బాడీ షేమింగ్‌

Sharad Yadav issues apology after body shaming Vasundhara Raje - Sakshi

‘బోండాం’ అనడం బాడీ షేమింగ్‌. ‘బక్క పీనుగ’ అనడమూ బాడీ షేమింగే. స్త్రీని పురుషుడు చేసే బాడీ షేమింగ్‌ అయితే ఇంకా రకరకాలుగా ఉంటుంది. బాడీ షేమింగ్‌ అని అతడికి తెలియకపోవచ్చు. ఆమెకు తెలుస్తుంది. హర్ట్‌ అవుతుంది. ఏ విధంగానైనా స్త్రీని బాడీ షేమింగ్‌ చెయ్యడం అంటే ప్రకృతి ధర్మాన్నే అవమానించడమే. స్త్రీ దేహధర్మాలు,  స్త్రీ దేహ స్వభావాలు విలక్షణమైనవి. ఆ విలక్షణతల కారణంగా కొన్ని విభిన్నతలకూ ఆమె దేహం లోనవుతూ ఉండొచ్చు. ఆ విభిన్నతలను ఎత్తిచూపుతూ ఒక మాట అనడం అంటే.. జన్మనిచ్చే జెండర్‌ను కించపరచడమే.

వసుంధరారాజే (65) సీనియర్‌ లీడర్‌. రాజస్తాన్‌ తొలి మహిళా ముఖ్యమంత్రి. మళ్లీ కనుక ఆమె ముఖ్యమంత్రి అయితే హ్యాట్రిక్‌ అవుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆమెను అడ్డుకోవాలంటే ఆమె ప్రభుత్వంలోని బలహీనతలేవో ఎత్తి చూపాలి. చేస్తానని చెయ్యని పనులేవైనా ఉంటే వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. అయితే శరద్‌ యాదవ్, వసుంధరా రాజే ‘ఒంటిని’ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు! ఆయన కూడా సీనియర్‌ లీడరే. 73 ఏళ్లు. ‘ఏళ్లొచ్చాయ్‌ ఎందుకు?’ అనిపిస్తుంది రాజేను ఆయన చేసిన కామెంట్‌ని వింటే! వినే ఉంటారు. ‘‘వసుంధర కో ఆరామ్‌ దో. బహుత్‌ థక్‌ గయీ హై. మోటీ హో గయీ హై’’ అన్నారు. పోలింగ్‌కి ముందురోజు ప్రత్యర్థిపై ఆయన సంధించిన చివరి అస్త్రం అది! ‘‘వసుంధరకు విశ్రాంతి ఇవ్వండి. మనిషి బాగా లాౖÐð  పోయి ఆయాస పడుతోంది’’ అని. స్త్రీని సవ్యంగా ఎదుర్కోలేకపోయినప్పుడే పురుషుడు ఇలా ఉక్రోషంతో ఆమె ఒంటి పైకి నోటిని ప్రయోగిస్తాడు.

వాస్తవానికి శరద్, రాజే సమీప ప్రత్యర్థి ఏమీ కాదు. అయన్ది రాజస్తాన్‌ కూడా కాదు. ఎన్నికల ప్రచారం కోసం బిహార్‌ నుంచి వచ్చారు. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌తో పడక, గతేడాది జేడీయూ నుంచి బయటికి వచ్చి, ఈ ఏడాది మే నెలలో సొంతంగా ‘లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌’ పార్టీ పెట్టుకుని రాజస్తాన్‌ ఎన్నికల్లో రాజేకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వచ్చారు. ఆ సందర్భంగానే శరద్, రాజే ఒంటిపై కామెంట్‌ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన వివరణ కూడా ఆయన స్థాయికి తగినట్లుగా లేదు. ఏడుసార్లు ఎంపీగా, మూడుసార్లు క్యాబినెట్‌ మినిస్టర్‌గా చేసిన శరద్‌ యాదవ్‌.. ‘ఊరికే జోక్‌ చేశాను’ అన్నారు! ‘‘ఆమెను హర్ట్‌ చెయ్యాలని నా ఉద్దేశం కాదు. తనతో నాకు పాత  పరిచయం ఉంది. ఆమెను కలిసినప్పుడు కూడా నేనిదే చెప్పాను.. మీరు లావౌతున్నారని’’ అన్నారు. శుక్రవారం జలావర్‌లోని ‘మహిళా పోలింగ్‌ బూత్‌’ నుంచి ఓటేసి వస్తూ.. ‘‘అతడి కామెంట్‌పై నేను ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేయబోతున్నాను’’ అని రాజే మీడియా ప్రతినిధులతో అనగానే.. శనివారం ఆమెకు క్షమాపణలు చెబుతూ శరద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

