ఎందుకు పుట్టడం లేదు?  | Many couples in India suffer from childrens problem | Sakshi
Sakshi News home page

ఎందుకు పుట్టడం లేదు? 

Jan 9 2019 11:52 PM | Updated on Jan 10 2019 12:49 AM

Many couples in India suffer from childrens problem - Sakshi

సమాజం స్పీడ్‌ పెరిగింది. పట్టుకుందామంటే అందడం లేదు. మనసు గర్భం స్ట్రెస్‌తో కుంగిపోతోంది. గుండె గర్భం బాధ్యతలతో బరువెక్కింది. అందుకేనేమో చిలకా గోరింకల్లాంటి జంటలు కూడా తల్లిదండ్రులు కాలేకపోతున్నాయి. తప్పు ఎక్కడుంది? ఒక్కోసారి శరీరంలో ఉండవచ్చు. కానీ... చాలాసార్లు అజ్ఞానంలో ఉంటుంది. దాన్ని తొలగించడం కోసమే... చదవండి... తెలుసుకోండి... కనండి 
ఇటీవల కాలంలో భారతదేశంలో చాలా జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాయి. వీళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. పైచదువులు, మంచి ఉద్యోగాలు అంటూ ఆధునిక యువత  కెరియర్‌ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఎదురుచూస్తూ ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆధునిక ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్‌ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి సామాజికంగా ఉన్న అవరోధాలు. దీనికి తోడు ఒక ఇంట్లో భార్యాభర్తా ఇద్దరూ పనిచేస్తుంటే వారి పనివేళలు వేరువేరుగా ఉండటం, ఒకవేళ కలిసే సందర్భాల్లో వారిద్దరూ అలసిపోయి ఉండటం వంటివి కూడా ఇటీవలి ఆధునిక ఉద్యోగాల కారణంగా చోటు చేసుకుంటున్న మరో సామాజికమైన సమస్య. 

ఇవిగాక ఆరోగ్యరీత్యా చూసుకుంటే వ్యక్తుల్లో, ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు, హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడటం వంటివి మరికొన్ని. ఇక ప్రత్యేకంగా మహిళల్లోనే వచ్చే సమస్యలు కూడా సంతానలేమికి ఎంతో దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇంప్లాంటేషన్‌లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి. డాక్టర్‌ సలహా, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా కొన్ని మందులు వాడటం కూడా సంతానలేమికి ఒక కారణంగా కొంతవరకు చెప్పవచ్చు. 

సంతానలేమి సమస్య ఉందని  నిర్ధారణ ఎలా? 
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులను పాటించకుండా, అన్యోన్యంగా కలిసి ఉంటూ ఏడాది పాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలు ఉండవచ్చు. ఇలాంటి సమస్యను ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇక రెండో రకమైన సంతానలేమి కూడా కొందరిలో కనిపిస్తుంటుంది. మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత, రెండోసారి గర్భధారణ జరగాలని కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు.జంటలోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఎలాంటి సమస్యలు లేకపోయినా 100  జంటల్లో 80 శాతం మందికి పెళ్లయిన ఏడాదికి గర్భం వస్తుంది. మిగతా 10 శాతం మంది జంటల్లోనూ రెండు సంవత్సరాల్లో గర్భం వస్తుంది. మిగతా వారిలో 5 శాతం మందికి సంతానలేమి చికిత్స అవసరం. మిగతా 5% మందికి మాత్రం అడ్వాన్స్‌డ్‌ చికిత్సలు అవసరమవుతాయి. 

సంతానలేమి చికిత్సకు ఎవరు అర్హులు ?
మహిళకు ప్రతినెలా నెలసరి సక్రమంగా వస్తూ, రెండేళ్ల పాటు ప్రయత్నించాక కూడా గర్భం రానివారికీ, ఆ మహిళ 30 ఏళ్ల వయసుకు చేరుకుంటున్నప్పుడు... ఆ దంపతులు డాక్టర్‌ను సంప్రదించి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం మంచిది. అలాగే 30 ఏళ్లు దాటిన మహిళలైతే అప్పటికే ఏడాదిగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇక 33 ఏళ్లు దాటిన మహిళలైతే ఆరు నెలలు ప్రయత్నించినా గర్భం రాకపోతే డాక్టర్‌ను వెంటనే కలవాలి. అయితే తక్కువ వయసున్న మహిళలు ఏడాది లేదా ఆర్నెల్లు ప్రయత్నించినా గర్భం రాలేదని ఆందోళన చెందడం సరికాదు. మరో ఏడాది భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా గడిపి అప్పటికీ గర్భం రాకపోతే అప్పుడు డాక్టర్‌ను కలవండి. 

