ఉత్పత్తిరేటు తగ్గినా మాంద్యం లేదంటే ఎలా?

Sarampalli Mallareddy Article On Economic Situation Of India - Sakshi

సందర్భం

జాతీయ స్థూల ఉత్పత్తి రేటు తగ్గినప్పటికీ, భారతదేశంలో మాంద్యం లేదంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నవంబర్‌ పార్లమెంట్‌ శీతాకాలం సమావేశాలలో ప్రకటించారు. మరోవైపు దేశంలో మాంద్యం కొనసాగడం వల్ల జాతీయ స్థూల ఉత్పత్తి తగ్గుతున్నదని ప్రధాని మోదీ ప్రకటించారు. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రధాని, ఆర్థిక మంత్రి భారత ప్రజానీకాన్నే కాక ఆర్థిక మేధావులను కూడా గందరగోళం చేస్తున్నారు. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు. 2019–20లో 2.8 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. 2025 నాటికి మరో 3.2 ట్రిలియన్‌ డాలర్లకు పెరగాలి. కానీ 2018–19లో 7.1 శాతంగా ఉన్న స్థూల ఉత్పత్తి రేటు ప్రస్తుతం రెండవ క్వార్టర్‌లో 4.5 శాతానికి తగ్గినట్లు ఆర్థిక గణాంకాలు చెపుతున్నాయి. ప్రస్తుత స్థూల ఉత్పత్తి రేటు ప్రకారం మరో 9 ఏళ్లకు అనగా 2033–34 నాటికి 5.18 ట్రిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెపుతున్నారు. పై గణాంకాల్ని చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం వల్ల ఉత్పత్తి రేటు తగ్గినట్లు స్పష్టమవుతున్నది.

ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఈ మాంద్యం ఇప్పట్లో తగ్గదని తెలుస్తుంది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిలోకి తెస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని ఎన్నికల హామీ సందర్భంగా ప్రకటిం చారు. కానీ వ్యవసాయరంగం స్థూల ఉత్పత్తి ప్రస్తుతం 2.1 శాతంగా ఉంది. లక్ష్యం 4 శాతం పెట్టుకున్నప్పటికీ ఏనాడూ ఆ లక్ష్యాన్ని చేరలేదు. 2001 నాటికి 58.3 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా ప్రస్తుతం 52.7 శాతంగా ఉన్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 25.7 శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రధాని ప్రకటించిన పథకాలలో ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధర కల్పిం చడం, మంచి ఉపకరణాలను అందుబాటులో పెట్టడం, ఇరిగేషన్‌ సౌకర్యం కల్పించడం, విత్తన బదలాయింపు, తగినంత ఎరువు వాడకం, నూతన టెక్నాలజీ వినియోగం చేపట్టాలని ప్రణాళికలో చెప్పారు. మద్య దళారీలను తొలగించి ముందే నిర్ణయించిన కనీస మద్దతు ధరను మార్కెట్‌లో అమలు జరపడంతోపాటు, నిర్ణయించిన ధరకన్నా తక్కువ వచ్చినప్పడు ఆ లోటు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. కానీ పై అంశాలేవీ వాస్తవంలో అమలుకు నోచుకోవడం లేదు.

దేశంలో 2018–19లో 43 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా 30 కోట్ల ఎకరాలలో ఆహార ధాన్యాలు (7 కోట్ల ఎకరాలలో పప్పుధాన్యాలు కలిపి), 6.5 కోట్ల ఎకరాలలో నూనెగింజలు, 1.25 కోట్ల ఎకరాలలో చెరకు, 3 కోట్ల ఎకరాలలో పత్తి తదితర పంటలు వేస్తున్నారు. పై పంటల సాగుభూమి క్రమంగా తగ్గుతున్నది. ఉత్పాదకత కూడా గత అయిదేళ్లలో పెరగలేదు. ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచడానికి అనేక పథకాలను ప్రకటిం చింది. కిసాన్‌ సమ్మాన్‌ కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 6,000ల చొప్పున దేశంలోని 14.65 కోట్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి రూ. 75,000 కోట్లు ఫసల్‌బీమాకు ప్రీమియం కింద రు. 14 వేల కోట్లు, వడ్డీ మాఫీకి 18 వేల కోట్లు, కృషి సించాయ్‌యోజనకు 3,500 కోట్లు, మార్కెట్‌ జోక్యం పథకం కింద 3 వేల కోట్లు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్‌ యోజన కింద 3,500 కోట్లు, మొత్తం రూ. 1,29,585 కోట్లను 2019–20 బడ్జెట్‌లో కేటాయిం చారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 4.6 శాతంగా ఉంది. కానీ కిసాన్‌ సమ్మాన్‌కి 75వేల కోట్లు మినహాయిస్తే వ్యవసాయ బడ్జెట్‌ కేటాయింపు 54,585 కోట్లు మాత్రమే. అనగా మొత్తం బడ్జెట్‌లో 1.96 శాతం మాత్రమే కేటాయించారు. దేశీయ స్థూల ఉత్పత్తికి 15 శాతం ఆదాయాన్ని కాంట్రిబ్యూట్‌ చేస్తున్న వ్యవసాయ రంగానికి 1.96 శాతం బడ్జెట్‌ కేటాయింపుతో అభివృద్ధి జరుగుతుందా?
 
ప్రపంచంలోని అన్ని దేశాలు తమ వ్యవసాయ రంగాలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నాయి. కానీ పత్తి ఎగుమతి రాయితీలు నిషేధించాలని 2017 జనవరి 1న భారతదేశం తరఫున ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ సంతకం చేశారు. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఆహారధాన్యాల దిగుమతులపై ఆధారపడే దుస్థితికి నెట్టబడింది. 1996లో స్వయంపోషకత్వంగా ఉన్న దేశం నేడు దిగుమతులపై ఆధారపడుతున్నది. ఇంతవరకు వ్యవసాయ రంగానికి దేశీయంగా లేదా రాష్ట్రాలలో భూ వినియోగంపై ప్రణాళికలు లేవు. రైతులు తమ కోర్కెల మేరకు పంటలు వేస్తున్నారు. ప్రధానంగా ఎగుమతి ఆధారిత పంటలవైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. అనేక వైపరీత్యాలకు ఓర్చి పండించిన ఎగుమతి ఆధారిత పంటలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో రైతులు దివాలా తీస్తున్నారు. ఇప్పటికీ 52 శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. క్రమంగా వీరు వ్యవసాయ రంగాన్ని వదిలేసి ఇతర రంగాలకు తరలిపోతున్నారు. 2022 నాటికి వ్యవసాయ రంగంలో 18 అంశాలను అమలు జరపడం ద్వారా 2018 ఫిబ్రవరి 3న రైతుల ఆదాయం రేటు పెంపు చేస్తానని ప్రధాని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 6 సం‘‘లు కావస్తున్నా ప్రభుత్వం ప్రకటిం చిన హామీలలో ఏ ఒక్కటీ అమలు జరగలేదు. చివరకు ‘రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు’ ఏర్పాటు చేసి పెద్ద కమతాలుగా మార్చి ఆ కమతాలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి యాంత్రీకరణ ద్వారా అధికోత్పత్తి సాధిస్తామని ప్రణాళికలు వేస్తున్నారు.
    
వీలైనంతవరకు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా చూడాలి. వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో కనీసం 8 శాతం నిధులు కేటాయించాలి. వ్యవసాయ రంగానికి రాయితీల కల్పనలో వెనుకాడరాదు. విత్తనం మొదలు మార్కెట్‌ వరకు గల అంశాలలో ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తిని సాధించే దిశగా ప్రణాళికల రూపకల్పన చేయాలి. భూమి సాగుతో సంబంధం ఉన్నవారందరికీ చట్టపరంగా హక్కులు కల్పించాలి. పై చర్యలు చేపట్టడం ద్వారా ప్రస్తుత మాంద్యం నుండి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను బయటపడవేయాలి. అంతేకానీ ప్రపంచవ్యాపితంగా కొనసాగుతున్న మాంద్యం భారతదేశంలో లేదని ఆర్థికమంత్రి చెప్పడం వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు దూరం కావు. 

సారంపల్లి మల్లారెడ్డి 
వ్యాసకర్త అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు ‘ 94900 98666

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top