వరిగల వంటలు

Varigala cuisine special special - Sakshi

వరిగ సమోసా
కావలసినవి:  వరిగ పిండి – ఒక కప్పు గోధుమ పిండి – ఒక కప్పు ఉప్పు – తగినంత బంగాళ దుంపలు – 2 నూనె – తగినంత ఆవాలు – ఒక టీ స్పూను  ఉల్లి తరుగు – పావు కప్పు ఉడికించిన బఠాణీ – పావు కప్పు తరిగిన పచ్చి మిర్చి – 3 కరివేపాకు – ఒక రెమ్మ

తయారీ: 
ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ చపాతీపిండిలా ముద్ద చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా ఒత్తి, మధ్యలోకి కట్‌ చేసుకోవాలి. బంగాళదుంపలను ఉడికించి తొక్క తీసి, చేతితో మెత్తగా అయ్యేలా మెదపాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాచాలి. ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి. ఉడికించిన బఠాణీ, ఉడికించిన బంగాళ దుంప, ఉప్పు జత చేసి అన్ని కలిసేలా బాగా కలియ»ñ ట్టి దింపేయాలి. ఒత్తుకున్న చపాతీలను సమోసా ఆకారంలో చుట్టి, అందులో బంగాళదుంప మిశ్రమం కొద్దిగా ఉంచి మూసేయాలి. ఈ విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక,  తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి. టొమాటో సాస్‌తో వేడి వేడి సమోసాలు అందించాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
వరిగలు(Proso Millet)
నియాసిన్‌  (Niacin)mg (B3)    2.3
రిబోఫ్లావిన్‌ (Rivoflavin)mg (B2)     0.18
థయామిన్‌ (Carotene)ug        0
కెరోటిన్‌  (Iron)mg        5.9
ఐరన్‌  (Calcium)g        0.01
కాల్షియం  (Calcium)g        0.01
ఫాస్పరస్‌  (Phosphorous)g    0.33
ప్రొటీన్‌  (Protein)g        12.5
ఖనిజాలు  (Minerals) g        1.9
పిండిపదార్థం (Carbo Hydrate) g    68.9
పీచు పదార్థం(Fiber) g        2.2
పిండిపదార్థము పీచు నిష్పత్తి  (Carbo Hydrate/Fiber Ratio)    31.31

వరిగ ఇడ్లీ
కావలసినవి:  వరిగ ఇడ్లీ రవ్వ – ఒక కప్పు మినప్పప్పు – ఒక కప్పు ఉప్పు – తగినంత

తయారీ: మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వరిగ ఇడ్లీ రవ్వ, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి, రాత్రంతా పులియబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ పిండిని ఇడ్లీ రేకులలో ఇడ్లీలుగా వేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి. కొబ్బరి చట్నీ, సాంబారులతో తింటే రుచిగా ఉంటుంది.

వరిగ కాజా
కావలసినవి:  వరిగ పిండి – అర కప్పు, గోధుమ పిండి – అర కప్పు నూనె – డీప్‌ ఫ్రైకి తగినంత,  పాకం కోసం బెల్లం పొడి – అర కప్పు ఏలకుల పొడి – ఒక టీ స్పూను

తయారీ:  ఒక పాత్రలో వరిగ పిండి, గోధుమ పిండిలో కొంత భాగం వేసి కలపాలి. వేడి నూనె జత చేసి మెత్తటి ముద్దలా తయారుచేసుకోవాలి. రొట్టెలాగ అంగుళం మందంలో పొడవుగా ఒత్తి, రోల్‌ చేయాలి. ఆ రోల్‌ని ముక్కలుగా కట్‌ చేయాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కట్‌ చేసి ఉంచుకున్న కాజాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి. బెల్లం పొడిని ఒక పెద్ద గిన్నెలో వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచాలి. తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి. ఏలకుల పొడి వేసి దింపేయాలి. వేయించి ఉంచుకున్న కాజాలను పాకంలో వేసి సుమారు అర గంట సేపు మూత పెట్టి ఉంచాలి. బాగా పాకం పీల్చుకున్న కాజాలను ప్లేట్‌లో ఉంచి అందించాలి. 

వరిగ బర్ఫీ
కావలసినవి:  వరిగ పిండి – ఒక కప్పు, బెల్లం పొడి – అర కప్పు నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను, నీళ్లు – పావు కప్పు ఏలకుల పొడి – అర కప్పు, బాదం పప్పులు – 10

తయారీ:  ఒక ప్లేటుకి నెయ్యి పూసి పక్కన ఉంచాలి. మందపాటి గిన్నెలో బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. వరిగ పిండి వేసి పచ్చి వాసన పోయి, సువాసన వచ్చేవరకు వేయించాలి. కరిగించిన బెల్లం పాకం, ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి. బాగా గట్టిపడుతుండగా, నెయ్యి జత చేస్తూ ఆపకుండా కలిపి, బాగా ఉడకగానే దింపేయాలి. నెయ్యి పూసుకున్న ప్లేట్‌లో వేసి సమానంగా పరిచి, పైన బాదం పప్పులు వేయాలి. కొద్దిగా చల్లారుతుండగా, చాకుతో ముక్కలుగా కట్‌ చేయాలి. చల్లారాక ప్లేట్‌లో ఉంచి అందించాలి. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top