ప్రకృతి సేద్యంతోనే భూతాపానికి చెక్‌!

Walter Jehne says Global Cooling Earth - Sakshi

వ్యవసాయ సంక్షోభానికి, కరువుకు ఇదే మందు

సుప్రసిద్ధ శాస్త్రవేత్త వాల్టర్‌ యనతో ‘సాగుబడి’ ముఖాముఖి

వాల్టర్‌ యన.. ఈయన ఆస్ట్రేలియాకు చెందిన సుప్రసిద్ధ సాయిల్‌ మైక్రోబయాలజిస్టు, వాతావరణ శాస్త్రవేత్త. హెల్దీ సాయిల్స్‌ ఆస్ట్రేలియా సంస్థ వ్యవస్థాపకులుగా రైతులతో మమేకమై పనిచేస్తుంటారు. భూతాపోన్నతికి, కరువు కాటకాలకు ఎటువంటి ఆచ్ఛాదనా లేని భూమి ఎండ వేడిమిని వాతావరణంలోకి తిరగ్గొట్టడం (రీ రేడియేషన్‌) వల్ల సహజ నీటి చక్రం (నేచురల్‌ వాటర్‌ సైకిల్‌) చెదిరిపోవడమే మూల కారణమన్నది ఆయన విశ్లేషణ.

ఏడాది పొడవునా బహుళ పంటలతో భూమిని కప్పి ఉంచేలా(గ్రీన్‌ కవర్‌) ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తే వాతావరణంలోని కర్బనాన్ని జీవద్రవ్యం ద్వారా భూమిలో స్థిరీకరించడం (సాయిల్‌ కార్బన్‌ స్పాంజ్‌) సాధ్యమవుతుందని, తద్వారా భూమిని చల్లబరిచి సహజ నీటి చక్రాన్ని పునరుద్ధరించుకోవచ్చని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు.

తీవ్ర కరువున్న ప్రాంతాల్లో సైతం క్రమంగా పదేళ్లలో కరువును శాశ్వతంగా పారదోలవచ్చని, భూతాపోన్నతిని ఉపశమింపజేయవచ్చని అంటున్నారాయన. మన దేశానికి మొదటి సారి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఇటీవల సందర్శించారు. అనంతపురం వంటి తీవ్ర కరువు జిల్లాల్లోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో రుతుపవనాల రాకకు ముందే విత్తనం వేసే (ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోవింగ్‌) వినూత్న పద్ధతి రైతులకు ఉపయోగపడటంతోపాటు భూతాపాన్ని అరికట్టేందుకు ఉపయోగపడుతుందని అంటున్న వాల్టర్‌తో ‘సాగుబడి’ ముఖాముఖి..

► భూతాపోన్నతితో నెలకొన్న వాతావరణ ఎమర్జెన్సీ పరిస్థితులను ప్రపంచం అంతటా ఇవ్వాళ మనం చూస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం(ప్రపంచవ్యాప్తంగా దీన్నే రీజనరేటివ్‌ అగ్రికల్చర్‌ అని అంటున్నారు) ద్వారా మాత్రమే పరిస్థితిని చక్కదిద్దగలమని గత కొన్నేళ్లుగా మీరు చెబుతున్నారు కదా.. అదెలా..?
 భూతాపం, కరువులకు ప్రధాన కారణం విచక్షణా రహితంగా అడవులను నరికివేస్తూ నేలను ఎండబారిన పడెయ్యడం, పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో గత వందేళ్లుగా ఏక పంటలను సాగు చేయడం వల్ల ప్రతి హెక్టారు భూమిలో నుంచి ఏటా 5–10 టన్నుల కర్బనాన్ని చేజేతులా గాల్లో కలిపేస్తున్నాం. భూముల్లో 5%గా ఉండాల్సిన సేంద్రియ కర్బనం.. అత్యంత కనిష్ట స్థాయి 0.3%కి దిగజారింది. అందువల్ల మన భూములు నీటిని నిలుపుకోలేక ఉత్పాదకతను కోల్పోయాయి. అంతేకాదు, యావత్‌ వాతావరణాన్ని చల్లబరిచే ప్రాణశక్తిని సైతం కోల్పోయాయి. అందువల్ల ‘సహజ నీటిచక్రం’ దెబ్బతిన్నది. కరువు కాటకాలు, అకాల వర్షాలు, భూతాపం అపరిమితంగా పెరిగిపోవడం.. ఇవన్నీ ‘సహజ నీటి చక్రం’ దెబ్బతినటం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలే.

