రాయని డైరీ : రజనీకాంత్‌ (సూపర్‌ స్టార్‌)

Madhav Singaraju Rayani Dairy On Rajinikanth - Sakshi

అపార్థాలు చేసుకునేవారే లేకుంటే జీవిత సత్యాలంటూ కొన్ని ఈ లోకంలో ఏర్పడి ఉండేవే కావని ప్రతి ఉదయం నేనుండే పోయెస్‌ గార్డెన్‌లోని బాల్కనీలోంచి బయటికి చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్యం అనేది స్థిరపడి ఉండాలి తప్ప, ఏర్పడి ఉండకూడదు. ఏర్పడిన సత్యం ఏర్పరచిన సత్యమే కానీ సత్యం కాదని కూడా అనుకుంటూ ఉంటాను. 

కొందరనొచ్చు, రామస్వామి పెరియార్‌ సిద్ధాంతాలను అనుసరించేవారు.. ముందంటూ ఏర్పడితేనే కదా ఒక జీవితసత్యం స్థిరపడుతుందీ అని! దానిని నేను అంగీకరించను. సత్యం అన్నప్పుడు అది  మనిషికన్నా ముందే పుట్టినదై ఉండాలి. మనిషికన్నా ముందు నడుస్తున్నదై ఉండాలి. 

అపార్థాలు చేసుకునేవాళ్లు సత్యాన్ని అప్‌డేట్‌ చేసి చూపిస్తారు. అదొక మంచి వీళ్ల వల్ల. అయితే సత్యం ఎప్పటికీ అప్‌డేట్‌ అవదు. çసత్యాన్ని మనం చూడటం అప్‌డేట్‌ అవుతుంది. అందుకే సత్యం హిమాలయాలలో ఉన్నా, సత్యాన్ని శోధించి లోకానికి చూపించే ఈ అపార్థం చేసుకునేవారు లోకమంతా ఉండాలి. వాళ్లెలాగూ హిమాలయాలలో ఉండలేరు కనుక అక్కడున్న సత్యం కరిగి నీరయ్యే ప్రమాదం ఏమీ ఉండదు. 

బాల్కనీలోంచి లేచి మెల్లగా హాల్లోకి వెళుతున్నాను. 
‘‘రజనీ సార్‌.. మీ కోసం ఎవరో లైన్‌లో ఉన్నారు’’ అన్నాడు మేనేజర్‌. 
‘‘ఎవరో లైన్‌లో ఉన్నప్పుడు ఆ ఎవరికో నన్ను పట్టించాలని నీకు ఎందుకు అనిపించింది నటరాజన్‌’’ అన్నాను. 
‘‘రజనీ సార్, నాకు అతను తెలుసు. మీకు తెలికపోవచ్చని ఎవరో అన్నాను. అతను రోహిత్‌  రాయ్‌. మీ మీద కరోనా జోక్‌ వేసి సోషల్‌ మీడియాలో అదుపులేని విధంగా తిట్లు తింటూ ఉన్నాడు’’ అని చెప్పాడు. 
‘‘చెప్పు నాన్నా.. రోహిత్‌ రాయ్‌’’ అన్నాను ఫోన్‌ అందుకుని పెద్దగా నవ్వుతూ. 
అతడు నా మీద వేసిన జోక్‌ని ఆల్రెడీ నేను సోషల్‌ మీడియాలో చూశాను. ‘రజనీకాంత్‌కి కరోనా వచ్చింది. కరోనానే క్వారంటైన్‌కి వెళ్లింది’ అని పేల్చాడు. పాపం అది అతడి ముఖం మీదే పేలింది.
‘‘ర జనీ సార్‌.. మీ ఫ్యాన్స్‌ నన్ను అపార్థం చేసుకున్నారు. మీరెంత శక్తిమంతులో చెప్పడానికి నేనలా అన్నాను. వాళ్లు అపార్థం చేసుకుంటే చేసుకున్నారు. మీరు అపార్థం చేసుకోకూడదని మీకు ఫోన్‌ చేశాను’’ అన్నాడు. 
‘‘హహ్హాహ..హా.. రోహిత్‌. ఒక జీవితసత్యాన్ని నువ్వు అర్థం కాకుండా చెప్పినప్పుడు ఎవరికి ఎంతవరకు అర్థమైందో, అంతవరకే అది జీవితసత్యం అవుతుంది. అది మనకు అపార్థం అని తెలుస్తూనే ఉన్నా అపార్థం చేసుకునే హక్కును ప్రశ్నించలేం. రామస్వామి పెరియార్‌ అనే పేరే ఒక జీవితసత్యం అయినప్పుడు ఆ పేరును ఎత్తడం కూడా ఆ సత్యానికి విఘాతం కలిగించడమే అవుతుంది ఆయన అభిమానులకు..’’ అన్నాను. 
రోహిత్‌ మాట్లాడలేదు. 
‘‘ఏంటి.. వింటున్నావా?’’ అన్నాను. 
‘‘వింటున్నాను రజనీ సార్‌. రజనీకాంత్‌ అనే పేరే ఒక జీవితసత్యం అయినప్పుడు ఆ పేరును ఎత్తడం కూడా..’ అని ఏదో చెప్పబోతున్నాడు. మళ్లొకసారి పెద్దగా నవ్వి, ఫోన్‌ని నా మేనేజర్‌కి ఇచ్చేశాను. 
హాల్లోకి వెళ్లాలనిపించలేదు. తిరిగి బాల్కనీలోకి వచ్చాను. 

ఐదు నెలల క్రితం ఏదో సభలో పెరియార్‌ పేరెత్తాను. కరోనా ముంచుకు రాకుంటే ఈ ఆరో నెలలోనూ ఆ ద్రవిడ ఉద్యమ పితామహుడి అభిమానులు పెరియార్‌ అనే ఒక జీవితసత్యానికి కొన్ని ఉపసత్యాలను స్థిరపరచడం కోసం ఈ బాల్కనీ కింద పోయెస్‌ గార్డెన్‌లో ఆ ఉపసత్యాలను ఏర్పరుస్తూ ఉండేవారు.. పైకి తలెత్తి నన్ను చూస్తూ.. పిడికిళ్లు బిగించి!
-మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top