పారితోషికం విషయంలో ఎప్పుడూ డిమాండ్ చేయలేదని.. చాలా సినిమాలకు తనతో కలిసి నటించిన వారికంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నానని అన్నారు నటి ప్రియమణి. ఈ విషయంలో తాను ఎప్పుడూ బాధ పడలేదని చెప్పారు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పారితోషికం, షూటింట్ టైమింగ్స్ ఇష్యూపై స్పందించారు. మనకు ఉన్న స్టార్‌డమ్ ఆధారంగా నిర్మాతలు రెమ్యునరేషన్ ఇస్తారని...ఎక్కువ, తక్కువ అనేది తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు.
‘నేనెప్పుడు రెమ్యునరేషన్‌కి ప్రాధాన్యత ఇవ్వలేదు. నాకున్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలను అడుగుతాను. చాలా సందర్భాలలతో నాతోటి నటించిన వారికంటే తక్కువ పారితోషికం తీసుకున్నాను. నా పాత్ర, నిడివి చూసుకొని సినిమాలను అంగీకరిస్తాను కానీ.. డబ్బులు ఎంత ఇస్తున్నారనేది నేను పట్టించుకోను. నేను అర్హురాలిని భావిస్తే.. పారితోషికం పెంచమని డిమాండ్ చేస్తా. అంతేకానీ.. అనవసరంగా ప్రతిసారి పారితోషికం పెంచమని కోరను’అని ప్రియమణి చెప్పుకొచ్చారు.
సౌత్కి బాలీవుడ్కి తేడా అదే..
ఇక షూటింగ్ టైమింగ్స్ గురించి మాట్లాడుతూ.. ఈ విషయంలో సౌత్కి నార్త్కి చాలా తేడా ఉందన్నారు. ‘సౌత్ ఇండస్ట్రీలో చెప్పిన టైమ్కి షూటింగ్ని ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటకు షూటింగ్ ప్రారంభిస్తామని షెడ్యూల్ ఇస్తే... కచ్చితంగా ఆ సమయానికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ బాలీవుడ్లో అలా కాదు. ఉదయం 8 గంటలకు షూటింగ్ అంటే.. నటీనటులు అప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరుతారు. అక్కడ చెప్పిన సమయానికి షూటింగ్ స్టార్ట్ కాదు’ అని ప్రియమణి అన్నారు. ప్రియమణి సినిమాల విషయానికొస్తే..ఇటీవల ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’, అమెరికన్ షో ‘ది గుడ్ వైఫ్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’తో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్‌లోనూ నటిస్తోంది.


