తను లేకుండా బతకలేను... ఎలా? | life problem quotes | Sakshi
Sakshi News home page

తను లేకుండా బతకలేను... ఎలా?

Nov 22 2015 8:19 AM | Updated on Sep 3 2017 12:49 PM

తను లేకుండా బతకలేను... ఎలా?

తను లేకుండా బతకలేను... ఎలా?

నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లయ్యింది. ఇంతవరకూ ఉద్యోగం సంపాదించలేక పోయాను.

నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లయ్యింది. ఇంతవరకూ ఉద్యోగం సంపాదించలేక పోయాను. ఆ కోచింగ్ ఈ కోచింగ్ అంటూ  సమయం వృథా చేశాను. నేనే రంగానికి సరి పోతానో ఇంతవరకూ తెలుసుకోలేక పోయాను. ఈ బలహీనతను ఎలా అధిగమించాలి?
 - షేక్ పాషావలి, గుంతకల్లు

చాలామంది చేసే తప్పు ఇది. తొందరగా గ్రహించారు... కంగ్రాట్స్. చదువుకు సరిపడా ఉద్యోగం వచ్చే వరకూ విద్యార్థులు ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉన్నామని చెప్పుకోవడం నామోషీ కాబట్టి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో చేరతారు. అలా కాకుండా ఎంత చిన్న ఉద్యోగమైనా సరే, ముందు చేరిపోయి, అంచెలంచెలుగా ఎదగాలి. ఒక వయసు వచ్చాక కూడా మరొకరి మీద ఆధారపడటం ఆత్మ న్యూనతా భావాన్ని పెంచుతుంది. మనం ఏ రంగానికి సరిపోతామో, ఏ ఉద్యోగంలో నిలదొక్కుకోగలుగుతామో ముందే ఎవరు చెప్పగలరు? సి.ఎ. రిజల్ట్స్ రాకముందే నేను 250 రూపాయల ఉద్యోగంలో చేరి, అక్కడే అంచెలంచెలుగా ఎదిగాను. రచన నా వృత్తి అవుతుందనుకోలేదు. ఇది ఎందుకు చెబుతున్నానంటే, ముందు ఉద్యోగంలో చేరండి. లేదా సొంతంగా ఏదైనా వృత్తి ప్రారంభించండి. ఆ తరువాత మీకు కావలసిన రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయవచ్చు. ప్రయాణం చెయ్యదలచుకుంటే ట్రైన్ ఎక్కాలి. మంచి ట్రైన్ వచ్చేవరకూ ఎక్కననేవాడు జీవితాంతం ప్లాట్‌ఫారం మీదే ఉండిపోతాడు. 
 
నా వయసు 23. నాకో మరదలు ఉంది. తనంటే నాకు పిచ్చి ప్రేమ. కానీ మేనరికం చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరని మావాళ్లు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. నా మరదలు లేకుండా నేను బతకలేను. చిన్న కారణంతో తనను నాకు దూరం చేయడం న్యాయమా?
 - నవీన్, మెయిల్
 
మేనరికం చేసుకుంటే అవలక్షణమైన సంతానం కలుగుతుందని కొందరు వాదిస్తారు. అలాంటిదేమీ లేదని మరి కొందరు అంటారు. నాతో సహా చాలా మంది మొదటి వాదననే నమ్ముతారు. రక్త సంబంధం చేసుకున్న ఒక వంశం మీద ఇటీవలి కాలంలో ఓహియో స్టేట్ యూని వర్శిటీ వాళ్లు ప్రయోగాలు చేశారు. మేనరికం చేసుకున్న దంపతుల తాలూకు నాలుగు తరాలకు సంబంధించిన ఇరవై అయిదు కుటుంబాల వివరాలు సేకరించారు. అందులో నూట డెబ్భై ఆరు కుటుంబ సభ్యులు ఉన్నారు. గణాంకాలు తయారు చేస్తే... ఆ 176 మందిలో ఇరవై ఒక్కరు పదేళ్లలోపే మరణించారని తేలింది. నలుగురు దంపతులకి సంతానం లేదు. ఎనిమిది మంది అంగవైకల్యంతో ఉన్నారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన డార్విన్ అమ్మమ్మ, నాయనమ్మలవి కూడా మేనరికాలే. 
 
