యువకుల్లారా జాగ్రత్త! | Rowdy Sheeters in Hyderabad | Sakshi
Sakshi News home page

యువకుల్లారా జాగ్రత్త!

Aug 16 2014 3:43 PM | Updated on Sep 4 2018 5:07 PM

యువకుల్లారా జాగ్రత్త! - Sakshi

యువకుల్లారా జాగ్రత్త!

హైదరాబాద్‌లో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి.

హైదరాబాద్‌లో రౌడీషీటర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌లు భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. కొంతమంది రౌడీషీటర్లు జైలు నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొందరు నేరగాళ్ళు యువకులకు డబ్బు ఎరజూపించి వారిని కూడా ఉపయోగించుకుంటున్నారు. చిన్నాచితక నేరాలపై అరెస్ట్‌ అయివారిని రౌడీషీటర్లు చేరదీస్తున్నారు. వారికి బెయిల్‌ రావడానికి ఈ గ్యాంగ్‌లు సహకరిస్తున్నాయి. దాంతో వారు నేరగాళ్లుగా మారిపోతున్నారు.  రియల్‌ ఎస్టేట్‌ దందాలు, ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌లలో  రౌడీషీటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.  ప్రైవేట్‌ ప్లేసుల్లో దాడులకు కూడా పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.  గ్యాంగ్‌లు రౌడీషీటర్లను అణచివేయడానికి పోలీసులు కూడా అదే స్థాయిలో తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు.  అయినా ఫలితం కనిపించడంలేదు.

రౌడీషీటర్ల ప్రైవేట్‌ దందాలకు పాల్పడుతూ తమలోతాము పరస్పర దాడులు చేసుకుంటూ బీభత్సం సృష్టిస్తున్నారు. నేరసామ్రాజ్యాన్ని విస్తరించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీళ్ళ ఆగడాలు ఆగడం లేదు. ఇప్పటికే నగరంలో పేరు మోసిన ఇద్దరు రౌడీషీటర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లో కైసర్‌ గ్యాంగ్‌ ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌లు చేస్తున్నాయి. కౌసర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసినప్పటికీ జైలు నుండి వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్త గ్యాంగ్‌ను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం. రియల్‌ ఎస్టేట్‌కు సంబందించిన తగాదాలు, మనీ సెటిల్‌మెంట్‌లు వీళ్ళ కనుసన్నల్లో జరిగిపోతున్నాయి. గతంలో నాంపల్లిలో రౌడీ మూకలు వేటాడి, వెంటాడి దారుణంగా హత్య  చేశాయి.

చిన్నాచితక నేరాల్లో అరెస్ట్‌ అయిన యువకులను ఈ గ్యాంగ్‌లు వల వేసి పట్టుకుంటున్నాయి. వారిని జైల్లోనే ఈ రౌడీషీటర్లు చేరదీస్తున్నారు. నేరప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నారు. అంతే కాకుండా వారికి బెయిల్‌ రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్లు బయటకు వెళ్ళిన తర్వాత చేయాల్సిన యాక్షన్‌ ప్లాన్‌ను వీళ్ళ ద్వారా రౌడీ షీటర్లు అమలు చేస్తున్నారు. జైలు నుండి విడులయ్యే యువకులకు సుఫారీలిచ్చి నేర ప్రపంచాన్ని విస్తరించుకుంటున్నారు.

ఇలాంటి వారిపై ఉక్కుపాదం మోపడానికి నగర సిటి కమీషనర్‌  ఇప్పటికే సీరియస్‌గా ప్లాన్‌ చేస్తున్నారు.  కరుడుకట్టిన రౌడీ షీటర్‌ కైసర్‌, మరో రౌడీషీటర్‌పై పిడి యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. చిన్న నేరాలు చేసిన యువకులు వీరివైపు మళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. యువత నేర ప్రపంచంలోకి అడుగుపెట్టకుండా చిన్నచిన్న నేరాలు చేసేవారికి కౌన్సిలింగ్ నిర్వహించాలి. వారు బెయిలు పొందే విషయంలో రౌడీషీటర్లు కాకుండా స్వచ్చంద సంస్థలు సహాయపడేవిధంగా చర్యలు తీసుకోవలసి అవసరం ఉంది. పొరపాటున తెలిసోతెలియకో మొదటిసారి తప్పులు చేసిన యువకులు ఈ రౌడీషీటర్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement