ్యాపారంగా మార్చి పేదలకు వైద్య సేవలను దూరం చేస్తున్నారని తెలిపారు. 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, 107, 108 జీవోలను రద్దు చేసి 100శాతం ఎంబీబీఎస్ సీట్లను ప్రభుత్వ కోటాలోనే ఇచ్చేంతవరకు పోరాటం కొనసాగిస్తుందన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్, సామాజిక కార్యకర్త కొల్ల రాజమోహన్, ఓíపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు మాట్లాడారు. పీడీఎస్‌ఓ కోశాధికారి ఎల్.భాను వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 10 తీర్మానాలను ప్రవేశపెట్టారు.