► దెబ్బతిన్న నీటిచక్రాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వ్యవసాయం వల్ల సాధ్యమవుతుందా?
సాధ్యమే. భూతాపాన్ని నిజంగా తగ్గించాలంటే.. మనం మొదట చేయాల్సింది రసాయనాలతో పారిశ్రామిక వ్యవసాయం చేయటం మాని, భూములను సజీవవంతం చేసే çపకృతి వ్యవసాయం చేపట్టాలి. భూమి అంతటికీ దట్టమైన ఆకుపచ్చని ఆచ్ఛాదన కల్పించాలి. భూములు ఎండ బారిన పడకుండా ఒకటికి నాలుగు పంటలతో, తోటలు చెట్లతో 365 రోజుల పాటు కప్పి ఉంచేలా గ్రీన్‌కవర్‌ పెంచగలిగితే భూతాపాన్ని తగ్గించెయ్యవచ్చు.

వాతావరణంలో అతిగా పోగుపడిన కర్బనాన్ని తిరిగి భూమిలోకి జీవ ద్రవ్యం రూపంలో స్థిరీకరించవచ్చు (ఈ ప్రక్రియనే ‘సాయిల్‌ కార్బన్‌ స్పాంజ్‌’ అంటున్నారు). సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉండి స్పాంజ్‌ మాదిరిగా నీటిని పట్టి ఉంచే సజీవ భూముల సాయంతో మాత్రమే 365 రోజులు గ్రీన్‌ కవర్‌ పెంచగలుగుతాం. అప్పుడే గతి తప్పిన నీటి చక్రాన్ని పునరుద్ధరించుకోగలం. భూతాపాన్ని అరికట్టడం వీలవుతుంది. పారిశ్రామిక వ్యవసాయాన్ని వదిలెయ్యకుండా, భూములను తిరిగి సజీవవంతంగా చేసుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చేపట్టకుండా భూతాపాన్ని అరికట్టడం అసాధ్యం. పదిహేనేళ్లుగా నేను ఇదే చెబుతున్నాను. అయితే, భారత దేశంలో మీరు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇందుకు దోహదపడతాయి.

► ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్న భూములను స్వయంగా పరిశీలించారు కదా. మీకెలా అనిపించింది?
ప్రకృతి వ్యవసాయ పద్ధతి భూములకు, రైతులకు, వాతావరణానికి నిస్సందేహంగా ఎంతో మేలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనలో నాకు ఆశ్చర్యం కలిగించిందేమిటంటే.. అనంతపురం వంటి తీవ్ర కరువు ప్రాంతాల్లో కూడా రుతుపవనాల రాకకు ముందే విత్తనాలు వేయడం(ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోవింగ్‌) చాలా అద్భుత ఫలితాలనిచ్చే ప్రయోగం. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏడాది పొడవునా పంటలతో నిండి ఉండేలా భూములకు సజీవ ఆచ్ఛాదన కల్పించడానికి ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోవింగ్‌ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పొలాలు చూసి నేనెంతో ముగ్ధుడినయ్యాను. చాలా దేశాలు తిరిగాను. ఇలాంటి మెరుగైన సాగు పద్ధతి క్షేత్రస్థాయిలో అమలులో ఉండటం మరెక్కడా చూడలేదు. ఇది ప్రపంచానికే అనుసరణీయమైన గొప్ప ఉదాహరణగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అయితే, సీజనల్‌ పంటల సాగుతోపాటు.. పండ్ల తోటలు వేయటం, ఇతర ప్రయోజనకరమైన జాతుల చెట్లు పెంచుతూ వాటి మధ్యలో రకరకాల పంటలను ఏడాది పొడవునా సాగు చేయడం(ఆగ్రో ఫారెస్ట్రీ) ద్వారా భూమిని సాధ్యమైనంత వరకు కప్పి ఉంచేలా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత పరిపుష్టం చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వంతోపాటు చిన్న, సన్నకారు రైతులు కీలకపాత్ర పోషించాలి.  