అతడూ మేనరికమే చేసుకున్నాడు. ఆయనకి పదిమంది సంతానం. వారిలో ముగ్గురు పదేళ్లలోపే చనిపోయారు. మరికొందరు పిల్లలకు సంతానం కలగలేదు. కొందరు మనవలు అంగవైకల్యంతో జన్మించారు. ఈ విధంగా... మేనరికంలో మొదటి తరం సంతానం బాగున్నా, రెండు మూడు తరాలకొచ్చేసరికి ఎక్కడో ఒక చోట దెబ్బ కొడుతుందని పరిశోధకులు తేల్చారు. ముప్ఫై ఆరు రకాల బఠాణీల థియరీ రూపొందించిన జన్యు శాస్త్రజ్ఞుడు మెండల్ కూడా ‘స్వపరాగ సంపర్కం వల్ల మొక్కలు బలహీనంగా పుడతాయి’ అని నిర్ధారించాడు. మెండల్ థియరీ వీలైతే చదవండి. మీకు ప్రస్తుతం ఇరవై మూడేళ్లు. ఆ వయసులో ప్రేమ పిచ్చిగానే ఉంటుంది. ఇంకో రెండేళ్లు ఆగితే మీలో మెచ్యూరిటీ పెరుగుతుంది. అప్పుడు పిచ్చి తగ్గి, నిజమైన ప్రేమ పెరుగుతుంది. మీ మూర్ఖత్వంతో అంగ వైకల్యం గల పిల్లల్ని సృష్టించకండి. వారు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరు. అలాంటి పిల్లలు ఇంట్లో సంచరిస్తూ ఉంటే మీకూ, మీ మరదలికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఇదంతా అనవసర భయం అనుకుంటే మీ ఇష్టం.
 
చదువుపై శ్రద్ధ ఉంది. జ్ఞాపక శక్తి శూన్యం.  ఏం చేయాలి?
- స్రవంతి, మెయిల్

శారీరకంగా ఏదో ఒక అనారోగ్యం ఉంటే తప్ప, ఏ విద్యార్థికీ ‘జ్ఞాపకశక్తి లేమి’ ఉండదు. దాదాపు అందరికీ ఒకే పరిణామంలో విషయాలు గుర్తుంటాయి. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ‘ఆర్కి మెడీస్ సూత్రమా? ఐశ్వర్యారాయా?’ అనేది ఆ విద్యార్థి తాలూకు స్నేహ బృందం మీద, అభిరుచుల మీద, అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. నిరంతరం మనసులో కదలాడే విషయాలే ఎక్కువ గుర్తుంటాయి. ధోనీ, కోహ్లీల కెప్టెన్సీల్లో తేడా స్నేహితులతో చర్చిస్తాడే తప్ప... ప్రొటోజోవా, పొరిఫెరాల మధ్య తేడా ఎన్నడూ చర్చించడు. అందుకే అతడికి ‘అత్తారింటికి దారేది’లో హీరో పేరు గుర్తుంటుంది కానీ ‘అనాలసిస్ ఆఫ్ ఆటమ్’ గుర్తుండదు. జ్ఞాపకశక్తి పెరగా లంటే అనవసరమైన విషయాల మీద శ్రద్ధ తగ్గించాలి. సినిమాలు, టీవీలు చూడటం తగ్గించండి. రోజూ రాత్రి పడుకోబోయే ముందు పది నిమిషాల పాటు చదువుకుని ఆ తరువాత ఎవరితో మాట్లాడకుండా పడుకోండి. పొద్దున్నే అయిదింటికి లేచి, చదవడానికి ప్రయత్నించండి. స్నేహితులతో కబుర్లు కూడా తగ్గించండి.                 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement