
వెండితెరకు ఏడాదంతా వర్షాకాలమే
చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే అంటూ... ఒక తరం సినిమాలు పాటలు పాడాయి.
బాలీవుడ్ బీట్
చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే అంటూ... ఒక తరం సినిమాలు పాటలు పాడాయి. తర్వాతి తరంలో... వానా వానా వెల్లువాయె... కొండ కోన తుళ్లిపోయే... అంటూ ఓ జంట వానజల్లులో తడుస్తూంటే వెండితెరకు వెయ్యి కళ్లొచ్చాయి. జల్లంత కవ్వింత కావాలిలే... అంటూ పడుచు పిల్ల గంతులేస్తుంటే... కెమెరా చూపు తిప్పుకోలేకపోయింది. అలాగే... ఈ భామలు హిందీలో అదే పనిలో ఉన్నారు.
వాన చినుకు సవ్వడి అందెల రవళిలా మారుమోగినట్లు రెచ్చిపోయి వర్షంలో తడుస్తున్నారు. ప్రేక్షకులకు ఏడాదంతా వర్షాకాలం మధురిమలను అందిస్తున్నారు. వర్షం... వర్షాకాలం గురించి వాళ్లు చెప్పిన కబుర్లు...
ఐశ్వర్యారాయ్
వర్షం ఎంత ఆనందాన్నిస్తుందో వర్షం కారణంగా షూటింగ్ ఆగితే అంత ఆందోళనగా ఉంటుంది. ఆగిన రోజు వర్క్‌కోసం డేట్స్ ఎలా అడ్జస్ట్ చేయాలో తెలియక సతమతమయ్యేదాన్ని. ఇప్పుడైతే మా పాపాయితో కలిసి నేనూ వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నాను.
అమృతారావ్
వర్షం సీన్లలో నటించేటప్పుడు పెద్దగా ఎంజాయ్ చేయలేను, కానీ వర్షాన్ని బాగా ఎంజాయ్ చేస్తాను. సీన్ చేసేటప్పుడు నా పాత్ర పలికించాల్సిన భావాలే నా ముఖంలో కనిపించాలి. నిజంగా వర్షంలో తడిచేటప్పుడు నా ఆనందం నా సొంతం. షూటింగ్‌కి బయలుదేరేటప్పుడు వర్షం వస్తే కలిగే చిన్నపాటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే వర్షం కురుస్తుంటే మనసంతా చాలా ఆనందంగా ఉంటుంది.
దీపికా పడుకొనె
మాన్‌సూన్ సీజన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఇప్పటికీ వర్షం వస్తే చిన్నపిల్లనై పోతాను. షూటింగ్ సమయంలో తడిస్తే మేకప్, కాస్ట్యూమ్స్ పాడయి పని ఆగిపోతుందనే భయంతో ఆగిపోతానంతే. వేసవిలో రెయిన్ సీన్ చేయడం చాలా ఇష్టం.
కరీనా కపూర్
నాకు వర్షం అంటే ఎంతిష్టమో అంత భయం కూడా. చిన్నపాటి వర్షంలో తడిసినా వెంటనే జుట్టు గురించే ఆలోచిస్తాను. ఈ కాలంలో జుట్టును తడిగా ఉంచకూడదు. వాన పాట షూటింగ్ చేశాక మరీ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అసలే సైఫ్‌కి నా జుట్టంటే చాలా ఇష్టం. కట్ చేయడానికి ఒప్పుకోడు.