స్మృతి ఇరానీ (శరద్‌ యాదవ్‌)
శరద్‌ యాదవ్‌ ఇలా మహిళల్ని కించపరుస్తూ, ‘బాడీ షేమింగ్‌’ (ఒంటి సైజు, ఒంటి షేప్, ఒంటి రంగును అవమానించడం) చెయ్యడం ఇదే మొదటి సారి కాదు. మూడేళ్ల క్రితం స్మృతి ఇరానీని ఇలాగే పార్లమెంటులో.. ‘నువ్వేంటో నాకు తెలుసు’ అన్నారు.  గత ఏడాది విచిత్రంగా ఓటుకు, ఆడపిల్లలకు ముడిపెట్టి మాట్లాడారు. ఆడపిల్ల పరువు కన్నా ఓటు పరువు ముఖ్యమట. ‘‘ఆడపిల్ల అమ్ముడుపోతే ఇంటి పరువు, ఊరి పరువు మాత్రమే పోతాయి. ఓటు అమ్ముడు పోతే దేశం పరువే పోతుంది’’ అన్నారు. ఏంటో దానర్థం! ‘నువ్వేంటో నాకు తెలుసు’ అని స్మృతి ఇరానీని అన్న మాటల్లోని పరమార్థం ఏమిటో కూడా ఆయనకే తెలియాలి. రాజ్యసభలో ఇన్సూరెన్స్‌ బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు డిబేట్‌ ఎటు నుంచి ఎటో వెళ్లిపోయి, ‘‘ఇండియాలో అందరికీ తెల్లగా ఉండే అమ్మాయిలే కావాలి. నల్ల అమ్మాయిలను ఎవరూ వధువుగా కోరుకోరు. దక్షిణాది మహిళలంతా నల్లగా ఉంటారు. అయినప్పటికీ వారిలో మెరుపు కనిపిస్తుంది..’’ అని యాదవ్‌ అన్నారు. అక్కడితో ఊరుకోకుండా ఇంకా వివరణ ఇవ్వబోతుంటే.. మంత్రి స్మృతి ఇరానీ డిప్యూటీ చైర్మన్‌ వైపు చూస్తూ ‘ఇక ఆపమనండీ’ అని అభ్యర్థించారు. దానికి యాదవ్‌ అసహనంతో.. ‘ఐ నో వాట్‌ యు ఆర్‌’ అని స్మృతిపై మండిపడ్డారు.

రేణుకా చౌదరి (వెంకయ్య నాయుడు)
ఈ ఏడాది మార్చిలో రాజ్యసభ సభ్యత్వపు పదవీకాలం పూర్తి చేసుకున్నవారిలో రేణుకా చౌదరి ఒకరు. ఆ వీడ్కోలు సభలో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు, రేణుకా చౌదరికి మధ్య జరిగిన సంభాషణలోనూ రేణుక బాడీషేమింగ్‌కి గురయ్యారు. అయితే వారిద్దరి మధ్య ఉన్న చిరకాల పరిచయం కారణంగా అది కేవలం ఉల్లాసభరితమైన వాగ్వాదంగా మాత్రమే మిగిలిపోయింది. బరువు టాపిక్‌ తెచ్చింది మొదట రేణుకే. తన వీడ్కోలు ప్రసంగంలో ఆమె వెంకయ్యనాయుడును ఉద్దేశించి.. ‘సర్‌.. నా వెయిట్‌ గురించి అంతా వర్రీ అవుతున్నారు. కానీ ఇది మన వెయిట్‌ ఏంటో చూపించాల్సిన జాబ్‌ కదా’’ అన్నారు. అందుకు వెంకయ్యనాయుడు.. ‘‘మీరు వెయిట్‌ తగ్గండి. మీ పార్టీ వెయిట్‌ పెంచండి’’ అని సలహా ఇచ్చా రు. ఆ మాటకు రేణుక హాయిగా నవ్వేస్తూ.. ‘మా పార్టీ వెయిట్‌కి వచ్చిన నష్టం ఏమీ లేదు సర్‌. ఇటీస్‌ ఫైన్‌’ అన్నారు. అప్పటికే నాయుడు ఉపరాష్ట్రపతి. రేణుక గానీ, ఇతర మహిళలు కానీ పాయింట్‌ అవుట్‌ చెయ్యకపోవడంతో అది పెద్ద ఇష్యూ కాలేదు.

