అతడే హీరో అతడే విలన్‌

Neil Nitin Mukesh Famous Actor in Bollywood Industry - Sakshi

యంగ్‌ బాలీవుడ్‌ – 9 / నీల్‌ నితిన్‌ ముకేష్‌

చూడటానికి హాలీవుడ్‌ నటుడిలా ఉంటాడు. ఒక క్షణంలో హీరో. మరు నిమిషంలో విలన్‌. కాని ఎప్పుడూ ఆడపిల్లలు వెంటపడేలా ఉంటాడు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ బాలీవుడ్‌లో, సౌత్‌లో ప్రస్తుతం చాలా బిజీ ఆర్టిస్ట్‌. పాటలు వినవచ్చే ఇంటి నుంచి వచ్చి వెండితెర మీద హంగామా సృష్టిస్తున్నాడు.

నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ పుట్టాక చూడటానికి ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ వచ్చింది. ఆమె ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆమె అలనాటి గొప్ప గాయకుడు ముఖేశ్‌ను తన సోదరుడిలా భావిస్తుంది కనుక.
ముఖేశ్‌ కుమారుడు నితిన్‌ ముఖేశ్‌. నితిన్‌ ముఖేశ్‌ కొడుకు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌. అంటే ముఖేశ్‌ మనమడు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌. తల్లి పొత్తిళ్లలో ఉన్న నీల్‌ను చూసిన లత ‘ఈ పిల్లాడు మన దేశం పిల్లాడిలా లేడు. ఏదో గ్రహం నుంచి వచ్చినట్టుగా చాలా ముద్దులొలుకుతున్నాడు. చంద్రమండలం మీద కాలు పెట్టినవాడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌. అందుకని అతని పేరు పెట్టండి’ అని సూచించింది. అలా నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ పేరు చంద్రుడితో ముడిపడింది. చంద్రుడిలాగే నీల్‌ కూడా అందగాడుగా ఎదిగాడు. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ కుటుంబం ఎప్పుడూ స్ట్రగుల్స్‌లోనే ఉంది. ముఖేశ్‌ గొప్ప గాయకుడే అయినా ప్రత్యేకమైన పాటలే అతనికి దక్కేవి. రఫీలా, కిశోర్‌ కుమార్‌లా అతడు అందరికీ పాడేవాడు కాదు. ఆయన తన కెరీర్‌లో స్థితిమంతుడు కాగలిగాడు కాని ఐశ్వర్యవంతుడు కాలేకపోయాడు.

ఆయన కుమారుడు నితిన్‌ ముఖేశ్‌ కూడా తండ్రిలానే ప్లేబ్యాక్‌ సింగింగ్‌లో ప్రవేశించాడు. ‘తేజాబ్‌’లో ‘సోగయా ఏ జహా’ హిట్‌ పాట అతడు పాడింది. ‘నూరీ’ సినిమాలో ‘నూరీ... నూరీ’ పాట కూడా అతడే పాడాడు. అయితే తండ్రి గొంతులాగే నితిన్‌ ముఖేశ్‌ గొంతు కూడా అన్ని పాటలకు సరిపోదు. ఆ కుటుంబంలో మూడో తరంలో వచ్చిన నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ తన తాతతండ్రులకు మల్లే గాయకుడు కావాలని అనుకోలేదు. నటుడు కావాలనుకున్నాడు. కాని అది అంత సులభమా? నీల్, రణ్‌బీర్‌ కపూర్‌ కాలేజీలో కలిసి చదువుకున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ కాలేజ్‌కు వచ్చేవాడేకాని ఏనాడూ క్లాస్‌లో కూచునేవాడు కాదు. కాలేజీ బయటే అతనో కాలేజీ నడిపేవాడు తన గ్యాంగ్‌తో. నీల్‌కు ఆ గ్యాంగ్‌ పట్ల ఆకర్షణ ఉన్నా తన నేపథ్యం కారణాన బుద్ధిగా క్లాసుల్లో కూచునేవాడు. కాని ఆ పాఠాలు ఏమీ తలకెక్కేవి కాదు. యాక్టింగ్‌ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుండేవాడు. అది చూసిన రణ్‌బీర్‌ ‘అంత కష్టపడతావెందుకు.

