ఎందుకు వస్తాయి?

Health Tips By Shobha In Funday On 22/12/2019 - Sakshi

►నా స్నేహితురాలు ఒకరు గర్భసంచిలో గడ్డలతో బాధ పడుతోంది. ఈ గడ్డలు ఉన్నట్లు తెలుసుకోవడం కష్టమని తను చెప్పింది. ఎలాంటి లక్షణాల ద్వారా ఇవి ఉన్నట్లు కనిపెట్టవచ్చు? అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఇవి రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకునే వీలుందా? – జి.స్వప్న, ఏలూరు
గర్భసంచిలో వచ్చే గడ్డల్లో ఎక్కువ శాతం ఫైబ్రాయిడ్‌ అనే గడ్డలు ఉంటాయి. గర్భాశయంలోని కండరం, ఫైబ్రస్‌ కణజాలం ఎక్కువగా పెరిగి గర్భాశయంలో ఎక్కడైనా చేరి గడ్డలుగా మారుతాయి. ఇవి ఒక్కచోట ఒక్కటే ఏర్పడవచ్చు లేదా గర్భాశయంలో అనేక ప్రదేశాల్లో అనేకం పెరగవచ్చు. గర్భాశయం పైపొరలో ఏర్పడితే సబ్‌సీరస్‌ ఫైబ్రాయిడ్స్‌ అని, మధ్య పొరలో ఏర్పడితే ఇంట్రామ్యూరల్‌ ఫైబ్రాయిడ్స్‌ అని, ఎండోమెట్రియల్‌ పొరలో ఏర్పడితే సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌ అని అంటారు. ఇవి ఎందుకు ఎవరికి వస్తాయనేందుకు కారణాలు చెప్పడం కష్టం. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, బరువు ఎక్కువగా ఉన్నవారిలో, ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అనేక సైజుల్లో అంటే బఠాణీ సైజు నుంచి పుచ్చకాయ సైజు అంతవరకు పెరగవచ్చు.

ఇవి 99.9 శాతం క్యాన్సర్‌ గడ్డలు కావు. ఫైబ్రాయిడ్స్‌ పెరిగే చోటు, సైజు బట్టి లక్షణాలు ఉంటాయి. ఇవి పెద్దసైజులో ఉన్నా సబ్‌సీరస్‌ ఫైబ్రాయిడ్స్‌ అయితే చాలావరకు లక్షణాలు ఉండవు. వేరే సమస్యలకు స్కానింగ్‌ చేయించినప్పుడు ఫైబ్రాయిడ్స్‌ ఉన్నాయని గుర్తించడం జరుగుతుంది. అదే సబ్‌ మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌ అయితే, చిన్నగా ఉన్నా బ్లీడింగ్‌ ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్‌ పెరిగే చోటును బట్టి, పరిమాణం బట్టి అనేక లక్షణాల్లో భాగంగా కొందరిలో అధిక రక్తస్రావం, త్వరగా పీరియడ్స్‌ వచ్చేయడం, పొత్తికడుపులో నొప్పి, బరువుగా ఉండటం, నడుమునొప్పి, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాలనిపించడం, పీరియడ్స్‌ తర్వాత కూడా మధ్యలో బ్లీడింగ్‌ అవడం వంటి లక్షణాలు ఉండవచ్చు.

దాదాపు 70–80 శాతం ఆడవారిలో వారి జీవితకాలంలో ఫైబ్రాయిడ్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి రాకుండా చూసుకోవడానికి మనం చేయగలిగిందేమీ లేదు. శరీర తత్వాన్ని బట్టి కొందరిలో ఇవి వచ్చే లక్షణాలు ఉంటాయి. జాగ్రత్తలలో భాగంగా ఎక్కువ బరువు పెరగకుండా ఉండటం, తగ్గడానికి క్రమంగా నడక, వ్యాయామాలు, మితమైన ఆహారం తీసుకోవడం మంచిది. లక్షణాలు ఏమీ లేకుండా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్‌ ఉంటే వాటిని తొలగించాల్సిన అవసరం ఏమీ లేదు. డాక్టర్‌ సలహా మేరకు క్రమంగా స్కానింగ్‌ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్‌కు డాక్టర్‌ సలహాపై దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్‌ పెద్దగా ఉండి, లక్షణాలు తీవ్రంగా ఉంటేనే ఆపరేషన్‌ అవసరం అవుతుంది.

►తల్లి ప్రసవించిన వెంటనే శిశువు బొడ్డు తాడు కత్తిరించొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన విషయాన్ని చదివాను. దీనికి కారణం ఏమిటి? ‘బొడ్డుతాడు సంరక్షణ’ వలన ప్రయోజనం ఏమిటి? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? దీనికి ఖర్చు ఎంత అవుతుంది? – ఆర్‌.దేవిక, హైదరాబాద్‌
కాన్పు తర్వాత తల్లి నుంచి బిడ్డను వేరు చేయడానికి బొడ్డుతాడును కత్తిరిస్తారు. బొడ్డుతాడు తల్లి నుంచి అన్ని పోషక పదార్థాలను మాయ నుంచి బిడ్డకు చేరవేస్తుంది. బిడ్డను తల్లి నుంచి వేరు చేశాక బొడ్డు తాడును, మాయను పారవేయడం జరుగుతుంది. బొడ్డుతాడులో రక్తంతో పాటు అనేక రక్తకణాలు, మూల కణాలు (స్టెమ్‌సెల్స్‌) ఉంటాయి. కాన్పు సమయంలో బిడ్డను కడుపు నుంచి బయటకు తీసిన తర్వాత బొడ్డు తాడును వెంటనే కత్తిరించకుండా రెండు మూడు నిమిషాలు ఆగి కత్తిరించడం వల్ల లేదా దానిలోని రక్తనాళాల పల్సేషన్స్‌ ఆగిపోయిన తర్వాత కత్తిరించడం వల్ల బిడ్డకు కొద్దిగా ఎక్కువ రక్తం, పోషక పదార్థాలు చేరుతాయి. దీనినే డిలేడ్‌ కార్డ్‌ క్లాంపింగ్‌ అంటారు.

ఈ పద్ధతి ద్వారా బరువు తక్కువగా పుట్టే పిల్లలకు, నెలలు నిండకుండా పుట్టే పిల్లలకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా అందుబాటులో ఉన్న ‘కార్డ్‌ బ్లడ్‌ బ్యాంకింగ్‌’ పద్ధతిలో కాన్పు తర్వాత పారవేసే బొడ్డుతాడులోని రక్తాన్ని బిడ్డ బయటకు రాగానే తీసుకుని, దానిని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, ఫ్రీజ్‌ చేసి భద్రపరచడం జరుగుతుంది. దీనిని ప్రస్తుతానికి 20–25 సంవత్సరాల వరకు భద్రపరచే సౌకర్యాలు ఉన్నాయి. దీనిని అనేక సంస్థలు మార్కెటింగ్‌ చేస్తున్నాయి. దీనికి సంస్థను బట్టి అనేక ప్యాకేజీలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు భద్రపరుస్తారు అనే దాని బట్టి రూ.40 వేల నుంచి రూ.70 వరకు ఖర్చు ఉంటుంది. బొడ్డుతాడులోని రక్తంలో ఉండే స్టెమ్‌సెల్స్‌కు అనేక రకాల కణాలుగా విభజన చెందే గుణం ఉంటుంది.

వీటిని ఉపయోగించి పుట్టిన బిడ్డకు తర్వాతి కాలంలో లేదా బిడ్డ రక్తసంబంధీకులకు ఏవైనా రక్తసంబంధిత వ్యాధులు అంటే– లుకీమియా, లింఫోమా, హీమోలైటిక్‌ అనీమియా, సికిల్‌సెల్‌ అనీమియా వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. బొడ్డుతాడులోని స్టెమ్‌సెల్స్‌ను ఇంకా ఏవిధంగా ఉపయోగించవచ్చనే దానిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలు ఫలించిన రోజున భద్రపరచిన బొడ్డుతాడు రక్తాన్ని అనేక రకాల జబ్బులకు ఉపయోగించవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top