మన దారి మళ్లీ ప్రకృతిలోకే!

Dileep Reddy Article On Coronavirus - Sakshi

సమకాలీనం

‘‘మనిషికి పని శిక్ష కాదు. అది అతనికి ప్రశంస. అదే అతని బలం. అందులోనే ఆనందం’’ అంటారు ప్రఖ్యాత ఫ్రెంచ్‌ నవలా రచయిత్రి జార్జ్‌ శాండ్‌ (అరోరె డుపిన్, 1804–1876 కలం పేరిది). పనే మనిషి జీవ నాధారమైన పరిస్థితుల్లో అది లేకుండా ఎన్నా ళ్లుండగలరు? చారిత్రక పోరాటాల పొత్తిళ్ల లోంచి పుట్టిన అంతర్జాతీయ కార్మిక దినో త్సవం, మేడే ముంగిట్లో... ఇదొక కోటి రూకల ప్రశ్న! ఇప్పుడు దేశమంతా, దాదాపు ప్రపంచమంతా కమ్ము కున్న కరోనా నిర్బంధపు మూసివేత (లాక్‌డౌన్‌)లో పనిలేని మనిషి ఏం చేయాలి? ఎన్నాళ్లు ఇంటికే పరిమితమవాలి? కూడబెట్టుకున్న ఆర్థిక వనరులు కరిగితే, తదుపరి జరుగుబాటెలా? విడతలుగా మూసి వేతను తొలగించుకుంటూ ముందుకు నడవడమే మనిషి చేయాల్సిన పని. గడచిన నలబై రోజులుగా మన దేశంలో లాక్‌డౌన్‌ అమలవు తోంది. కరోనా వ్యాధి వ్యాప్తిని కట్టడి చేస్తూనే నిర్బంధాన్ని క్రమంగా సడలిస్తూ జనజీవనాన్ని సాధారణ స్థితికి తేవాలనేది పాలకుల యోచన. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు యత్నం జరుగుతోంది. ఎక్కడో చిక్కుకున్న కార్మికులను స్వస్థలాలకు, స్వస్థలాల్లో చిక్కుపడి పోయిన వారిని కోరుకునే పనిప్రదేశాలకు తరలించే సన్నాహాలు మొద లయ్యాయి. ఒక్కపెట్టున లాక్‌డౌన్‌తో పుట్టెడు కష్టాలు చవిచూసిన వలసకార్మికుల విషయంలో జరిగిన తప్పిదానికిది దిద్దుబాటు చర్య! అటు సంపూర్ణ జీవి, ఇటు నిర్జీవీ కాని అర్థజీవి కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచం ఇంకా వణుకుతోంది.

సమస్త ఆర్థిక వ్యవస్థలు కుదేల య్యాయి. పదుల లక్షల్లో వ్యాధిగ్రస్తులవుతుంటే, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవస్థలన్నీ స్తంభించాయి. అంతటా స్తబ్దత అలుముకొంది. కోవిడ్‌–19 అంటువ్యాధి లోతుపాతులు నెమ్మ దిగా తెలిసి వస్తున్నాయి. విరుగుడు కోసం ఒక వంక వ్యాధి నయం చేసే మందు, మరోవంక వైరస్‌ను తట్టుకునే టీకా (వాక్సిన్‌) కోసం ప్రయోగాలు ఒక్కో దశ దాటుకుంటూ ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఇన్నాళ్లూ లాక్‌డౌన్‌ పకడ్బందిగా అమ లుచేస్తూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితే శాశ్వతం కాదు. ఇదివరకటి సాధారణ స్థితి ఇప్పుడప్పుడే రాదు. ఈ లోపున, ఓ కొత్త సాధారణ స్థితి వస్తుంది. దాన్నే అంతర్జాతీయ పరిభాషలో ‘న్యూ నార్మల్‌’ అంటు న్నారు. ఇప్పుడా సరికొత్త సాధారణ స్థితే సర్వత్రా చర్చనీయాంశ మౌతోంది. ఎలా సన్నద్ధం కావాలన్నది మానవాళి ముందున్న ప్రశ్న!

