స్త్రీలోక సంచారం

Womwens empowerment:Rehana Fathima suspended by BSNL after arrest - Sakshi

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసి గత అక్టోబర్‌లో వార్తల్లోకి వచ్చిన రెహానా ఫాతిమా అనే 32 ఏళ్ల కేరళ మోడల్, సామాజిక కార్యకర్త, బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. కంపెనీలో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్న రెహానా ఫాతిమాపై తాజాగా కేసు నమోదైంది. అయ్యప్ప భక్తురాలి వస్త్ర, వేషధారణల్లో నల్లరంగు చొక్కా ధరించి, మెడలోను, చేతికి రుద్రాక్ష మాలలు వేసుకుని, నుదుటిపై విభూది దిద్దుకుని అయ్యప్పస్వామిలా కూర్చొని, తొడభాగం కలిపించేలా తీయించుకున్న ఫొటోను ఆమె తన ఫేస్‌బుక్‌లో పెట్టడంపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. ఇదే విషయమై బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. కూడా ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. దీనిపై ఫాతిమా భర్త స్పందిస్తూ, ‘‘దిగంబర సన్యాసులు పూజలు అందుకునే ఈ దేశంలో.. ఒక మహిళ తన తొడభాగం కనిపించేలా ఫొటో తీయించుకోవడం ఏ విధంగా మతవ్యతిరేక చర్య అవుతుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి 10–50 వయసులో ఉన్న మహిళల్ని కూడా అనుమతిస్తూ సుప్రీంకోర్టు గత సెప్టెంబర్‌లో తీర్పును ఇచ్చాక అక్టోబర్‌లో తొలిసారి ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు దర్శనం కోసం ప్రయత్నించిన తొలి మహిళగా ఫాతిమా గుర్తింపు పొదారు. శబరిమలకు బయల్దేరడానికి ముందు తీయించుకున్న ఫొటోనే ఆమె ఇప్పుడు తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి వివాదంలో చిక్కుకున్నారు. 

‘ఆకాశంలో సగం’ స్త్రీ. ఆ ఆకాశంలో యుద్ధనౌకల విమానాల్ని చక్కర్లు కొట్టించే స్త్రీ.. శుభాంగి స్వరూప్‌. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై ఏళ్లకు భారత నౌకాదళంలోకి పైలెట్‌గా అడుగుపెట్టిన తొలి మహిళ శుభాంగి. సరిగ్గా ఏడాది క్రితం ఆమె నేవీ పైలెట్‌గా చార్జి తీసుకున్నారు. మహిళా లోకాన్ని రీచార్జ్‌ చేశారు. శుభాంగి.. బరేలీ (ఉత్తరప్రదేశ్‌) అమ్మాయి. కేరళలోని కన్నూర్‌ దగ్గరి ఎళిమల ‘నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ’ లో తొలి మహిళా బ్యాచ్‌లో ట్రైనింగ్‌ పూర్తి చేసుకుంది. నేవీ పైలెట్‌ పోస్ట్‌కు ఎంపికైన తొలి మహిళగా గుర్తింపు పొందింది. ఇవాళ ఇండియన్‌ నేవీ డే. మన నౌకాదళానికి, నౌకాదళ విమాన తొలి మహిళా పైలట్‌ శభాంగికి మనస్పూర్తిగా శుభాభినందనలు తెలియజేయవలసిన సందర్భం. 

నాగాలాండ్‌లో ఏటా జరిగే ‘హార్న్‌బిల్‌ ఫెస్టివల్‌’ డిసెంబర్‌ 1న ప్రారంభమైంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది టూరిస్టులు వస్తారు. ఈ సందర్భంగా మహిళా టూరిస్టులు, స్థానిక మహిళల కోసం భారత ప్రభుత్వం ‘112 ఇండియా’ అనే మొబైల్‌ యాప్‌ని ఆవిష్కరించింది. ఆ యాప్‌ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంటే, ప్రమాదంలో ఉన్నప్పుడు అందులోని ‘షౌట్‌’ అనే ఫీచర్‌ ద్వారా.. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ కనెక్ట్‌ అయి తక్షణం పోలీసులు, వలంటీర్ల నుంచి బాధిత మహిళకు ఆపత్కాల సహాయ సహకారాలు లభిస్తాయి. దేశంలో హిమాచల్‌ ప్రదేశ్‌ తర్వాత మహిళల భద్రత, రక్షణల కోసం ఇలా సింగిల్‌ నెంబర్‌ ఎమర్జెన్సీ మొబైల్‌ అప్లికేషన్‌ సదుపాయం ఉన్న రెండో రాష్ట్రం నాగాలాండే కాగా, ఈశాన్యంలో ఇదే మొదటి రాష్ట్రం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top