గర్భం ఎలా వస్తుంది? 
గర్భధారణకు మహిళ, పురుషుడు ఈ ఇద్దరూ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండాలి. పురుషుడిలో వీర్యకణాల సంఖ్య సంతానం కలగడానికి అనువుగా ఉండాలి. సాధారణంగా ఒకసారి పురుషుడి వీర్యం విడుదలైతే అందులో కనీసం 20 – 60 లక్షల వీర్యకణాలు ఉండి, అందులో 40% నుంచి 50% మంచి కదలిక ఉండి, వాటి నాణ్యత బాగుంటే సంతానం వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే వారిలో మెదడు నుంచి ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టీఎస్‌హెచ్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి నెలనెలా అండాశయాల మీద ప్రభావం చూపి, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లు విడదలయ్యేలా చేస్తాయి. ఈ హార్మోన్లు నెలానెలా అండం తయారీకీ, విడుదల కావడానికి దోహదపడతాయి. అలా అండం విడుదలైనప్పుడు స్త్రీ,పురుషుల కలయిక సంభవిస్తే అప్పుడు వీర్యకణాలు యోని నుంచి గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) ద్వారా లోపలివైపునకు ఈదుకుంటూ పోతాయి. ఈలోపు గర్భాశయంలోని అండాశయం నుంచి విడుదలైన అండం ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లోకి ప్రవేశించి అక్కడ ఉంటుంది. ఇది నెలసరికీ, నెలసరికీ దాదాపు మధ్యగా ఉండే కాలంలో జరిగే ప్రక్రియ.

ఈ సమయంలో స్త్రీ, పురుషుల కలయిక జరిగితే ఈదుకుంటూపోయే వీర్యకణాలు అక్కడి అండంలోకి ప్రవేశించడం జరిగితే, ఆ ప్రక్రియను ఫలదీకరణ (ఫెర్టిలైజేషన్‌) అంటారు. క్రమం తప్పకుండా రుతుక్రమం వచ్చే మహిళల్లో రుతుక్రమం వచ్చిన  రోజు నుంచి 11వ రోజు మొదలుకొని 16వ రోజు వరకు ఏదో ఒక సమయంలో అండం సంపూర్ణంగా సంసిద్ధమై ఉంటుంది. అప్పుడు దంపతులు తప్పక కలవడం   అవసరం.  ఇలా ఫలదీకరణ జరగడం వల్ల అండం పిండంగా మారుతుంది. ఇలా ఫలదీకరణ జరిగాక ఆ పిండం గర్భాశయంలో ప్రోజెస్టెరాన్‌ హార్మోన్‌ వల్ల మందంగా తయారై ఉన్న ఎండోమెట్రియమ్‌ అనే పొరలో ఒదిగిపోయి (ఇంప్లాంటేషన్‌), శిశువుగా పెరుగుతుంది. ఇంత సంక్లిష్టంగా ఉండే ఈ ప్రక్రియలో ఎక్కడ లోపం ఏర్పడ్డా, గర్భధారణ ప్రక్రియ జరగక సంతాన లేమి సమస్య వస్తుంది. 

పిల్లలు కలిగేందుకు  వయసు పరిమితి ఇలా
మహిళలు 21 సంవత్సరాల వయసులో శారీరకంగానూ, మానసికంగానూ దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా ఆ సమయంలో గర్భం ధరించడానికి వారి శరీరం సంసిద్ధంగా ఉంటుంది. కాబట్టి మహిళలు తమకు కనీసం 21 ఏళ్ల వయసు వచ్చాకే గర్భం ధరించడానికి ప్రయత్నించడం మంచిది. మహిళల్లోని అండాశయంలో పరిపక్వత చెందని అండాలు రజస్వల అయ్యే నాటికి నాలుగు లక్షలు ఉంటాయి. వీటిలో ప్రతి నెలా కొన్ని నశించిపోతూ, ఒక్కొక్క అండమే పెరిగి విడుదల అవుతుంటుంది. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి 30 ఏళ్ల వయసు దాటే కొద్దీ ఆ అండాల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలవుతుంది. 35 ఏళ్ల వయసు దాటే సరికి అండాల సంఖ్య, నాణ్యత బాగా తగ్గడం మొదలవుతుంది. దాంతో సంతానలేమి సమస్య పెరుగుతుంది. 

సమస్యను కనుగొనడం ఎలా? 
అండం విడుదల అవుతోందా లేదా అని తెలుసుకోడానికి 11వ రోజు నుంచి 18వ రోజు వరకు ఫాలిక్యులార్‌ స్టడీస్, ట్రాన్స్‌వెజైనల్‌ స్కానింగ్‌ వంటి పరీక్షలు చేయించుకోవాలి. దీని కంటే ముందు పీరియడ్‌ వచ్చిన మూడో రోజు బేసల్‌  పెల్విస్‌ స్కాన్‌ చేయించుకోవడం వల్ల అండాశయాలు ఎలా ఉన్నాయి, వాటిలో చిన్న అండాల సంఖ్య (ఒవేరియన్‌ రిజర్వ్‌) ఎలా ఉంది, పీసీఓడీ ఉందా ఇంకా వేరే సిస్ట్‌లు ఏమైనా ఉన్నాయా, గర్భాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు. అలాగే అండం విడుదల కాకపోవడానికి హార్మోన్ల సమస్య ఏమైనా ఉందేమో తెలుసుకోడానికి ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, ప్రోలాక్టిన్, టీఎస్‌హెచ్, ఈస్ట్రోజెన్‌ వంటి రక్తపరీక్షలు చేయడం అవసరమవుతుంది. అండాల నాణ్యత, వాటి సంఖ్య  తెలుసుకోవడానికి కొందరిలో సీరమ్‌ ఏఎమ్‌హెచ్‌ అనే పరీక్ష చేయించడం జరుగుతుంది. 

చికిత్స : అండం సరిగా పెరగనప్పుడు, అండం పెరగడానికి క్లొమిఫిన్, లెట్రోజ్‌ వంటి కొన్ని రకాల మాత్రలు..., వాటి మోతాదులను క్రమంగా  పెంచుకుంటూ వాడాల్సి ఉంటుంది. అలా జరగనప్పుడు గొనాడోట్రోపిన్‌ హార్మోన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వడం జరుగుతుంది. అండాశయాలలో పీసీఓడీ కారణంగా అండాలు పెరగకపోతే ఆ సందర్భంలో లాపరోస్కోప్‌ అనే చిన్న ఆపరేషన్‌ ద్వారా, పీసీఓడీలోని నీటితిత్తుల్లో కొన్నింటిని కాల్చడం జరుగుతుంది. దీన్నే ఒవేరియన్‌ డ్రిల్లింగ్‌ అంటారు. దాంతో కొంతమేరకు హార్మోన్లలో వచ్చిన తేడా తగ్గిపోయి, మళ్లీ మందుల వల్ల అండం విడుదల అయ్యే అవకాశాలు పెరుగుతాయి.  అలాగే అండాశయంలో సిస్ట్‌లు (నీటితిత్తులు), ఎండోమెట్రియాసిస్‌ వంటి సమస్యలను కూడా లాపరోస్కోపిక్‌ ప్రక్రియ ద్వారా తొలగించి, ఆ తర్వాత గర్భం వచ్చేందుకు అవసరమైన చికిత్స తీసుకోవచ్చు. వయసు పెరిగే కొద్దీ అండాలు తగ్గిపోయి, మందులు ఇచ్చినప్పటికీ అండాల సంఖ్య పెరగనప్పుడు, ఎవరైనా దాత నుంచి స్వీకరించి అండాన్ని తీసుకుని దాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. (ఇలా సేకరించిన అండాన్ని డోనార్‌ ఊసైట్‌ అంటారు). థైరాయిడ్‌ సమస్య ఉన్నప్పుడు, మొదట దాన్ని తగ్గించే మందులు వాడాలి. అప్పుడు ఆ కారణంగా వచ్చిన హార్మోన్ల అసమతౌల్యత తగ్గి, గర్భధారణకు అవకాశాలు మెరుగుపడతాయి. 

సంతానలేమికి కారణాలు
మొదటే చెప్పినట్లు సంతానలేమికి అటు పురుషుల్లోనూ, ఇటు మహిళల్లోనూ కారణాలు ఉంటాయి. అయితే ఇక్కడ మహిళల్లో కనిపించే సమస్యలను చూద్దాం. అండం విడుదలలో లోపాలు : సంతానం కలగకపోవడానికి మహిళల్లో అండం విడుదలలో లోపాలు 30, 40 శాతం వరకు కారణమవుతున్నాయి. మళ్లీ అందుకు తగిన కారణాలూ ఉన్నాయి. టెన్షన్‌ లేదా స్ట్రెస్‌ కారణంగా మెదడు నుంచి విడుదల కావాల్సిన హార్మోన్లు సరిగా విడుదల కాకపోవడం, ఒకవేళ విడుదలైనా అవి సరిగా పనిచేయకపోవడం వల్ల అండాశయం నుంచి అండం విడుదల కాదు. కొందరిలో అధిక బరువు కూడ అండం విడుదల లోపాలకు కారణమవుతుంటుంది. 

అలాగే ఎక్కువగా డైటింగ్, వ్యాయామాలు చేసి, ఉన్నట్లుండి బరువు తగ్గడం, మరీ నాజూగ్గా ఉండటం వల్ల కూడా హార్మోన్లు క్రమం తప్పుతాయి. అలాగే ఈ క్రమంలో కొందరికి పోషకాహార లోపం వంటి సమస్య కలిగి ఇది కూడా అండం విడుదలకు ఒక అవరోధంగా మారుతుంది. థైరాయిడ్‌ సమస్య అండం విడుదల కాకుండా ఉండేందుకు కలిగే సమస్యల్లో ముఖ్యమైనదీ, కీలకమైనది. పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ : ఈ సమస్య కారణంగా కొందరి అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు చోటుచేసుకుంటాయి. వారి వారి శరీర తత్వాన్ని బట్టి వాటి వల్ల కొందరిలో హార్మోన్ల అసమతౌల్యత ఏర్పడవచ్చు. దాంతో వారిలో అండం సక్రమంగా విడుదలకాకపోవచ్చు. ఇక గుండె, మూత్రపిండాల వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్న కొందరిలోనూ అండం సక్రమంగా విడుదల కాకపోడానికి అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ అండాలు తగ్గిపోవడం వల్ల కూడా కొందరిలో అండం విడుదల కాదు. 

తప్పు మహిళదా... పురుషుడిదా? 
సాధారణంగా మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే ఆమెనే తప్పుబడుతుంటారు. లోపం ఆమెలోనే ఉందని గుడ్డిగా తీర్మానిస్తుంటారు. అయితే గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు 10% ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయ పద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి. ఇటీవలి వైద్యశాస్త్ర పురోగతి వల్ల ఎవరిలో లోపాలున్నప్పటికీ, వాటిని అధిగమించుకునేందుకు అవసరమైన ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి.

అందుకే ఎవరినెవరూ నిందించుకోకుండా, పరస్పరం సహకరించుకుంటూ అదే అన్యోన్యతను కొనసాగించుకునే దంపతులకు ఈ కాలంలో సంతానభాగ్యం కలగడం అంత పెద్ద సమస్యేమీ కాబోదని దంపతులిద్దరూ గుర్తించాలి. వారితో పాటు వారి తరఫు బంధువులందరికీ ఈ విషయంలో అవగాహన అవసరమని చాలా రకాల సామాజిక పరిశీలనలూ తెలుపుతున్నాయి. అందుకే సంతానలేమి ఉన్న దంపతుల్లో కేవలం వారు మాత్రమే కాకుండా, అందరూ ఈ విషయంలో అవగాహన పెంపొందించుకోవడం అవసరం. 
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement