
కుక్కను తప్పించబోయి అదుపుతప్పిన కారు
ముగ్గురు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఘటన
మార్టూరు: మహళయ పక్షాల్లో చివరిరోజు అయిన ఆదివారం అమావాస్య రోజు పితృదేవతలకు ఇష్టమైన వంటకాలతో పిండ ప్రదానం చేస్తే వారి ఆత్మలు శాంతిస్తాయన్న నమ్మకంతో ఆలయానికి బయల్దేరిన కుటుంబంలోని ముగ్గురు మార్గంమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా మార్టూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున కోలలపూడి సమీపంలో జరిగింది. వేగంగా వెళ్తున్న కారుకు అకస్మాత్తుగా అడ్డొచి్చన కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న సిమెంట్ దిమ్మెలను, డివైడర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలివీ.. తిరుపతి పట్టణంలో రేడియేటర్ మెకానిక్ అయిన దామర్ల లక్ష్మణ్ (70), అతని భార్య సుబ్బాయమ్మ (65), కుమారుడు గణేష్ బాబు, అతని భార్య పద్మజ, వారి కుమారుడు హేమంత్ (25)లతో కలిసి కారులో పిఠాపురం ఆలయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు బయల్దేరారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా కుక్క రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రహదారి పక్కన సిమెంట్ దిమ్మెలను ఢీకొని పల్టీ కొట్టుకుంటూ మార్జిన్లోకి దూసుకెళ్లింది.
ప్రమాద ధాటికి డ్రైవింగ్ సీట్లో ఉన్న హేమంత్, తాతయ్య లక్ష్మణ్, నానమ్మ సుబ్బాయమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన గణేష్‌బాబు, అతని భార్య పద్మజను పోలీసులు మార్టూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ముగ్గురి మృతదేహాలకు మార్టూరు ప్రభుత్వాస్పత్రిలో పంచనామా చేయించి బంధువులకు అప్పగించారు. గణేష్ బాబు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.