మనిషి నిజంగా మారుతాడా?
పార్కు చేసిన కారు అద్దంపై దుమ్ము పేరుకుపోవడం లేదు. నగరపు చెట్లమీదుగా బాల్కనీలోంచి పక్షుల శబ్దాలు వంటింట్లోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. నీలాకాశం నిర్మలంగా ఉంది. రాత్రిపూట కిక్కిరిసిన చుక్కలూ గిలిగింతలు పెడుతున్నాయి. కాలుష్యం లేక నదీ జలాలు పారదర్శకంగా పారి నదిగర్భం స్వచ్ఛంగా అగుపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత జలందర్‌ నుంచి వందల కి.మీ దూరంలోని హిమాలయ పర్వతాల మంచు కళ్లకు కడుతోంది. జనసంచారం, వాహనాల సందడి లేక వన్యప్రాణులు, జలచరాలు మారిన తమ పూర్వాశ్రమా ల్లోకి, ఆధునిక నిర్మాణాల్లోకి వచ్చి స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. కోవిడ్‌–19 తర్వాత ఇది శాశ్వతంగా ఉంటుందా? ఉంటుందనుకో వడం అత్యాశే కాక అశాస్త్రీయం కూడా! ప్రస్తుత నిర్బంధ స్థితిలోనే భవిష్యత్‌ మానవ మనుగడ అసంభవం! క్రమంగా అది తిరిగి చలన శీలత పొందుతుంది. అప్పుడు మళ్లీ పరిశ్రమల్లో ఉత్పత్తి, ఆకాశంలో విమానాలు, రహదారుల్లో వాహనాలు, జనావాసాల్లో జన సంచారం, ఆటలు, పాటలు, వాణిజ్యం, వ్యాపారం... అన్నీ మనిషి దినచర్యల్లో భాగమౌతాయి. కానీ, యధాతథంగా మూసివేతకు ముందరి విచ్ఛల విడితనమో, మూసివేతలోని స్తబ్దతో ఉండవు. అదే సరికొత్త సాధారణ స్థితి! ప్రపంచ గమనమే మారుతుంది.

ఇదివరకటి వాణిజ్యం అలాగే ఉండదు. అన్ని వినిమయ వస్తువులతో పాటు ఆహార ఉత్పత్తి కేంద్రాలు, వినియోగ పద్దతులు, వస్తు సరఫరా చానళ్లు, ఉద్యోగ వ్యవస్థ, సేవా రంగం... ఇలా సమస్త వ్యాపకాల్లో కొత్త క్రమత ఏర్పడుతుంది. మానవ విలువల్లోనూ మార్పు అనివార్యమౌతుంది. ప్రకృతి, పర్యావరణం వంటి అంశాల ప్రాధాన్యత తెలిసివస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో), ప్రపంచ బ్యాంకు... వంటి సంస్థల పనితీరూ మారాల్సి వస్తుంది. భద్రత, విద్య–ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల నుంచి రాజకీయ నిర్వహణ వరకు మార్పుల్ని అని వార్యం చేసేంతగా కోవడ్‌–19 ప్రపంచ గతినే ప్రభావితం చేస్తోంది. దీనికి వ్యక్తులుగా, పౌరసమాజంగా, ప్రభుత్వాలుగా ఎవరు ఏ మేరకు మారుతారు? అన్నిట్లోనూ కీలక పాత్రధారి అయిన మనిషి ప్రవర్తన, పరివర్తన ఎలా ఉండబోతోంది? అన్నదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

భయపడటమా? లొంగదీసుకోవడమా?
భూగ్రహంపై కరోనా కుదుపు అసాధారణం. మనిషి దురాశ, సహజ వనరుల దోపిడీ, ప్రకృతి విధ్వంస క్రమంలో సాగిన వికృతాల వల్లే విష వైరస్‌ల పుట్టుక అని తేటతెల్లమైంది. ఎయిడ్స్, ఫ్లూ, ఎబోలా, సార్స్‌ వంటివి పుట్టి ఎంతటి అంటు వ్యాధులకు, తద్వారా మానవ మనుగడ విధ్వంసానికి కారణమయ్యాయో కోవిడ్‌ తర్వాత బాగా తెలిసి వచ్చింది. గత నలబై రోజుల బలవంతపు మూసివేతతో కలు గులో ఊపిరాడని ఎలుకలా మనిషి పరిస్థితి మారింది. శాస్త్రసాంకేతి కతో సమస్త జీవరాశిపై తనదే ఆధిపత్యం అనుకున్న మనిషికి గర్వ భంగమైంది. జీవవైవిధ్య ప్రాధాన్యత, ప్రకృతి సమతూకాన్ని కాపా డాల్సిన ఆవశ్యకత తెలిసివచ్చాయి. మారే వాతావరణాన్ని బట్టి కరోనా వైరస్‌ తన ఆర్‌ఎన్‌యే సీక్వెన్సింగ్‌ను మార్చుకుంటుంటే వాక్సిన్‌ కనిపెట్టడం కష్టమైన పరిస్థితి! వ్యాధి ముదిరితే చికత్సకు మందులు లేవు, చికిత్స పద్ధతులూ (ప్రొటోకాల్స్‌) తెలియవు! అంటు వ్యాధి కనుక ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా చూసుకోవడం ఒక్కటే చేయగలిగిన పని. అదొకటే అందుబాటులో ఉన్న పరిష్కార మార్గమని తెలిసింది, తీసుకోవాల్సిన జాగ్రత్తలూ ఎరుకే కనుక వైర స్‌తో సహజీవనం అనివార్యమని మనసు దృ«ఢపరచుకోవడమే విజ్ఞత! భయపడి అతి జాగ్రత్తలకు పోయి, వరుస నిర్బంధాలతో ఆర్థిక వ్యవ స్థల్ని కుదేలు చేయడం మంచిది కాదు.

డబ్లుహెచ్‌వో చెప్పినట్టు గుర్తించు, పరీక్షించు, చికిత్స చెయ్‌ (త్రిబుల్‌ టీ) పద్దతిలో వ్యాధిని నియంత్రించాలి. శుభ్రత, మాస్క్‌లు ధరించడం, పని పద్దతులు మార్చుకోవడం, కనీస ఆరోగ్యసూత్రాలు పాటించడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. ప్రయోగశాలలు దాటి, ఉత్పత్తి కేంద్రాల నుంచి జనబాహుళ్యంలోకి టీకా, మందులు వచ్చే వరకు ప్రజ్ఞతో ఉండటమొక్కటే మార్గం. ఇదెంత కాలం ఉంటుందో కూడా తెలియదు. ఇదే మన జీవనశైలి అయినా ఆశ్చర్యం లేదు. ఇన్నాళ్లు మనతో ఉన్న వేర్వేరు బాక్టీరియా, వైరస్‌లలాగే కరోనా ఒకటని గ్రహించాలి. సహజీవనం చేస్తూనే, అవగాహనతో తగు జాగ్ర త్తలు తీసుకుంటూ మనిషి దాన్ని నియంత్రణలో ఉంచడం ఇప్పట్లో చక్కటి పరిష్కారం. అవసరమైన మేర పరీక్షలు జరుపకుంటేనో, లక్షణాలున్నా భయంతో పరీక్షలకు జడిసి తప్పించుకుంటేనో... కఠిన లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లు ప్రజానీకం చేసిన త్యాగాలు, ప్రభుత్వ వ్యవస్థల కృషి అంతా వృధా! భయంతో వ్యాధి వ్యాప్తికి దోహదపడటం కాకుండా ప్రజ్ఞతో ఎవరికివారం ఆ గొలుసును ఛేదించాల్సిన సమయ మిది. తన భిన్నత్వాన్ని మనిషి జ్ఞానం ద్వారా చాటాలి.

