
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్. ఇదే సమయంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా? అని ప్రశ్నించారు. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధిలేని పరిస్థితిల్లో సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం అవినీతి రుజువులన్నీ సీబీఐకి అప్పగించాలి. 22 నెలల తర్వాత రేవంత్‌కు కనువిప్పు కలిగింది. ఆరు నెలల్లో నిగ్గు తేల్చుతామని అన్నవారు ఎందుకు కాలయాపన చేశారు. కాళేశ్వరం రుజువులు మాయం చేసేందుకు పీసీ ఘోష్ కమిషన్ వేశారా?. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది లేదు. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు?. బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే ఉంది. నెహ్రు నుంచి రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు బీసీలను మోసం చేశారు. కాలయాపన కొరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశారు.
సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలి. లేదంటే బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది. ప్రజలకు ఉన్న అనుమానాలు నివృతి చేయాలి. కాంగ్రెస్ బీసీ బిల్లుపై మొదటి నుంచి ద్వంద్వ వైఖరి పాటిస్తుంది. ఒక్కసారేమో ఆర్డినెన్సు అన్నారు. ఇంకోసారి ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అసలు న్యాయపరమైన చిక్కులకు మీరు తీసుకున్న చర్యలు ఏంటి?. నెపంతో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. బీసీల కొరకు సర్వే చేశారా? ముస్లిం కొరకు సర్వే చేశారా?. బీసీలను మోసం చేయడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది. బిల్లు పెట్టడమే కాదు బిల్లు పాస్ అయ్యేలా సీఎం రేవంత్ పూర్తి బాధ్యత తీసుకోవాలి. బీజేపీ బీసీల 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది’ అని చెప్పుకొచ్చారు.