మన దేశపు యోగ ఆ దేశపు గురువు

Sakshi Interview With Artem Romanenko About Yoga

ఏ దేశంలో జన్మిస్తేనేం మన దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆకర్షితుడైనాడు. కులం, మతం ఏదైనా మన పురాణేతిహాసాలను ఔపోసన పట్టాడు. వాటిల్లోని అంతరార్థాన్ని యోగాలో మేళవించి ప్రపంచదేశాలకు చాటి చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతనే ఉక్రెయిన్‌ దేశానికి చెందిన యోగా గురువు ఆర్టెమ్‌ మైరానెన్కొ. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తూ చెన్నైకు చేరుకుని యోగా తరగతులు నిర్వహిస్తున్న ఆర్టెమ్‌ మైరానెన్కొను ‘సాక్షి’ పలకరించింది. 28 ఏళ్ల వయస్సులోని తన జీవన గమనాల గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

‘నేను మా దేశంలో ‘ఆత్మమార్గ్‌’ పేరుతో యోగ శాల స్థాపించాను. మా అమ్మ ట్రిని ఉక్రెయిన్‌లో ఆయుర్వేద వైద్యురాలు. ఆమె తన 19వ ఏట నుంచే ఇస్కాన్‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంకితమైంది. ఆధ్యాత్మికత ఉన్న కొడుకు పుట్టాలని గర్భిణిగా ఉన్నప్పుడు ఇస్కాన్‌ ఆశ్రమం, మందిరానికి వచ్చే భక్తులకు సేవలు అందించేది. నేను పుట్టాక ఇస్కాన్‌ మందిరం, ఆశ్రమాలకు వెళ్లేపుడు తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లేది. దాంతో నేను ఆరేళ్ల ప్రాయం నుంచే వేదమంత్రాలు నేర్చుకోవడం ప్రారంభించాను. 6వ తరగతి చదువుతున్నపుడు అమ్మతో కలిసి భారత్‌లోని పుణ్యక్షేత్రాలను సందర్శించాను. ఇస్కాన్‌ వ్యవస్థాపకులు చైతన్య మహాప్రభు ప్రబోధలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. హఠయోగ ప్రదీపన, ఘిరంద సంహిత పుస్తకాలు చదివాను. 12వ ఏట ఇస్కాన్‌లో ఉండగానే భక్తి యోగ, జ్ఞానయోగ, కర్మయోగ, రాజయోగాలను అధ్యయనం చేశాను. స్వామి శివానంద పుస్తకాలు చదివాను. నేను చదివిన పురాణాలు, ఇతర ఆధ్యాత్మిక రచనలపై ఒకటిన్నర ఏడాదిపాటూ అధ్యయనం చేశాను. దైనందిన జీవితంలో అందరూ ఎంతో తపన పడే ఆస్తి, అంతస్తు, ధనం, సంసార బంధం ఏవీ వెంట రావని చిన్నతనంలోనే అర్థం చేసుకున్నాను. ప్రాపంచిక సుఖాలు అశాశ్వతం, ఆధ్యాత్మిక తత్వమే ముక్తికి మార్గం అని అర్థమైంది. తొలిరోజుల్లోనే అద్భుతమైన అనుభవాలను చవి చూసాను.

యోగా అంటే వ్యాయామం కాదు
యోగా వల్ల మానసిక పరిణితి సాధించకుంటే కేవలం ఆరోగ్య సాధనగానే మిగిలిపోతుంది. యోగా వల్ల మానవుడు దేవుడు కావచ్చు.  యోగా మనిషిని అంతర్ముఖులను చేయాలి. మానవ జన్మలోని పరమార్థాన్ని తెలుసుకోగలగాలి. యోగా అంటే మాయలు, మహిమలు కావు. మీలో అంతర్లీనమై ఉన్న అతీతమైన శక్తిని వెలికి తీయడమే. కళ్లు అనేవి లెన్స్‌ వంటివి. బాహ్యప్రపంచాన్ని మాత్రమే కాదు అంతర్ముఖంగా నీలో నిగూఢమై ఉన్న మంచిని చూడగలగాలి. దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా సమాజానికి మేలు చేయాలి. దృష్టి, ఆసనం ఒకటిగా ఉండాలి. అవి వేర్వేరుగా ఉన్నపుడు అది కేవలం ఒక వ్యాయామంగా మాత్రమే ఉపయోగ పడుతుంది. యోగా అభ్యసించడంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. యోగా వల్ల మానసిక పరివర్తన రావాలి. యోగాలోని అంతరార్దం, పరమార్దం తెలుసుకోకుండా కొందరు ఆచరిస్తున్నారు.S కొన్ని యోగా కేంద్రాల్లో సైతం సరైనమార్గం బోధించకుండా కేవలం శిక్షణాకేంద్రాలుగా మారుస్తున్నారు. దురదృష్టవశాత్తు యోగాపై కొందరు మిడిమిడి జ్ఞానంతో కొత్త కొత్త భాష్యాలు చెబుతున్నారు. యోగాలో ఎన్నో క్లిష్టతరమైన ఆసనాలు అందరికీ సాధ్యమే. కానీ అందరికీ అవసరం మాత్రం కాదు. స్పిరిట్చువల్‌ ఫోకస్‌ లేనివారు కూడా యోగావల్ల సత్ఫలితాలు అందుకుంటారు. ఒకప్పుడు ఇది హిందువులకు మాత్రమే అనుకునేవారు. కానీ కాలక్రమేణా సర్వమత సంప్రదాయంగా విస్తరిస్తోంది. అసలైన అనుసరణీయమైన యోగాను ప్రజలకు చాటిచెప్పాలని 18 ఏళ్ల వయస్సులోనే శిక్షణలు ఇవ్వడం ప్రారంభించాను. ప్రపంచమంతా పర్యటించాలి. యోగా ఆవశ్యకతలను అందరికీ చాటాలనేదే నా లక్ష్యం.
– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top