లక్ష్మణుడు ఎందుకు నవ్వాడు?

Why laxman laugh? - Sakshi

రావణుడు మరణించిన తరువాత కపి సైన్యంతో విభీషణ, అంగద, సుగ్రీవులతో, సీతాలక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటున్నాడు రాముడు. శ్రీ రామ పట్టాభిషేకం అట్టహాసంగా జరుగుతోంది. రాముని పక్కనే సింహాసనానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఉన్నట్టుండి తనలో తనే నవ్వుకున్నాడు. అది అందరూ చూశారు. ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొక్కరూ ఒకలా అనుకున్నారా నవ్వు చూసి. ఆనాడు రాముడిని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని, భరతునితో తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక.

సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసి నవ్వేడేమో అనుకున్నాడట. తండ్రిని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు. ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళిగా నన్ను చూసి నవ్వేడా అనుకున్నాడట విభీషణుడు. రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట. ముందు వెనక ఆలోచించకుండా బంగారు లేడిని తెమ్మని కోరి, చేజేతులా ఇన్ని కష్టాలను కొని తెచ్చినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత.

బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్లి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట. అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్థాలకు దారి తీస్తుందని లక్ష్మణుని‘ఎందుకు నవ్వేవు సోదరా?‘ అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర ‘అన్నా!’ సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండా ఉండాలని నిద్రాదేవిని నన్ను వనవాస సమయంలో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని ఒక వరం అడిగాను. అందుకామె సరేనని సమ్మతించి, ‘పదునాలుగేళ్లయిన తరువాత నిన్ను ఆవహిస్తానని’ వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు‘ అన్నాడు. దానితో అందరూ తమ తమ మనసులలో అనుకున్నది నిజం కాదని, అనవసరంగా భయపడ్డామనుకుని మనసారా నవ్వుకున్నారట. జీవితంలో మనకు కూడా ఇలాంటి సందర్భాలనేకం ఎదురవుతుంటాయి. ఎవరో ఎందుకో నవ్వుకోవడం లేదా ఎవరి మీదనో చిర్రుబుర్రులాడటం, అసందర్భంగా ఆవులించడం, కళ్లు తుడుచుకోవడం, ఒళ్లు విరుచుకోవడం చేస్తుంటారు. దానికి రకరకాల కారణాలు వెతుక్కుని, మనలో మనం మథన పడకుండా ఉంటే సరిపోతుంది కదా!

–డి.వి.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top