► రుతుపవనాల రాకకు ముందే పొడి వాతావరణంలో విత్తనాలు వేసే ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఏ విధంగా విశిష్టమైనదో శాస్త్రీయంగా వివరిస్తారా?
ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం వేయడంతోపాటు ఒకటికి పది రకాల ఏక దళ, ద్విదళ పంటల విత్తనాలను బీజామృతంతో శుద్ధిచేసి వర్షం రాకకు ముందే విత్తుతున్నారు. గడ్డీ గాదాన్ని, పొట్టు వంటి పంట వ్యర్థాలను నేలపై ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ద్రవజీవామృతం పిచికారీ చేస్తున్నారు.

వర్షం రావడానికి ముందుగానే విత్తినప్పటికీ.. అంతటి పొడి వాతావరణంలోనూ దొరికిన కొద్దిపాటి తేమతోనే ఈ విత్తనాలు మొలకెత్తి, మిశ్రమ పంటలు పచ్చగా పెరుగుతున్నాయి. వర్షానికి ముందే అతికొద్ది పరిమాణంలోనైనా మూడు రకాలుగా నీరు సమకూరటం వల్లనే ఈ విత్తనాలు మొలిచి పెరుగుతున్నాయి. వర్షం పడిన తర్వాత మరింత పుంజుకొని భూమికి గ్రీన్‌ కవర్‌గా మారుతున్నాయి. వానకు ముందే వేసిన విత్తనం మొలవడానికి దోహదపడుతున్న నీటి వనరులు ఇవి.. ఘనజీవామృతం, జీవామృతంలోని పిండిపదార్థాన్ని సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసినప్పుడు నీరు విడుదలవుతుంది. ప్రతి గ్రాము పిండి పదార్థానికి 6 గ్రాముల చొప్పున నీరు విడుదలవుతుంది.

రెండోరకం నీటి వనరు.. ఎండాకాలంలో కూడా మట్టి కణాల చుట్టూ సూక్ష్మ స్థాయిలో నీటి జాడ(వాటర్‌ ఫిల్మ్‌) ఉంటుంది. కానీ, ఈ నీటిని మొక్కల పీచు వేర్లు కూడా పీల్చుకోలేవు. అయితే, ఘనజీవామృతం, ద్రవజీవామృతం ద్వారా వేర్ల దగ్గర పెరిగిన మైకోరైజా శిలీంధ్రపు పోగులు (ఒక మీటరు ఘనపు మీటరు సజీవవంతమైన మట్టిలో 25 వేల కిలో మీటర్ల పొడవు వరకు శిలీంధ్రపు పోగులు విస్తరిస్తాయి) ఈ నీటిని పీల్చుకొని వేర్లకు అందిస్తాయి. పొడి వాతావరణంలో విత్తనం మొలకెత్తడానికి తేమ ఇలా లభిస్తుంది.

మూడో రకం.. మొలక వచ్చిన తర్వాత ఆ ఆకులు వాతావరణంలో నుంచి నీటి తేమను రాత్రి పూట పీల్చుకొని పెరుగుతాయి. ఎండాకాలం బొత్తిగా నీరే లేదు అనుకున్న ప్రాంతాల్లో కూడా ఇలా నీటి వనరులు ప్రకృతిలోనే నిగూఢంగా దాగున్నాయి. ఉపాయంతో ఆ వనరులను అందిపుచ్చుకోవడానికి ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోవింగ్‌ వంటి వినూత్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉపయోగపడుతున్నాయి. పంటకు– పంటకు మధ్యలో నవధాన్యాలను పచ్చిరొట్ట పంటలుగా సాగు చేసి, భూమిలో కలియదున్ని (ఇలా భూమిలోకి చేరిన సేంద్రియ కర్బనం ఒక గ్రాముకు 8 గ్రాముల నీటిని పట్టి ఉంచగలుగుతుంది).. కొద్ది రోజుల్లోనే మళ్లీ పంటలు వేసుకుంటూ ఏడాది పొడవునా భూమిని కప్పి ఉంచుతున్న రైతులను కూడా ఇక్కడ కలుసుకున్నాను. ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.  