గతం పునరావృతం... భవిత డిజిటల్‌ మయం
‘అరవైలు, డెబ్బైలలో పుట్టిన మనం అదృష్టవంతులం...’ అంటూ ఒక ఆసక్తికర కథనం సామాజిక మాధ్యమాల్లో తరచూ చక్కర్లు కొడుతుం టుంది. అప్పట్లో... ఆరుబయట ఎండల్లో ఆడటాలు, అరకొర వస్తు వైభోగం, రేడియో–టీవీ కొత్తదనం, పనులన్నీ సొంతంగా చేసుకో వడం, పళ్లుకూరగాయలు బాగా తినటం, సమిష్టికుటుంబాల్లో కలివి డిగా తిరగటం... వంటివన్నీ అందులో గుర్తు చేస్తారు. లాక్‌డౌన్‌లో అవన్నీ మనకిపుడు తిరిగి అనుభవానికి వస్తున్నాయి. ఇస్త్రీలేని బట్టలు ధరించడం, పనులన్నీ సొంతంగా చేసుకోవడం, సాత్వికాహారం ఇష్టంగా తినటం, రోగనిరోధక శక్తి కోసం కాయగూరలు పళ్లు ఎక్కువ తీసుకోవడం, విలాస వస్తువ్యామోహం లేకుండా ఉన్నదానితో సరి పెట్టుకోవడం, మొక్కలకు, ఇంటెనక పెరళ్లకు, పొలాలకు, సమీపం లోని అడవులకు విలువివ్వటం... ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత అవుతుంది. వాటి ప్రాధాన్యత మళ్లీ ఇప్పుడు తెలిసొ స్తోంది. బస్సులు, రైళ్లు, విమానాలు, షాపింగ్‌ మాళ్లు, సినిమాలు... ఇంకా చాలా చాలా లేకుండా వరుసగా నెల రోజులకు పైనే ఉండాల్సి వస్తుందని, ఉంటామని మనమెవరమూ అనుకున్నది కాదు. ఉండలే మేమో అని ఊహల్లో సందేహించినా... ఉండగలుగుతున్నామన్నది కఠిన వాస్తవం.

తప్పుడు అంచనాలకు– వాస్తవ అనుభవాలకు మధ్య ఓ ఘర్షణ! మేలైన పాత పద్ధతులు, సంప్రదాయ జీవన విధానంలోని మంచికి ఎప్పటికైనా ఆధరణ ఉంటుందనేదే కోవిడ్‌–19 నేర్పుతున్న పాఠం. అలా అని ఆధునికత ప్రభావం చూపదనుకుంటే పొరపాటే! టెక్నాలజీని అందిపుచ్చుకొని పనితీరును మరింత ఆధునీకరించుకో వాల్సి వస్తోంది. ఐటీ, సేవా తదితర రంగాల్లో ఆన్లైన్‌ ద్వారా ఉద్యో గులు ఇంటినుంచి పనిచేయడం భారత్‌లో ఇన్నాళ్లు నామమాత్రంగా ఉండేది. పరిమిత సిబ్బందిని ఆఫీసుకు పిలిచి, ఇళ్ల నుంచే మెజారిటీ సిబ్బందితో ఎలా పనితీసుకోవచ్చో పెద్ద పెద్ద కంపెనీలూ తెలుసుకుం టున్నాయి. మున్ముందు పనిక్రమం, పద్ధతుల్లోనూ సమూల మార్పులు రానున్నాయి. వనరుల పొదుపు మొదలవుతుంది. ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. విద్య, వైద్యం వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఒత్తిడి ప్రభుత్వాలపై పెరుగుతుంది. కరోనా వంటి విపత్తులు ఎన్నొచ్చినా.. భవిష్యత్తులో గట్టిగా నిల బడాలంటే ఒక్కటే బలమైన సమాధానం, సరికొత్త సాధారణ స్థితి.... ఫ్రెంచ్‌ తత్వవేత్త రూసో చెప్పినట్టు, సాగాలి మన ప్రయాణం ‘మళ్లీ ప్రకృతి లోకి’.

దిలీప్‌ రెడ్డి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top