ఆర్థికాన్ని బడ్జెట్‌ ఆదుకునేనా..?

Nirmala Sitharaman Will Produce Budget On July 5th - Sakshi

అభిప్రాయం

కేంద్రప్రభుత్వ 2019– 20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ జూలై 5, 2019న పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా, దేశీయ ఆర్థికవ్యవస్థకు సంబంధించిన జీడీపీ, నిరుద్యోగం, పన్నుల ఆదాయాల వంటి అనేక సరికొత్త గణాంకాలు అన్నీ ప్రతికూల దిశగానే సాగుతున్నాయని నేడు గణాం కాలు చెబుతున్నాయి. ప్రస్తుతం, దేశ ఆర్థికస్థితి తీవ్ర మందగమనంలో ఉంది. 2018–19 తాలూకు చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు కేవలం 5.8 శాతంగానే ఉంది. కాగా, మొత్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను అది 6.6 శాతం స్థాయిలోనే ఉంది. అలాగే, నిరుద్యోగ గణాంకాలు కూడా 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో 6.1 శాతంగా ఉన్నాయి. ఇక, బ్యాంకింగ్‌ రంగంలో పేరుకుపోయిన మొండి బకాయిలు, బ్యాంకింగేతర ఫైనాన్స్‌ రంగ సంస్థలలో సంక్షోభ పరిస్థితుల వలన దేశీయంగా రుణాల మంజూరు తీవ్రంగా కుంటుపడింది. అలాగే, గ్రామీణ వ్యవసాయ సంక్షోభం నేడు పరాకాష్టలో ఉంది. పైగా, మన ప్రభుత్వం వేసుకొన్న పన్నుల రాబడి అంచనాలు కూడా తమ లక్ష్యాలను చేరలేకపోయాయి. 2018–19లో ప్రభుత్వ పన్నుల ఆదాయంలో నికరంగా 19 శాతం వృద్ధి ఉంటుం దని అంచనా వేసుకున్నారు. కాగా, అది కేవలం 6 శాతంగానే ఉంది. అంటే ప్రభుత్వం రూ. 14.84 లక్షల కోట్ల మేరకు పన్నుల ఆదాయాన్ని ఆశించగా, వాస్తవంలో అది కేవలం రూ.13.17 లక్షల కోట్లు గానే ఉంది. దీనితో పాటుగా, రిజర్వ్‌ బ్యాంక్‌లోని అదనపు నిధులకు సంబంధించి ఏర్పరచిన బిమాల్‌ జలాన్‌ కమిటీ నివేదిక బడ్జెట్‌లోపే వస్తుందనీ, దాని వలన ప్రభుత్వ ఖజానాకు రిజర్వ్‌ బ్యాంకు ‘‘అదనపు’’ నిధుల నుంచి భారీగా వనరులు వచ్చి చేరుతాయని ప్రభుత్వం పెట్టుకున్న ఆశ, నిరాశే అయింది. 

ఈ బడ్జెట్‌ ఒక ప్రక్కన ఆదాయ కొరతలూ, మరో ప్రక్కన ఆర్థిక మందగమనాన్ని పరిష్కరించవలసిన అడకత్తెర స్థితిలో ఉంది. దీన్నుంచి  బయటపడేందుకు, ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఏదో ఒక రూపంలో  కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పథకానికి సుమారు 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ఖర్చు కాగలదని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. కాగా, నేడు కేంద్రప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ ప«థకాల మీదా కలగలిసి పెడుతోన్న మొత్తం ఖర్చు రూ. 3.4 లక్షల కోట్లు. కాబట్టి, మిగతా అన్ని సంక్షేమ పథకాల స్థానంలో కనీస ఆదాయ ప«థకం వంటి దానిని ప్రవేశపెడితే, అది ప్రభుత్వానికి సుమారు రూ. 40 వేల కోట్లనుంచి రూ. 90 వేల కోట్ల మేరకు ఆదా చేయగలదు. ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పన వ్యయాలు రెండవ ప్రధాన అంశం. ఇప్పటికే, ప్రధాని మోదీ రానున్న 5 ఏళ్లలో వ్యవసాయరంగంలో రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించడం తెలిసిందే. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇటు ప్రధాని కూడా ఈ పెట్టుబడులు ప్రధానంగా  గిడ్డంగులు, శీతల గిడ్డంగులు, ఆహారశుద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల వంటి వాటిలో రావాలనీ, దీనిలో కార్పొరేట్‌లు భాగస్వాములు కావాలనీ చెప్పి ఉన్నారు. అంటే, వ్యవసాయక పెట్టుబడుల రంగంలో కార్పొరేట్‌ వ్యవసాయానికి అనుకూల దిశగానే ఉండవచ్చును.   

చివరగా, బడ్జెట్‌ కేటాయింపులలో 30,000 నుంచి  40,000 కోట్ల రూపాయల మేరన మొండిబకాయిలతో కుదేలై ఉన్న బ్యాంకులకు మూలధనంగా అందవచ్చును. ఇక కార్పొరేట్‌లు, తమపై విధిస్తోన్న పన్నులను తగ్గించమన్న డిమాండ్‌ నిరంతరంగా ఉండేదే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల మధ్యన విదేశీ పెట్టుబడుల కోసం, అలాగే దేశీయ ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం కోసం నెలకొన్న పోటీలో కార్పొరేట్‌ పన్నును తగ్గించడం అవసరమంటూ ప్రభుత్వం బహుశా ఈ దిశగా నిర్ణ యం తీసుకోవచ్చును. కాగా, మధ్యతరగతి వేతన జీవుల ఆశ అయిన  ఆదాయపు పన్ను రాయితీలు అందే అవకాశం అంతంతమాత్రమే. ఇప్పటికే, ఆశించిన మేరకు పన్నుల రాబడిలో వృద్ధి లేదని భావిస్తోన్న ప్రభుత్వం  నికరంగా, ఖచ్చితంగా వచ్చి తీరే ఈ వ్యక్తిగత పన్ను ఆదాయవనరును తగ్గించుకునేందుకు, ఎంతవరకు సిద్ధపడగలదు? అనేది ఇక్కడి ప్రశ్న. దేశంలో రోజురోజుకూ పెరిగి పోతోన్న నిరుద్యోగ సమస్యకు ఉపశమనాన్ని ఇచ్చేందుకు కూడా ఎగుమతులకు ప్రోత్సాహకాలు అవసరం. అలాగే పెద్ద నోట్ల రద్దు, హడావుడి జీఎస్టీ నిర్ణయాల వలన దెబ్బతిన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకొనే రాయితీలూ, రుణ సదుపాయాల పెంపుదల, పన్నుల సంస్కరణ లాంటి నిర్ణయాలు అనివార్యం.

వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు
మొబైల్‌ : 98661 79615
డి. పాపారావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top