కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

Family Tours And Relations Special Story - Sakshi

డేటింగ్‌ ప్రేమికుల మధ్యే కాదు...రక్తసంబంధీకులు, స్నేహితులు.సన్నిహితులతో కూడా చేయొచ్చు!మన కోసం జీవితాన్ని పిండేసినమమ్మీడాడీతో చేయొచ్చు..మమ్మీడాడీ లేక అనాథశ్రమంలో ఉన్నబుజ్జి స్నేహితులతో చేయొచ్చు!నిజానికి ఇంతకంటే ప్రియమైన డేటింగ్‌ఇంకెక్కడైనా దొరుకుతుందా... చెప్పండి?

హైదరాబాద్‌.. ఇనార్బిట్‌ మాల్‌...
ఒక ఇరవైమూడేళ్ల అమ్మాయి.. పక్కనే బహుశా వాళ్ల అమ్మనుకుంటా.. చేయి పట్టుకొని రెస్టారెంట్లోకి తీసుకెళ్లింది అమ్మాయి.  రోడ్‌ సైడ్‌ వ్యూ ఉన్న కార్నర్‌ టేబుల్‌ను వెదుక్కొని మరీ వాళ్లమ్మను కూర్చోబెట్టింది. ఎదురుగా తను. మెనూ కార్డ్‌ తీసుకొని.. ఐటమ్స్‌ అన్నీ చదివి వినిపించింది.  నచ్చింది ఆర్డర్‌ చేయమని చెప్పింది వాళ్లమ్మకు. బెరుకు బెరుకుగానే ఆర్డర్‌ చేసింది ఆవిడ. బేరర్‌ వెళ్లిపోయాక.. ఆ అమ్మాయి లేచి తల్లి దగ్గరకు వెళ్లి  ప్రేమగా హత్తుకుంది.. ఓ సెల్ఫీ  తీసుకుంది. వెంటనే సోషల్‌ మీడియాలో పోస్టూ చేసినట్టుంది. లంచ్‌ అయ్యాక.. అక్కడే షాపింగ్‌ చేశారు.. చిన్నపిల్లల్లా అల్లరి చేశారు. ఐస్‌క్రీమ్‌ తిన్నారు. కామెంట్స్‌ చేసుకున్నారు.. జోక్స్‌ వేసుకున్నారు. వాళ్లమ్మకు తన సెల్‌ఫోన్‌లో  (ఫేస్‌బుక్కో.. ఇన్‌స్టాగ్రామో అయ్యుంటుంది) ఏదో చూపించింది.. ఆ అమ్మేదో అంది.. ఆ పిల్ల టైప్‌ చేసింది. మొత్తానికి ఆ ఇద్దరి వయసుల్లో తేడాను బట్టి తల్లీ, బిడ్డగా అంచనా వేయడమే తప్ప వాళ్ల చనువు, స్నేహం చూస్తే ఫ్రెండ్సే అనుకుంటారు. అంతా తిరిగి ఓ బెంచ్‌ మీద కూర్చున్నారిద్దరూ. ఉండబట్టలేక ఆ పిల్లను కదిలిస్తే..
‘‘మా అమ్మండీ.. సింగిల్‌ మదర్‌. నాకు మూడేళ్లప్పుడు మా నాన్న యాక్సిడెంట్‌లో పోయాడు. మా పేరెంట్స్‌ది లవ్‌ మ్యారేజ్‌. నాన్న పోయాక కూడా అమ్మమ్మవాళ్లు కాని, నానమ్మ వాళ్లు కాని అమ్మను రానివ్వలేదు. ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా వర్క్‌చేస్తూ  నన్ను పెంచింది. ఆటోమోబైల్‌ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ని. జాబ్‌లో చేరి టూ ఇయర్స్‌ అవుతోంది. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కోసం జర్మన్‌ యూనివర్సిటీలో అప్లయ్‌ చేసుకున్నా. సీట్‌ వచ్చింది. వెళ్లే ప్రిపరేషన్‌లో ఉన్నా. ఈ బిజీలో ఒక్కరోజు కూడా అమ్మతో లీజర్‌గా స్పెండ్‌ చేయలేదు. ఇప్పుడు నేను వెళ్లిపోతే తను మళ్లీ  ఒంటరే. అందుకే ఈ వీకెండ్‌ అమ్మతో గడపాలని.. ఐ మీన్‌ మా అమ్మతో డేట్‌ చేయాలని ప్లాన్‌ చేసుకున్నా. నిన్న (శనివారం) ఆర్టికిల్‌ ఫిప్టీన్‌ సినిమా, చార్మినార్, ఈరోజు (ఆదివారం) ఇలా వర్కవుట్‌ చేస్తున్నా’’ అంటూ వాళ్లమ్మను మళ్లీ దగ్గరకు తీసుకుంది ప్రేమగా. ఆ తల్లి కళ్లల్లో సన్నని కన్నీటి తెర.‘‘ఒక్క ఫొటో తీసుకోవచ్చా మీ ఇద్దరిదీ?’’ అని సెల్‌ఫోన్‌లోని కెమెరాను సెట్‌ చేసుకోబోతుంటే ఆ అమ్మ ‘‘అయ్యో.. వద్దండీ’’ అంటూ ఇబ్బంది వ్యక్తం చేసింది.

