రాజు మెచ్చిన చిత్రం

Story of a painter - Sakshi

పాదుషా గారికి వైకల్యం ఉంది. ఒక కన్ను కనిపించదు. ఒక కాలు నడవనివ్వదు. అయినా పాలనా వ్యవహారాలు నిర్వర్తించడంలో ఏ లోటూ రానిచ్చేవారు కాదు. ఒకరోజు పాదుషా గారికి తన ముఖచిత్రాన్ని గీయించుకోవాలనే కోరిక కలిగింది. ‘‘ఎవరైతే నాలో ఉన్న శారీరక లోపాలు కనపడకుండా నా చిత్రాన్ని గీస్తారో వాళ్లకు గొప్ప బహుమానాన్ని అందిస్తాను’’ అని ప్రకటించారు. రాజ్యంలోని ప్రముఖ చిత్రకారులందరూ రాజుగారి చిత్రాన్ని గీసేందుకు బారులు తీరారు.

చిత్రకారులంతా పాదుషా గారి వైకల్యం కనబడకుండా చిత్రించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. అందులోనుంచి ఒక పల్లెటూరి చిత్రకారుడు ‘‘పాదుషా గారూ! మీరు కోరినట్లుగా మీ చిత్రాన్ని నేను గీస్తాను’’ అని చెప్పాడు. చెప్పినట్లుగా రాజుగారి ముఖచిత్రాన్ని అత్యంత సుందరంగా, రాజుగారు మెచ్చుకునేలా చిత్రీకరించాడు.

చిత్రంలో రాజుగారు అశ్వంపై ఆసీనులై బాణం ఎక్కుపెట్టినట్లు చిత్రించి తన చిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. నడవనివ్వని కాలును గుర్రానికి కనపడని వైపు ఉంచి, కనిపించని కన్నును మూసి బాణాన్ని ఎక్కుపెట్టినట్లు చిత్రించి రాజుగారి మన్ననల్ని పొందాడు. రాజుగారు తన ముఖారవిందాన్ని చిత్రంలో చూసుకుని ఎంతో సంతోషించారు. ఆ పల్లె చిత్రకారుడికి ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు.

ఇది కేవలం కథ మాత్రమే కాదు పాఠం. మనమూ ఇతరుల లోపాలను బహిర్గతం కాకుండా చిత్రాలను గీయవచ్చు. దైవానుగ్రహం పొంది ఎన్నో వరాలను పొందవచ్చు. ఒకరి లోపాలను ఎత్తి చూపడం అల్లాహ్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ఎదుటి వారిలోని మంచినే చూడాలి. మనలో ఉన్న లోపాలను తొంగి చూసుకోవాలి.

అంతేకాని, ఎప్పుడూ ఎదుటి వారి లోపాలపైనే దృష్టి పెడితే మనం అభాసుపాలవుతాం. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు, బలహీనతలుంటాయి. ఒకరి లోపాలు, బలహీనతలను నలుగురిలో చెప్పి నవ్వులపాలు చేయకుండా ప్రవర్తిస్తే అల్లాహ్‌ మన లోపాలు, మన బలహీనతలపై ముసుగు వేస్తాడు.

– నాఫియా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top