చాలామంది ఓ ఉద్యోగం సంపాదించగానే తమకంటే గొప్పోళ్లు లేరన్నట్లుగా ఉంటుంది వారి బిల్డప్. తమదే సంపాదన అన్నట్లు ఉంటుంది వాళ్ల ఆటిట్యూడ్. కానీ ఈ వ్యక్తి ఆర్జించే విధానం చూస్తే..ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే మాటకు నిలువెత్తు నిదర్శనంలా ఉంది. రెండు చేతులా సంపాదిస్తున్నా..చిన్న చితకా పనులను కూడా ఎలాంటి నామోషి లేకుండా చాలా ఇష్టంతో చేస్తుండటం చూస్తే..సింపుల్ సిటీకి అసలైన అర్థం ఇతడేనేమో అనిపిస్తుంది.
ఒక మహిళ, పెయింటర్ మధ్య సంభాషణ నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఒక ఎత్తైన భవనంపై పెయింటింగ్ వేస్తూ ఉండగా,.. ఆ భవనంలోని మహిళ సరదాగా పలకరిస్తుంది ఆ పెయింటర్‌ని. అంత ఎత్తు నుంచి వేలాడుతూ పేయింటింగ్ వేయడం చూసి..ఆమె నడుం నొప్పి వస్తుందా అని అడగగా..ఆ పెయింటర్ ఎలాంటి నొప్పి లేదని సమాధానమస్తాడు.
ఆ తర్వాత అతడు తన వేతనం రూ. 30,000లని కూడా చెబుతాడు. అతడి శాలరీ విని ఆమె ఆశ్చర్యపోతుంది కూడా. ఇంకా ఆ పెయింటర్ మాట్లాడుతూ తాను కూడా చదువుకున్నానని, డిగ్రీ పూర్తి చేశానని, వ్యవసాయం కూడా చేస్తుంటానని చెప్పాడు. అలాగే తన తోబుట్టువుల గురించి ప్రస్తావిస్తూ..తన సోదరుడు సైన్యంలో ఉన్నాడని, సోదరి బీహార్ పోలీస్ శాఖలో పనిచేస్తుందని చెబుతాడు.
మరి నీ సంపాదన నీ తోబుట్టువుల కంటే ఎక్కువేనా అని ఆ మహిళ అడగగా అందుకు ఆ వ్యక్తి తాను చెరుకు ద్వారా సుమారు రూ. 10 లక్షల దాక ఆర్జిస్తానని బదులు ఇస్తాడు. ఈ సంభాషణ మొత్తం సానియా మీర్జా అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించడమే కాకుండా అతని కష్టపడేతత్వం అందర్నీ కట్టిపడేసింది.