► అనంతపురం జిల్లాలో కూడా ఇలా జరిగిందా? ఇందులో శాస్త్రీయత ఎంత?
అవును. ఇదంతా శాస్త్రీయంగానే జరిగింది. గత మే నెలలో వానకు ముందే విత్తిన పంటలు మొలిచాయి. జూలై, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో 100 ఎం.ఎం. వర్షం పడింది. పంటలు మాత్రం హెక్టారుకు 12 నుంచి 15 టన్నుల బరువు మేరకు పెరిగాయి. 15 టన్నుల బరువున మొక్కలు (బయోమాస్‌) పెరగాలంటే 15 వేల టన్నుల నీరు అవసరం. ఒక గ్రాము బయోమాస్‌ పెరగాలంటే ఒక లీటరు నీరు అవసరం. 100 మిల్లీ మీటర్ల వర్షం హెక్టారు పొలంలో కురిస్తే, వెయ్యి మెట్రిక్‌ టన్నుల నీరు లభించినట్లు లెక్క. అనంతపురంలో కురిసిన 100 ఎం.ఎం. వర్షంతో లభించిన వెయ్యి మెట్రిక్‌ టన్నులు పోను.. 12 టన్నుల పంటల బయోమాస్‌ పెరగడానికి దోహదపడిన మిగతా 11 వేల టన్నుల నీరు ఎక్కడి నుంచి వచ్చింది? గాలిలో నుంచే!   

► 365 రోజులూ భూమిని పంటలు, చెట్ల పచ్చదనంతో కప్పి ఉంచినప్పుడు రైతుకు ఎన్నాళ్లలో ప్రయోజనం కనిపిస్తుంది?
ప్రకృతి వ్యవసాయ సూత్రాలన్నీ పాటించే పొలంలో రైతుకు మొదటి సంవత్సరం నుంచే దీని సత్ఫలితాలు కనిపిస్తాయి. భూమి సజీవవంతం అవుతుంది. మట్టి భౌతిక జీవ రసాయనిక స్థితిగతుల్లో, దిగుబడిలో మొదటి మూడేళ్లూ చాలా ప్రస్ఫుటంగా మార్పు కనిపిస్తుంది.

► భూతాపం తగ్గి, కరువు పూర్తిగా పోవడానికి ఒక ప్రాంతంలో కనీసం ఎంత విస్తీర్ణంలో గ్రీన్‌ కవర్‌ కల్పించాల్సి ఉంటుంది?
కనీసం 2 వేల హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్‌ కవర్‌ పెంచితే ఉష్ణోగ్రతలో క్రమంగా తేడా తెలుస్తుంది.10 ఏళ్ల కాలంలో 90% మేరకు నీటి చక్రం పునరుద్ధరణ సాధ్యమవుతుంది. నేను నివసించే కాన్‌బెర్ర(ఆస్ట్రేలియా రాజధాని)లో వెయ్యి హెక్టార్లలో గ్రీన్‌ కవర్‌ ఉండటం వల్ల ఇతర ప్రాంతాలతో పోల్చితే అక్కడ 12 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రత తేడా వచ్చింది.
ఆసియాలో గత 20 ఏళ్లలో రుతుపవనాల విశ్వసనీయత 30 శాతం తగ్గిపోయింది. భూములను పచ్చదనంతో నింపితే వాతావరణంలో రీరేడియేషన్‌ తగ్గి కూలింగ్‌ ఎఫెక్ట్‌ ఏర్పడుతుంది. మేఘాలు వర్షించడానికి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఎక్కువగా మొక్కలు నాటడంతోపాటు..  భూములను 365 రోజులూ పంటల పచ్చదనంతో కప్పి ఉంచేలా వ్యవసాయ పద్ధతిని మార్చుకుంటే తప్ప భూతాపాన్ని తగ్గించడం, కరువును శాశ్వతంగా పారదోలడం అసాధ్యం.
(Walter jehne వీడియో ప్రసంగాల కోసం యూట్యూబ్‌లో వెతకండి)
ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌


గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో సాగవుతున్న పత్తి పంటను పరిశీలిస్తున్న వాల్టర్‌ యన


రైతులతో ముచ్చటిస్తున్న వాల్టర్‌ యన తదితరులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top