గమనిక: ఈ మ్యాటర్‌ ఆ ఇద్దరి అనుమతితోనే ఇక్కడ రాశాం.

సుమిత్‌.. ముప్పైఏళ్లు. బెంగళూరులో ఉద్యోగం. సొంతూరు విశాఖపట్టణం. అతని చిన్నప్పటి స్నేహితురాలు శాలిని అమెరికా నుంచి వస్తే ఆమెను కలవడానికి ఊరెళ్లాడు. ఆమె అతణ్ణి  ఓ అనాథ శరణాలయానికి తీసుకెళ్లింది.. డబ్బు డొనేట్‌ చేయాలని. వెళ్లాక  శాలినికి ఓ ఆలోచన వచ్చింది. ‘‘సుమిత్‌ ఈ పిల్లలను డేట్‌కు తీసుకెళితే?’’ అని. మెచ్చుకోలుగా  చూశాడు సుమిత్‌.   ఆలస్యం చేయకుండా ఆ పిల్లలను అడిగారు ‘‘బయటకు వెళదామా?’’ అని. ‘‘బీచ్‌కి’’ చెప్పారు ముక్త కంఠంతో వాళ్లు. వార్డెన్‌ పర్మిషన్‌తో బీచ్‌కు తీసుకెళ్లారు.  చీకటి పడేవరకు ఆడుకున్నారు. అక్కా, అన్నా అంటూ ఈ ఇద్దరితో సరదాగా గడిపారు. కావల్సింది కొనిపించుకున్నారు. అలసిసొలిసి సంతోషంగా ఆర్ఫనేజ్‌కు చేరారు.

ఈ సంఘటనలను బట్టి ఇప్పుడున్న డేటింగ్‌ ట్రెండ్‌ అర్థం అవుతోంది కదా!  
పెళ్లి బంధంలోకి వెళ్లాలనుకునే ప్రేమికులు.. తమ మధ్య ఉన్న కంపాటబులిటీని అర్థం చేసుకోవడానికి, పెంచుకోవడానికి డేటింగ్‌ చేస్తారు.. స్నేహం పెరగడానికి డేట్‌కి వెళ్తారు. తెలిసిన విషయమే. కొత్త ఒరవడే.. డేట్‌ విత్‌ పేరెంట్స్, సిబ్లింగ్స్, కజిన్స్‌.. ఫ్రెండ్స్‌.   ఒకే ఇంట్లో ఉంటున్నా వాట్సప్‌లో విష్‌ చేసుకునే కాలం ఇది. కారణం.. గడియారంతో పోటీ పడే వేగం.. ఉదయం లేవగానే చాయ్‌తో చర్చించే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌లో ఉన్న నలుగురికీ  కలిసి భోంచేసే భాగ్యం కరువవడం,  అమ్మ, నాన్న, అక్క, అన్న, చెల్లి, తమ్ముడితో ముఖాముఖి మాట్లాడుకోవడానికి వీలుపడకపోవడం కావచ్చు. ఇక కజిన్స్‌.. ఫ్రెండ్స్‌.. సంగతి చెప్పక్కర్లేదు. ఆ అందరిదాకా ఎందుకు? వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, క్లయింట్స్‌తో అర్జెంట్‌ మీటింగ్స్‌ లాంటి ఎక్స్‌ట్రా ఫిటింగ్స్‌తో మనతో మనం గడిపే టైమూ దొరకట్లేదు అని వాపోతున్న వాళ్లూ చాలామందే! ఈ చాలామంది సోషల్‌ మీడియా ఫ్రీకే! అయినా వాపోతున్నారంటే.. రిలేటివ్స్, రిలేషన్స్‌కు  మధ్య ఉన్న ఆర్టిఫీషియల్‌ కనెక్టివిటీని తొలగించుకోవాలనుకుంటున్నట్టే కదా! కనిపిస్తూ.. వినిపించే పకరింపు.. భరోసానిచ్చే కరచాలనం.. ఆప్యాయతను చూపించే ఆలింగనం.. బంధాన్ని, అనుబంధాన్ని బలపరిచే ఆత్మీయ స్పర్శ.. ఒకరికొకరం ఉన్నామనే భద్రతను కోరుకుంటున్నట్టే కదా! ఇవన్నీ  పొందడానికి కనీసం వారానికి ఒక్కరోజు దొరికినా చాలు అని ఎదురుచూస్తున్నారు. అందుకే ఆ కొత్త ట్రెండ్‌   వచ్చింది. డేట్‌ విత్‌ పేరెంట్స్, తోబుట్టువులు, కజిన్స్, ఫ్రెండ్స్‌తోనే కాదు.. మనతో ఉండే రోజు !

