ప్రజా వ్యతిరేక బాటలో తపాలా

Madabhushi Sridhar Special Column On Postal Dept - Sakshi

విశ్లేషణ
వేలాది కేసుల్లో సరిగ్గా సమాధానం ఇవ్వకుండా తమ ఖాతాదారులనే ఏడిపించడంలో తపాలా అధికారులు వారికి వారే సాటి. వారిని ఉద్యోగులనీ, ప్రజాసేవకులనీ, పబ్లిక్‌ సర్వెంట్‌లనీ అనడం పొరబాటవుతుంది.

రమణీ మోహన్‌ ఘోష్, ప్రొఫెసర్‌ కమలా ఘోష్‌ భార్యాభర్తలు. వారికి ఒక్కతే కూతురు– సంఘమిత్రా ముఖర్జీ. ఆ దంపతులు, తాము పొదుపుచేసిన సొమ్ము పోస్టాఫీసులోని వివిధ పథకాల్లో దాచుకున్నారు. నెలవారీ పొదుపు పథకం, రికరింగ్‌ డిపాజిట్, జాతీయ పొదుపు పత్రాలు, ఇతర ఖాతాల్లో డబ్బు పెట్టుబడి పెట్టుకున్నారు. వారు వృద్ధాప్యంలో మరణించారు. వారి పెట్టుబడులకు నామినీగా సంఘమిత్ర పేరునే పెట్టారు. ఆమె ఒక్కతే వారికి వారసురాలు. వారి మరణ ధృవపత్రాన్ని సమర్పించి ఆ డబ్బును తనకు ఇవ్వాలని ఆమె పోస్టాఫీసు చుట్టూ తిరుగుతూనే ఉంది. కనీసం వంద సార్లు. ‘‘నా ఇంటిముందే పోస్టాఫీసు ఉంది. ప్రతిసారీ మళ్లీ రమ్మంటున్నారు. లేదా నన్ను గంటల కొద్దీ ఎదురుచూసేట్టు చేస్తున్నారు. కాగితాలు వెదుకుతున్నట్టు నటిస్తున్నారు. తర్వాత రమ్మంటున్నారు. ఏడిపిస్తున్నారు. ఇంకా ఏవేవో  వివరాలు ఇమ్మంటున్నారు. నా దగ్గర ఉన్న వివరాలన్నీ ఇచ్చాను.  ఒక్కపైసా కూడా ఇవ్వలేదు’’. అని ఆమె వాపోయారు. ఆమె భర్త కూడా చనిపోయారు. ఆరోగ్యం కూడా సహకరించడంలేదని దీనంగా వివరించారు.

ఆమె ఆర్టీఐని ఆశ్రయించి తన తల్లిదండ్రుల అకౌంట్‌ వివరాలు ఇవ్వాలని వాటి ధృవప్రతులు ఇవ్వాలని, ఆ డబ్బు తీసుకోవడానికి ప్రక్రియ ఏమిటో తెలియజేయాలని అడిగారు. దానికి కూడా మీరే వివరాలు ఇవ్వాలని అంటూ వారు తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని మొదటి అప్పీలు అధికారి కూడా సమర్థించారు. ఆమె విధిలేక కమిషన్‌ ముందు రెండో అప్పీలు దాఖలుచేశారు. డిసెంబర్‌ 2016 లో వేసిన రెండో అప్పీలు సమాచార కమిషన్‌ ముందుకు మార్చి 13న వచ్చింది. పోస్టాఫీసులో పీఐఓలు సమాచారం ఇవ్వకపోవడం వల్ల వేలాది కేసులు రెండో అప్పీళ్లుగా చేరుకుంటున్నాయి. 

