ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు?

Shruti Chaudhary shared with everyone about sexual harassment - Sakshi

మీటూ స్టోరీ

హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే ఫేస్‌బుక్‌ పేజీలో ఓ యువతి రాసుకొచ్చిన పోస్టును ఎంతోమంది ప్రశంసిస్తూ ఉంటే.. మరికొంత మంది మాత్రం ఎప్పటిలాగానే ‘ఇప్పుడెందుకు.. అప్పుడేం చేశావు..’  అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ నెగటివ్‌ కామెంట్స్‌ చదువుతుంటే విషయమేంటో మీకు ఈపాటికే అర్థమయ్యే ఉంటుంది.  గతంలో తాను ఎదుర్కొన్న లైంగిక హింస, వేధింపుల గురించి శ్రుతీ చౌదరి అనే అమ్మాయి నిర్భయంగా ఫేస్‌బుక్‌లో అందరితో పంచుకుంది. అంతేకాదు తన మీటూ స్టోరీ ఎంతో మందిని ఇన్‌స్పైర్‌ చేస్తుందని ధైర్యంగా ‘అతడి’ ముసుగును తొలగించింది. తనలా ఎవరూ మోసపోకూడదని.. అతడి బారి నుంచి కనీసం ఒక్కరిని కాపాడినా సరే తను విజయం సాధించినట్లేనని పేర్కొంది.

ఆ పోస్టు సారాంశం ఇది..
‘అందరిలాగానే కలలు సాకారం చేసుకునేందుకు.. చిన్న పట్టణం నుంచి ముంబై మహానగరానికి వచ్చాను. కానీ ఇక్కడికొచ్చాకే ఎన్నెన్నో సత్యాలు నాకు బోధపడ్డాయి. ఓరోజు నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు ఓ వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. సోషల్‌ మీడియాలో నా రాతలు చూసి తన దగ్గర రైటర్‌గా పనిచేయాలని కోరాడు. సరే అన్నాను. కలిసి పనిచేస్తున్న క్రమంలో మా మధ్య స్నేహం చాలా బలపడింది. ఆత్మీయుడిగా భావించి నాకున్న అభద్రతా భావం గురించి, ఇతర సమస్యల గురించి అతడితో పంచుకోవడం ప్రారంభించాను. తరుచుగా కలుసుకునేవాళ్లం(అన్ని విధాలుగా).

అయితే మా స్కాట్లాంట్‌ ట్రిప్‌ వరకు అంతా బాగానే జరిగింది. ఆ రోజు రాత్రి మేము ఔటింగ్‌కు వెళ్లాల్సింది. కానీ అకస్మాత్తుగా వద్దన్నాడు. అయితే నేను అందుకు సిద్ధంగా లేనని చెప్పాను. కాసేపటి తర్వాత తన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నాతో కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. మాట్లాడటం మానేశాడు. దాంతో గిల్టీగా ఫీలయ్యాను. తన కోరిక కాదన్నందుకు బాధపడతాడేమోనని సరేనన్నాను. కానీ తను మాత్రం అలా అనుకోలేదు. చాలా కఠినంగా, పశువులా ప్రవర్తించాడు. ఆరోగ్యం గురించి శ్రద్ధ ఉండాలి కదా అన్నా వినలేదు. శారీరక హింసకు గురిచేశాడు.

అలా చాలాసార్లు ఎంతగానో హింసించాడు. కొన్ని రోజుల తర్వాత తనతో ‘బంధం’ తెంచుకోవాలని అనుకున్నాను. తను కూడా సరేనన్నాడు. సహచర ఉద్యోగుల్లా మాత్రమే ఉన్నాం.కానీ ఓ రోజు నాకు వచ్చిన మెసేజ్‌ చూసి షాకయ్యాను. అతడు కేవలం నాతోనే కాదు చాలా మంది అమ్మాయిలతో ఇలాగే ప్రవర్తించాడని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. అతడి నిజస్వరూపం గురించి బయటపెట్టాలని భావించాను. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో నా మీటూ స్టోరీని బహిర్గతం చేశాను. ఆ తర్వాత కొన్ని గంటల పాటు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి.. మళ్లీ ఆన్‌ చేయగానే నా పోస్టు వైరల్‌గా మారడం చూసి ఆశ్చర్యపోయాను.

పదుల సంఖ్యలోఅమ్మాయిలు అతడిని నమ్మిన తీరు, ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి తెలుసుకుని షాకయ్యాను. నేను అనుకున్న దానికన్నా కూడా అతడెంతో క్రూరుడు. మూర్ఖుడు. నేను ధైర్యంగా అతడి గురించి బయటపెట్టడం చూసి మరికొంత మంది కూడా పోరాడటానికి సిద్ధమయ్యారు. అందుకు ఫలితంగా అతడికి శిక్ష వేయించడంలో సఫలీకృతులమయ్యాం. ఈ రోజు నేను షేర్‌ చేసిన నా స్టోరీ ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తుందనుకుంటున్నాను. నాలా ఎంతో మంది భ్రమలో ఉండి మోసపోయి ఉంటారు. మీరెవ్వరూ ఒంటరివారు కాదు. ధైర్యంగా ముందుకు రావాలి’’ అని రాశారు శ్రుతి చౌదరి.

‘ఇప్పుడెందుకో.. మీ తప్పేం లేదా?’
ఒక మహిళ లైంగిక హింసకు గురైనా, ఒక ఆడపిల్ల అత్యాచారానికి గురైనా... సమాజం వాళ్లకు మద్దతుగా నిలవకపోగా, ఆమెను బాధితురాలిగా గుర్తించకపోగా... ఏదో నేరం చేసిన వ్యక్తులుగా చిత్రీకరించి ఆమెను మరింతగా కుంగదీసేందుకే ప్రయత్నిస్తుంటుంది. అందుకే గొంతు విప్పాలంటే బాధితులకు అంతటి భయం. కానీ శ్రుతి ధైర్యం చేసింది. అందరూ ఆమెలాగే ముందుకు వస్తే.. అతడి లాంటి మేక వన్నె పులులు... పశ్చాత్తాపంతో కాకపోయినాæ కనీసం భయంతోనైనా మారతాయనేది ఆమె ఉద్దేశం.

నోరు విప్పితేనే న్యాయం!!
‘మీటూ లాంటి ఉద్యమాల వల్ల చాలా మంది బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెడుతున్నారు. అయితే ఆ సమయంలో వారు అనుభవించిన బాధ కంటే కూడా... అప్పుడు ఏం జరిగిందో ఎలా జరిగిందో చెప్పు.. అసలు ఇదంతా నిజమేనా... ఒకవేళ నిజమే అయితే సాక్ష్యాలు చూపించు అనే ఈ మాటల వల్లే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు. ఇక్కడ విచారించదగ్గ మరో విషయం ఏంటంటే చాలా మంది యూరప్‌ మహిళలు తమపై జరిగిన అత్యాచారాల గురించి నోరు మెదిపే ధైర్యం చేయలేకపోవడం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చినపుడే న్యాయం జరుగుతుంది కదా’ అంటారు గతంలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో పనిచేసిన యూరోప్‌ మహిళా హక్కుల నేత అన్నా బ్లస్‌
– యాళ్ల సుష్మారెడ్డి, సాక్షి వెబ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top