సాహసి | Neerja Bhanot life story | Sakshi
Sakshi News home page

సాహసి

Mar 6 2016 2:08 AM | Updated on Sep 3 2017 7:04 PM

సాహసి

సాహసి

అందరూ అన్నీ కావాలని చేయకపోవచ్చు. అందుకే ఎవరివల్ల అయినా తప్పు జరిగితే... తొందరపడి వాళ్లని విమర్శించకూడదు.

అందరూ అన్నీ కావాలని చేయకపోవచ్చు. అందుకే ఎవరివల్ల అయినా తప్పు జరిగితే... తొందరపడి వాళ్లని విమర్శించకూడదు. ఎవరికి తెలుసు... రేపు ఏదైనా కారణం వల్ల మనకు తెలియకుండానే మనమూ ఆ తప్పు చేస్తామేమో!
 -  నీరజా భనోత్
 
 విధి చాలా బలమైనది. దాన్ని ఎదిరించడం ఎవరి తరమూ కాదు. ఎదిరించాలని ప్రయత్నిస్తే ప్రాణమే పోవచ్చు. కానీ ప్రాణం పోయినా ఫరవాలేదంటూ విధికి ఎదురు నిలిచి చేసే పోరాటం మాత్రం... చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నీరజా భనోత్ ఈ లోకానికి చెప్పిన వాస్తవమిది. నీరజ... ఓ సాహసి. అనుకోకుండా ముంచుకొచ్చిన ఉపద్రవం నుంచి కొందరిని కాపాడ్డానికి తన ప్రాణాలను ఒడ్డిన త్యాగశీలి.
 
 సెప్టెంబర్ 5, 1986. ముంబై నుంచి కరాచీ మీదుగా న్యూయార్‌‌క వెళ్లాల్సిన విమానం మేఘాలను చీల్చుకుంటూ ముందుకు సాగిపోతోంది. సరిగ్గా ఉదయం 4:30కి కరాచీ విమానాశ్రయంలో దిగింది. అక్కడ దిగాల్సినవాళ్లు దిగారు. ఎక్కాల్సినవాళ్లు ఎక్కారు. విమానం మళ్లీ గాల్లోకి లేవనుంది. సరిగ్గా అప్పుడే మూడు సార్లు తుపాకి పేల్చిన చప్పుడు. ఒక్క సారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.
 
  ఏమయ్యిందో అర్థంకాక అయోమయంగా చూశారు. ఎదురుగా ఎయిర్‌పోర్‌‌ట సెక్యూరిటీ దుస్తులు వేసుకున్న నలుగురు సాయుధులు. కళ్లతోనే నిప్పులు కురిపిస్తున్నారు. తుపాకులు చూపిస్తూ అందరినీ చేతులు వెనక్కి పెట్టుకొమ్మని ఆదేశించారు. పెట్టుకున్నాక కట్టేశారు. చివరికి కెప్టెన్‌ని, కో-పెలైట్‌ని, కాక్‌పిట్ క్రూని కూడా బంధించారు. ఒకే ఒక్కరిని తప్ప. ఆమే... నీరజా భనోత్. పంజాబ్‌లో పుట్టి, ఫ్లయిట్ అటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఇరవే రెండేళ్ల యువతి.
 
 హైజాకర్లు విమానం ఎక్కగానే క్రూ మెంబర్‌‌సని అలర్‌‌ట చేసింది నీరజ. దాంతో పైలట్లు తమ విజ్ఞానాన్ని ఉపయోగించి ఫ్లయిట్‌ను ఎగరకుండా చేసేశారు. ఆ తర్వాత విమానాన్ని హైజాక్ చేయాలన్న దుండగుల పథకం ఫెయిలైంది. దాంతో వాళ్ల కోపం కట్టలు తెంచుకుంది. సైప్రస్‌కు విమానంతో సహా వెళ్లి, అక్కడ జైల్లో ఉన్న తమవారిని విడుదల చేయించాలన్న ప్లాన్ బెడిసి కొట్టడంతో ఆ ప్రతాపం ప్రయా ణీకుల మీద చూపించడం మొదలు పెట్టారు. కొందరిని చంపేశారు. మిగిలిన వాళ్ల పాస్‌పోర్టులు సేకరించమని నీరజకు పురమాయించారు.
 ఎవరైనా అయితే బెదిరిపోయేవారు.  ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బెంబేలు పడేవారు. కానీ అక్కడున్నది నీరజ. ధైర్యం ఆమె నరనరాల్లోనూ ఉంది. అందుకే ఏం చేయాలా అని ఆలోచిం చింది. ఫ్లయిట్ అటెండెంట్‌గా అందరినీ సౌకర్యంగా ఉంచే ఆమె, ఇప్పుడు అందరినీ ఎలా కాపాడాలా అన్న ఆలో చనలో పడింది.
 
  కొంతమంది పాస్ పోర్టులు దాచేసింది. ఉగ్రవాదులు కొందరిని హింసించబోతే అడ్డుకుంది. వాళ్లను కట్టడి చేసేందుకు పదిహేడు గంటలపాటు ప్రయత్నించింది. కానీ చివరికి ఉగ్రవాదులు సహనం కోల్పో యారు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. వేగంగా కదిలింది నీరజ. ఎమర్జెన్సీ ద్వారం గుండా ప్రయాణీకుల్ని తప్పించే ప్రయత్నం మొదలుపెట్టింది. అయితే ఆ విషయాన్ని ఉగ్రవాదులు పసిగట్టేశారు. అందుకు శిక్షగా ఆమె ప్రాణాలనే తీసేసుకున్నారు.
 
 నీరజ మరణం అందర్నీ కలచి వేసింది. ఆమె సాహసానికి ప్రభుత్వం అశోకచక్ర అవార్డును ప్రకటించింది. ఆ అవార్డును అందుకున్న తొలి మహిళ, అతి  పిన్న వయస్కురాలు నీరజ. ఆ రోజు ప్రాణాలతో బయటపడిన వాళ్లంతా ఇప్పటికీ నీరజను తలచుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఉగ్రవాదులు ఫ్లయిట్ ఎక్కేటప్పటికి ఎంట్రన్స్ దగ్గర ఉన్న నీరజకు పారిపోయే అవకాశం ఉన్నా పారిపోలేదని చెబుతుంటారు.
 
 పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో వాళ్లు తనను షూట్ చేస్తున్నా కూడా... భయపడి పరుగులు తీయకుండా, తనను ఏమీ చేయవద్దని వాళ్ల కాళ్లమీద పడకుండా నిలిచిన సాహ సాన్ని పొగుడుతూ ఉంటారు. మరణం చేరువవుతున్న సమయంలో కూడా... ఓ ముగ్గురు చిన్నారులకు రక్షణ కవచంలా నిలబడి మరీ మృత్యువును ఆహ్వానించిన ఆమె త్యాగానికి సలాం కొడుతుంటారు. తన సాహసాన్ని త్యాగ నిరతిని చరిత్రలో రక్తంతో లిఖించింది నీరజ. ఆ పుటను తిరగేసిన ప్రతిసారీ మన మనసు చెమ్మగిల్లుతూనే ఉంటుంది.            

Advertisement
 
Advertisement
Advertisement