షేక్‌ హసీనా (నరేంద్ర మోదీ)
గత ఏడాది ఏప్రిల్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘ఆడమనిషై ఉండీ టెర్రరిజాన్ని జీరో టాలరెన్స్‌ (ఏమాత్రం సహించకపోవడం)తో నియంత్రిస్తోంది’ అని ఆయన అన్నారు. ‘ఆడ మనిషై ఉండీ’ అనడంలో మెచ్చుకోలు ఉన్నప్పటికీ.. ‘కంపారిటివ్‌లీ బలహీనమైన’ అనే అర్థం ధ్వనిస్తుండడంతో ఆయనపై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇందులో బాడీ షేమింగ్‌ ఎక్కడున్నట్లు? ఉంది. ‘ఆడపిల్ల నయం కదా, ధైర్యంగా పోరాడింది’ అంటే.. అంతర్లీనంగా ఆమె బలహీనత స్ఫురిస్తుంది కదా. బలహీనమైన బాడీ అనడం షేమింగ్‌ కాక మరేమిటి?!

మహిళల మీద (అబూ అజ్మీ)
ఐదేళ్ల క్రితం సమాజ్‌వాది పార్టీ నాయకుడు అబూ అజ్మీ ఒక కామెంట్‌ చేశాడు. ఆడవాళ్లను స్వేచ్ఛగా వదిలిపెడితే దోపిడికీ గురవుతారట. ఎందుకనంటే.. ‘‘వాళ్లు బంగారంలా విలువైనవారు. బాహాటంగా పెడితే ఆ బంగారాన్ని దోచుకునిపోతారు’’ అని ఆయన ఆందోళన. అందుకే ఆడవాళ్లు.. తోడు లేకుండా బయట తిరగకూడదు. చీకటైతే అసలు బయటికి రాకూడదు అని కూడా అన్నారు అజ్మీ. ఇదొక రకం బాడీ షేమింగ్‌. తమని తాము కాపాడుకోలేని దేహాలు అని చెప్పడమేగా! చివరికి ఆయన మాటలకు ఆయన కోడలు (కొడుకు ఫర్హాన్‌ భార్య) అయేషా టాకియా సోషల్‌ మీడియాలోకి వచ్చి క్షమాపణ చెప్పారు. ‘‘మా మామగారు అలా అని ఉండాల్సింది కాదు’’ అని.

భార్యల మీద (శ్రీ ప్రకాశ్‌ జైస్వాల్‌)
శ్రీ ప్రకాశ్‌ జైస్వాల్‌ అయితే ఏకంగా యావత్‌ద్దేశంలోని భార్యలనే బాడీ షేమింగ్‌ చేశారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, మంత్రి ఆయన. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకు రెండేళ్ల క్రితం కాన్పూర్‌లోని ఒక మహిళా కాలేజ్‌లో ప్రసంగిస్తూ... ‘‘ఈ భార్యలున్నారే.. ముసలివాళ్లయిపోతారు. అప్పుడు వాళ్ల మీద ఏ ఆకర్షణా కలగదు’’ అన్నారు. ఎంత ఘోరమైన బాడీ షేమింగ్‌! పెద్ద చదువులుండి, పెద్ద హోదాలుండీ.. ఎందుకీ పెద్దవాళ్లు ఇలా చిన్న మాటలు మాట్లాడతారు? ఒక్క రాజకీయ నాయకులనే కాదు, ఏ రంగంలోని పురుషులైనా.. స్త్రీలను అవమానించడానికి, వ్యంగ్యంగా మాట్లాడటానికి వారి దేహాలను టార్గెట్‌ చెయ్యడం సంస్కారమేనా? బలవంతుణ్ని అనుకుంటాడు కదా మగవాడు! స్త్రీని బాడీ షేమింగ్‌ చెయ్యడమేనా అతడి బలం?!

ప్రియాంకా చోప్రా (రాజ్‌నాథ్‌ సింగ్‌)
కొన్ని కామెంట్‌లు పైకి బాడీ షేమింగ్‌గా అనిపించవు కానీ, లోతుగా చూస్తే వాటిల్లోనూ బాడీ షేమింగ్‌ కనిపిస్తుంది. 2000 సంవత్సరంలో ప్రియాంక చోప్రా మిస్‌ వరల్డ్‌గా ఎన్నికైనప్పుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తల్లిదండ్రుల ఉద్యోగాల రీత్యా ప్రియాంక లక్నోలో ఉంటోంది. సీఎం స్థాయిలో ఉండి ఆయన ప్రియాంకను ప్రశంసించాల్సింది పోయి, ‘ఈ అందాలపోటీలను బ్యాన్‌ చెయ్యాలి. మన సంస్కృతిని ఇవి దిగజారుస్తున్నాయి’ అన్నారు. ఆయన ఉద్దేశం.. ఆడపిల్లలు వేదికలెక్కి ఒళ్లు చూపిస్తున్నారని! బ్యూటీ షేమింగ్‌లా కనిపించే బాడీ షేమింగ్‌ ఇది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top