పంతొమ్మిదేళ్లుగా బుల్లితెర అమ్మ

Meghna Rami About Her Journey In Serial Life - Sakshi

‘కాలచక్రం సీరియల్‌ చేస్తున్నప్పుడు నా వయసు 21. అప్పుడే అమ్మగా చేశాను. నాతో పాటు వచ్చిన హీరోయిన్లు ఇప్పుడు అమ్మలు అయ్యారు. కానీ, నేను మాత్రం పంతొమ్మిదేళ్లుగా అమ్మగానే ఉన్నాను..’ అంటోంది మేఘనా రామి. ఒక దశలో 117 కేజీల బరువుకు మించిపోయి, ఆ తర్వాత తనకు తానుగా తగ్గి తిరిగి జీ టీవీలో ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చక్రవాకం సీరియల్‌ ఇంద్రనీల్‌ అర్ధాంగి మేఘనారామి. ఒక దశలో ఆవహించిన బద్ధకం, తిరిగి జీవితాన్ని చురుగ్గా మార్చుకున్న విధానం.. ఇలా ఎన్నో విషయాలను ముచ్చటించింది... ‘కొన్ని ఏళ్ల తర్వాత ఓ మంచి ప్రాజెక్ట్‌ నన్ను వెతుక్కుంటూ వచ్చింది.

ఆ క్రెడిట్‌ అంతా మా ఆయన ఇంద్రనీల్‌కే ఇవ్వాలి. ఓ రోజు జీ టీవీ నుంచి ఫోన్‌ ‘రాధమ్మ కూతురు సీరియల్‌లో నటిస్తారా’ అని. అందులో రాధమ్మ చుట్టూ తనే స్టోరీ అంతా నడుస్తుంది అన్నారు. చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాను. నేను ‘బాగా లావుగా ఉండి, కొంత వరకు తగ్గాను. అదే విషయం చెబుతూ ఇప్పుడు ఫొటోస్‌ పంపిస్తాను ఒకసారి చూసి చెప్పండి’ అన్నాను. ‘ఎందుకు సందేహిస్తావు. ఇలాంటి క్యారెక్టర్‌ కోసమే ఎదురుచూస్తున్నావ్‌ కదా.. చేసెయ్‌ అన్నారు’ ఇంద్రనీల్‌. ఓ గంటలోపు ఫోన్‌ చేసి ‘లుక్‌ టెస్ట్‌ చేద్దాం రండి’ అన్నారు. ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌ ఉండి కూడా లుక్‌ టెస్ట్‌కి భయపడ్డాను ఓకే అవుతానా.. అని.

బుల్లితెరపై ‘ముత్తయిదువ’ నా మొట్టమొదటి సీరియల్‌. ఆ తర్వాత ‘ఆత్మీయులు’, కాలచక్రం, చక్రవాకం చేశాను. అన్నింటిలోనూ హీరోయిన్‌కి అమ్మగా. ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్‌లో మాత్రం నా గెటప్‌ చాలా హెవీగా ఉంటుంది. రాధమ్మ క్యారెక్టర్‌ విన్న తర్వాత నాకు నేనే డిసైడ్‌ అయ్యి సింపుల్‌గా రెడీ అయ్యా. లుక్‌ టెస్ట్‌లో అందరూ ఓకే అన్నారు. ఆ తర్వాత కొంతమంది సీనియర్‌ ఆర్టిస్టులు ‘రాధమ్మ కోసం మమ్మల్నీ అడిగారు’ అని చెబుతుంటారు. ఎంతమంది అనుకున్నా ఆ క్యారెక్టర్‌ నన్ను వరించింది. దానికి తగ్గ న్యాయం చేయాల’ని తపన పడుతున్నాను.

ప్లస్‌ సైజులో ప్లస్‌వి వెతికేదాన్ని
అన్నీ తెలిసినా ఒక్కోసారి బుర్ర పనిచేయదు. ఒకలాంటి స్తబ్దత మనసును చుట్టేస్తుంది. ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్‌ సమయానికే 117 కేజీలకు పైగా బరువు పెరిగిపోయాను. కారణం ఏంటంటే... ఆరేళ్ల క్రితం సీరియల్‌ టైమ్‌లో అబార్షన్‌ అయ్యింది. ఆ బాధలో ఇండస్ట్రీకి దూరమై  ఇంట్లోనే ఉన్నాను. ఉదయాన్నే పూజ చేసి, ఇంద్రకు బాక్స్‌ కట్టిచ్చి, ఆ తర్వాత టీవీ ముందుకూర్చోవడం... బెడ్‌ మీద నుంచి లేచేదాన్ని కాదు.  అదేపనిగా గంటల తరబడి కూర్చోవడం, తింటూ ఉండటంతో.. బాగా లావయ్యాను. బరువు పెరుగుతున్నావు, డైట్‌ చేయమని ఇంద్రనీల్, అమ్మనాన్న, చెల్లెలు ఎవరు చెప్పినా వినలేదు. డ్రెస్సులు కొనుక్కోవడానికి షాపింగ్‌కి వెళితే ప్లస్‌ సైజువే తీసుకునేదాన్ని. అందులోనూ ఫ్రీ సైజు డ్రెస్సులు ఉన్నాయా అని వెతికేదాన్ని.

మార్చేసిన డ్యాన్స్‌ షో

ఒక టీవీ షోలో కపుల్‌ డ్యాన్స్‌లో పాల్గొనేందుకు వెళ్లాను. అది కూడా ఇంద్రనీల్‌ కోసం ఒప్పుకున్నాను. జంట డ్యాన్స్‌. ఏదో రెండు ఎపిసోడ్స్‌ చేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ, ఆ షోలో అందరూ ప్రశంసించడంతో ఆలోచనల్లో పడ్డాను. ఇంద్ర కోసం డ్యాన్స్‌ చేయాల్సిందే అని చాలా కష్టపడ్డాను. మూడు నెలలు ఇంద్ర చుక్కలు చూపించాడు.(నవ్వుతూ) నాలుగు గంటలకు లేపి ‘ఐదు గంటలకల్లా రెడీ అవ్వు.. అని తొందరపెట్టేవాడు. అలవాటు లేని ప్రాణం కదా, నరకం అనిపించేది. టీవీ స్క్రీన్‌ మీద నన్ను నేను చూసుకున్నాక తగ్గాలనిపించింది. మొత్తానికి ఆ ప్రాసెస్‌లో ట్రోఫీ గెలుచుకున్నాను.

ఆరోగ్యకరమైన ఆహారం
అప్పటి వరకు ఏది పడితే అది తిన్న నేను ‘ఏం తింటే బరువు నియంత్రణలో ఉంటుంది’ అని బోలెడంత రీసెర్చ్‌ చేశాను. డ్యాన్స్‌లో యాక్టివ్‌గా ఉండటం కోసం చేసిన ప్రయత్నాలన్నీ క్రమం తప్పకుండా చేసేలా మార్చాయి. ముఖంలో కళ తగ్గకుండా ఒళ్లు తగ్గాలంటే డైట్‌ హెల్దీగా ఉండేలా నేను చేసుకున్న ప్లాన్‌ ఫలించింది. 117 కేజీల బరువున్న నేను 8 నెలల్లో 40 కేజీలు తగ్గాను. అర కిలోమీటర్‌ నడవాలంటేనే ఆయాసపడేదాన్ని. ఇప్పుడు రోజూ 6 కిలోమీటర్లు ఫాస్ట్‌గా నడిచేస్తున్నాను.

గర్భవతిగా ఉన్న సీన్‌ 
రాధమ్మ కూతురులో సన్నివేశాలన్నీ భావోద్వేగాలతో కూడుకున్నవే. ఇందులో ఒక ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌.. విజయవాడ కృష్ణానది ఒడ్డున జరుగుతుంది. నేను కడుపుతో ఉంటాను. ఎలాంటి సాయం అందని స్త్రీని. భర్త మరో స్త్రీతో ఉంటాడు. గట్టు మీద పడిపోయి అక్కడే డెలివరీ అవుతుంది. ఇద్దరు పెద్ద పిల్లలు అప్పుడే పుట్టిన పాపతో భర్త దగ్గరకు వెళ్లే సీను గుండెను పిండేసేలా ఉంటుంది.  రాధమ్మ పాత్రకు ఎంతగా కనెక్ట్‌ అయ్యానంటే సీరియల్‌లోని నా కూతుళ్లు స్క్రీన్‌పై అందంగా కనిపించాలని నా చీరలు తెచ్చివ్వడం, ఇమిటేషన్, ఫ్యాషన్‌ జ్యువెలరీ ఐటమ్స్‌ తీసుకొచ్చి ఇవ్వడం. నాది తల్లి పాత్ర కాబట్టి నేను ఎలా ఉన్నా పర్లేదు. పిల్లలు బాగా కనిపించాలనుకునేంతగా... తల్లిగా చక్రవాకం సీరియల్‌లో 500 ఎపిసోడ్లు చేశా. అప్పటికన్నా ఇప్పుడు అమ్మగా బాగా చేయగలుగుతున్నాను అనిపిస్తుంది.

సెల్ఫీ ప్లీజ్‌ ...
నేను టైటిల్‌ రోల్‌లో నటించాలన్న ఇంద్రనీల్‌ కల ఇన్నాళ్లకు నెరవేరిందని చాలా సంతోషంగా ఉన్నాను. ఇటీవల మహాబలేశ్వరం వెళ్లినప్పుడు అక్కడ కొందరు తెలుగు వాళ్లు వచ్చి ‘రాధమ్మా...’ అని పిలిచారు. ‘మా రాధమ్మతో ఓ ఫొటో తీయండి’ అని ఇంద్రనీల్‌కి ఫోన్‌లు ఇచ్చి అడిగి మరీ ఫొటోలు తీసుకున్నారు.  ‘ఫీలయ్యావా!’ అంటే ‘నేను చాలా చాలా హ్యాపీ.. ఇలా ఫొటోలు తీసుకుంటూ గడిపేస్తా!’ అని నవ్వేసారు.’
– సంభాషణ: నిర్మలారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top