వేలాది కేసుల్లో సరిగ్గా సమాధానం ఇవ్వకుండా తమ ఖాతాదారులనే ఏడిపించడంలో తపాలా అధికారులు వారికి వారే సాటి. వారిని ఉద్యోగులనీ, ప్రజాసేవకులనీ, పబ్లిక్‌ సర్వెంట్‌లనీ అనడం పొరబాటవుతుంది. వారిని మహాఘనత వహించిన తపాలా రాజ్య చక్రవర్తులనీ, ప్రభువులనీ, ఏలిన వారనీ సంబోధించాలి. వారు దయఉంటే అడిగిన సమాచారం ఇస్తారు. వారు కరుణిస్తే తపాలా సేవలు అందించి మీడబ్బు మీరు ఖాతాల నుంచి తీసుకోవడానికి సహాయం చేస్తారు. లేదా కొంత వాటా ఇచ్చుకోవాలి. కనీసం విచారణ నోటీసు వచ్చిన తరువాత కూడా పోస్టాఫీసు అధికారుల వైఖరి మారలేదు. మొండిగా పాత వాదనలే వినిపించారు. మొత్తానికి ఆమె డబ్బు ఆమెకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. సహాయ సూపరింటెండెంట్‌ సంజయ్‌ బిస్వాస్‌ ఏ సహాయమూ చేయలేదు. సీపీఐఓ దీనానాథ్‌ ప్రసాద్‌ ఆమెకు ఏ విధంగా సమాచారం నిరాకరించారో బిస్వాస్‌ వివరిస్తూ ఆమెకు చట్టపరంగా సమాచారం ఇవ్వడానికి వీల్లేదని సుదీర్ఘంగా వాదించారు. ఈ వ్యవహారంలో అపరాధులైన అధికారులెవరో కనిపెట్టి ఉన్నతాధికారులు శిక్షించవలసిన అవసరం ఉంది. 

తపాలాకార్యాలయం బాధ్యతల్లో వినియోగదారులకు సేవచేయడం ప్రధానమైంది. మొత్తం అధికారులకు ఉద్యోగులకు వేతనాలు అందేది ఈ వినియోగదారుల డబ్బు డిపాజిట్‌ల వల్ల వచ్చే వడ్డీ సొమ్ముతోనే. సంఘమిత్ర తల్లిదండ్రుల వంటి మదుపుదార్లు డిపాజిట్‌ చేసిన డబ్బుకు తపాలాశాఖ ధర్మకర్తగా వ్యవహరిం చాలి. ఆ డబ్బు తమ దగ్గర డిపాజిట్‌ రూపంలో ఉండ టం వల్ల వచ్చే వడ్డీని స్వీకరించి ఆ డబ్బు చెందవలసిన వారసులకు అడిగినప్పుడు ఇప్పించవలసిన బాధ్యత కలి గిన ధర్మకర్త తపాలా శాఖ అనే విషయం పూర్తిగా మరిచిపోయారు. వారసురాలిని వేధించి వెడలగొట్టి ఆ డబ్బును కాజేయాలనుకుంటున్నారనే అనుమానం వస్తున్నది. ఈ విధంగా వ్యవహరించడం ధర్మకర్తృత్వ బాధ్యతను భంగపరచడమే అవుతుంది. 

డిపాజిట్‌ డబ్బును నియమాలను అనుసరించి తిరిగి వారసులకు ఇవ్వడం వారి బాధ్యత అని కాంట్రాక్టు చట్టం నిర్దేశిస్తుంది. ఆ ఒప్పందం ఉల్లంఘనకు పరిహారం చెల్లించవలసిన బాధ్యత కూడా ఉంటుంది. ఇది కాకుండా తపాలాశాఖ సొంత ప్రయోజనాల దృష్ట్యా కూడా వినియోగదారుడి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. ఇవన్నీ మరిచిపోయింది తపాలాశాఖ. పైగా ఆర్టీఐ దరఖాస్తును కూడా అసంబంద్ధ కారణాలతో తపాలా వారు తిరస్కరించారు.  

సంఘమిత్ర కోరిన సమాచారం మొత్తం ఇవ్వాలని, వాటికి సంబంధించిన అన్ని పత్రాలు ధృవీకరించి ఉచి తంగా ఇవ్వాలని  కమిషన్‌ ఆదేశించింది. ఆమె దరఖాస్తులో వ్యక్తమైన ఫిర్యాదును గుర్తించి, జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కూడా ఆదేశించింది. సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వకూడదో చెప్పాలని, గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని సీపీఐఓ దీనానాథ్‌ ప్రసాద్‌ను కమిషన్‌ ఆదేశించింది. (సంఘమిత్ర ముఖర్జీ వర్సెస్‌ పీఐఓ తపాలాశాఖ, CIC/POSTS/A/2017/10 0006 కేసులో 16 మార్చి 2018న ఇచ్చిన తీర్పు ఆధారంగా).


వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
మాడభూషి శ్రీధర్‌
professorsridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top