
వారంతా అధ్యాపక వృత్తిలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు.. అందరిలా కేవలం ఉద్యోగానికే పరిమితమైపోవాలని అనుకోలేదు.. ఎప్పుడూ విధులతో, కుటుంబ బాధ్యతలతో తలమునకలై పోకుండా.. తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. తమలోని ప్రత్యేకతను సమాజానికి చాటి చెప్పాలనుకున్నారు.. అదే తలంపుతో తమలో దాగివున్న నైపుణ్యానికి పదును పెట్టారు.. కఠోరమైన దీక్షతో, అంకితభావంతో కళకు పదునుపెట్టి క్రియేటివిటీతో వివిధ పద్ధతుల్లో చిత్రాలను రూపొందించారు. వీటిని మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు.
‘మేనేజ్ చేద్దాం’ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. 10 మంది చిత్రకళాకారులు వివిధ ఆర్ట్ కళాశాలల్లో విద్యను పూర్తి చేసుకుని, ఇంటర్నేషనల్ పాఠశాలలో, కళాశాలల్లో ఆర్ట్ అధ్యాపకులుగా విధలు నిర్వహిస్తున్నారు. కేవలం ఉద్యోగానికి, కుటుంబానికే పరిమితం కాకుండా ఒక్కొక్కరూ ఒక్కో శైలిలో చిత్రాలను, స్కల్ప్చర్స్ తయారుచేసి ప్రదర్శిస్తున్నారు. ఆర్ట్ రంగంపై ఉద్యోగాల్లో స్థిరపడినవారు పూర్తి స్థాయిలో రాణించలేకపోతున్నారు. సమయం లేకపోవడం, ఉద్యోగ రిత్యా తమలోని సృజనాత్మకతను వెలికితీయలేకపోతున్నారని ఆరిస్ట్ సంతోష్ కొటగిరి తెలిపారు. ఆర్ట్ రంగంలో రాణించగలిగితే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.
ప్రకృతితో మమేకమై చిత్రాలను వేయాలన్నారు. చిత్ర రంగంలో రాణించాలంటే ఆసక్తి, పట్టుదల, వేసే ప్రతి చిత్రంలో సృజనాత్మకత ఉండాలన్నారు. కళాకారులు గౌతమ్ వావిలాల, హరితరన్ షిండే, జయప్రకాశ్ వావిలాల, ఎంజీ పాషా, బెల్లం రాజారావు, రామకృష్ణ కొంగల, సంతోష్ కోటగిరి, శేఖర్‌పాండే, శ్రీనివాస్ టింగిర్‌కర్, వాసుదేవరావు నడిమింటి వేసిన చిత్రాలు, స్కల్ప్చర్స్, ఇన్‌స్టాలేషన్స్ ప్రదర్శిస్తున్నారు.
చిన్నారులను ప్రోత్సహించాలి..
ఉద్యోగానికే ఎందుకు పరిమితం కావాలి. మనం నేర్చుకున్న, ఎంచుకున్న రంగంలో మరింత సృజనాత్మకత ప్రదర్శించేందుకు ఉద్యోగం చేస్తూ కొంత సమయాన్ని కేటాయించి అనుకున్న విధంగా చిత్రాలను గీసి ప్రదర్శించాలనుకున్నాము. అంతర్జాతీయ పాఠశాలలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ రంగంలో రాణించాలంటే ఆసక్తి, పట్టుదల ఉండాలి.
– శ్రీనివాస్ టింగిర్‌కర్, ఆరి్టస్ట్–అధ్యాపకుడు
ట్రావెల్ షో చేయాలని ఉంది..
ఆర్ట్ రంగాన్ని తాత్కాలికంగా నేర్చుకుంటే ప్రయోజనం లేదు. సరదాగా నేర్చుకోవడం వేరు. ఆసక్తి ఉండడం వేరు. ఇందులో గుర్తింపు పొందాలంటే పూర్తి స్థాయిలో నేర్చుకుని సందేశాత్మక చిత్రాలను వేయాలి. నేను ఆయిల్ పెయింటింగ్ చేస్తాను. వేసే ప్రతి చిత్రంలోనూ ఎదో ఒక సందేశం ఉండాలి.
కళాకారుడికి మధిలోని భావాలను ప్రదర్శించే శక్తి ఉంటుంది. పూర్వకాలంలో వేసిన చిత్రాల ఆధారంగా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. గ్రుప్ షోలో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబయి తదితర ప్రాంతాల్లో ట్రావెలింగ్ షో చేద్దామనుకుంటున్నా.
– సంతోష్ కోటగిరి, ఆర్టిస్ట్–అధ్యాపకుడు.