నేను కూడా యాక్టర్నే అవుదామనుకుంటున్నాను. కాని హైరానా లేకుండా ఉన్నాను’ అన్నాడు అతనితో. దానికి నీల్‌ ‘కరెక్ట్‌. నువ్వు అలాగే ఉండాలి. ఎందుకంటే నీది కపూర్‌ ఘరానా. మీరంతా నటులు. నాది మాధుర్‌ ఘరానా. మేమంతా పాటగాళ్లం. ఆ ఇంటి నుంచి వచ్చి నటుడిగా నిరూపించుకోవాలంటే చాలా కష్టపడాలి’ అన్నాడు. అన్నట్టుగా నటనలో తర్ఫీదు అయ్యాడు. అతని తీర్చిదిద్దినట్టుండే రూపం లాభించింది. దర్శకుడు శ్రీరామ్‌ రాఘవన్‌ అతన్ని హీరోగా పెట్టి ‘జానీ గద్దార్‌’ సినిమా తీశాడు. ‘జానీ గద్దార్‌’ ఒక క్రైమ్‌ థ్రిల్లర్‌. ఒక ముఠాలో నమ్మకంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఆ ముఠాకు చెందిన డబ్బును కాజేసే కుర్రాడిగా నీల్‌ అందులో నటించాడు. నిజానికి అది పూర్తిగా నెగెటివిటి ఉన్న పాత్ర. నీల్‌ వంటి అందగాడు అంత నిర్దయమైన పాత్రను పోషిస్తే ప్రేక్షకులు రిజెక్ట్‌ చేసే ప్రమాదం ఉంది. కాని నీల్‌ తన ప్రతిభతో పాత్రను నమ్మించగలిగాడు. ‘జానీ గద్దార్‌’ పెద్ద హిట్‌ అయ్యింది. తర్వాత కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో తయారైన ‘న్యూయార్క్‌’లో ముస్లిం కుర్రాడిగా నటించాడు.

న్యూయార్క్‌లో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా క్యాబ్‌ నడిపే అతగాణ్ణి పోలీసులు అరెస్ట్‌ చేస్తారు డిక్కీలో ఆయుధాలున్నాయని. కేసు క్షణాల్లో బిగుసుకుపోతుంది. అక్కణ్ణుంచి కథ మలుపులు తిరుగుతూ పోతుంది. న్యూయార్క్‌ సినిమా కూడా పెద్ద హిట్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత నీల్‌కు కాలం కలిసి రాలేదు. ‘లఫంగే పరిందే’, ‘జైల్‌’, ‘తేరా క్యాహోగా జానీ’ వంటి సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. ఇంకో మూడు సినిమాలు అదే దారి పట్టాయి. నీల్‌ తన తండ్రిలా, తాతలా స్ట్రగుల్‌ ఎదుర్కొనాల్సి వస్తుందా అని ఆందోళన చెందాడు. సినీరంగంలో ఈ ఆందోళన సర్వసాధారణం. ఇవాళ్టి పున్నమి. రేపటి అమావాస్య. అయితే అప్పుడు సౌత్‌ నుంచి మురగదాస్‌ ఆదుకున్నాడు.

విజయ్‌ హీరోగా చేసిన ‘కత్తి’లో విలన్‌ వేషం ఆఫర్‌ చేశాడు. అది పెద్ద హిట్‌ అయ్యింది. ‘ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో’, ‘గోల్‌మాల్‌ అగైన్‌’ వీటిలో వేసిన పాత్రలు, ఆ సినిమాలు హిట్‌ అయ్యాయి. ‘ఇందు సర్కార్‌’లో ‘సంజయ్‌గాంధీ’లా కనిపించి ఆకట్టుకున్నాడు నీల్‌. తెలుగులో ‘కవచం’, ‘సాహో’ సినిమాలు ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గర చేశాయి. నీల్‌ పెళ్లి చేసుకున్నాడు. రుక్మిణి సహాయ్‌ అతని భార్య పేరు. ఉమ్మడి కుటుంబంలో ఉండటానికే ఇష్టపడతాడు. శారీరక దారుఢ్యం మీద చాలా శ్రద్ధ పెట్టే నీల్‌ కనీసం పది పదిహేనేళ్లు అన్ని భాషలలో నటించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు.
మంచిగానూ చెడ్డగానూ కనిపించగల నటుల వరుసలో నీల్‌ టాప్‌ లెవల్‌లో ఉన్నాడు. అతని విజయపరంపరకు ఇప్పుడప్పుడే ఢోకా లేదు.

– ఫీచర్స్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top