అనూష తివారి
మియామీ.. గోవా..  నేను
నాకు ఏ మాత్రం టైమ్‌ దొరికినా నాకిష్టమైన చోటుకి వెళ్లి.. నాతో నేను డేట్‌ చేయాలనుకుంటాను. వెళ్లాను.. వెళ్తాను కూడా. అమెరికాలో ఉన్నప్పుడు మియామీ.. ఇండియాలో గోవా. మనతో మనం గడిపితే.. మన మైనస్‌ పాయింట్స్‌ తెలుస్తాయి.. మన స్ట్రెంత్‌ అర్థమవుతుంది. కొత్త ఎనర్జీ వస్తుంది.– అనూష తివారి,ప్రాజెక్ట్‌ మేనేజర్‌ (డెలాయిట్‌)

సండే.. ఫ్యామిలీ డే
మా పేరెంట్స్‌ ఇద్దరూ వర్కింగే. నేను, నాకో చెల్లి. కాలేజ్‌తో మేమూ బిజీ. సో... వారానికి ఒక రోజు  డేట్‌ విత్‌ ఫ్యామిలీ అన్నమాట. ఎవ్రీ సండే.. ఉదయం టిఫిన్‌ నుంచి రాత్రి డిన్నర్‌ వరకు బయటే స్పెండ్‌ చేస్తాం. చర్చ్, పిక్చర్‌.. కంపల్సరీ. మిగిలిన విజిటింగ్‌ ప్లేసెస్‌ మారుతుంటాయి.. ఒక్కో సండే ఒక్కోచోటికి.– రితిక, బీటెక్‌స్టూడెంట్, హైదరాబాద్‌

డైన్‌ విత్‌ పేరెంట్స్‌
మా నాన్న (పర్వతాలు) అడ్వకేట్‌. అమ్మ (హైమలత).. హోమ్‌ మేకర్‌. నేనొక్కడినే కొడుకును. రీసెంట్‌గా బీటెక్‌ అయిపోయింది. వర్క్‌తో నాన్న బిజీగా ఉంటాడు. అమ్మ నాకోసం ఆరాటపడ్తుంది. కాని ఫ్రెండ్స్, పార్టీలతో నేను అమ్మకు దొరకను. చాలాసార్లు అనుకుంటా అమ్మతో టైమ్‌ స్పెండ్‌ చేయాలని. కనీసం నా బర్త్‌డే రోజైనా ఇంట్లో అమ్మతో సెలబ్రేట్‌ చేసుకోవాలని. మొన్న ఎయిటీంత్‌(జూలై 18)నే నా బర్త్‌డే అయింది. ఆ రోజు ఇంట్లోనే ఉండాలని  అనుకున్నా. కాని ఫ్రెండ్స్‌ పార్టీ అనేసరికి వెళ్లాల్సి వచ్చింది. అమ్మ చాలా బాధ పడింది. ఇప్పటి నుంచి అలా ఉండకూడదనుకుంటున్నా. కనీసం వారంలో ఒక్కరోజైనా మా పేరెంట్స్‌తో గడపాలి. బయటకు వెళ్లడం కుదరకపోతే కనీసం వాళ్లతో కలిసి భోజనమన్నా చేయాలి. ఐ మీన్‌ డైన్‌ విత్‌ పేరెంట్స్‌ అన్నమాట. ఈ సారి పక్కా!– రాహుల్‌ యాదవ్, హైదరాబాద్‌

రాహుల్‌ యాదవ్‌, రితిక
60వ పుట్టినరోజే ఫస్ట్‌ డేట్‌..
ఎనిమిదేళ్లు అమెరికా (కాలిఫోర్నియా)లో ఉన్నాను. యాపిల్‌లో వర్క్‌ చేసేదాన్ని. మొన్ననే ఇండియా షిఫ్ట్‌ అయ్యాను. మా పేరెంట్స్‌తో గడపాలనే ఉద్దేశంతోనే. ఇంతకన్నా పెద్ద డేట్‌ ఉండదేమో కదా (నవ్వుతూ). నాన్న (ఏ.ఎస్‌. రామశాస్త్రి).. ఐడిబీఆర్‌టీ డైరెక్టర్‌. అమ్మ (ఏ. గాయత్రీదేవి).. ఆయుర్వేదిక్‌ డాక్టర్‌. వాళ్ల బిజీతో నా దగ్గరకు రాలేకపోయేవారు. లీవ్స్‌ లేక  ఇండియాకు రావడం నాకూ  కష్టమయ్యేది. పేరెంట్స్‌ని  చాలా మిస్‌ అయ్యా. అందుకే ఆ ఉద్యోగాన్ని వదిలి వచ్చేశా.  నేనొచ్చాక వాళ్లతో నా ఫస్ట్‌ డేట్‌ మా నాన్నగారి 60వ పుట్టినరోజు. ఆయన చిన్నప్పటి ఫ్రెండ్స్‌ అందరి దగ్గరా నాన్న గురించి కామెంట్స్, జ్ఞాపకాలు తీసుకొని పుస్తకంగా పబ్లిష్‌ చేయించా. ఆ పుస్తకాన్ని నాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా ఆయన బర్త్‌డే ఫంక్షన్‌లో లాంచ్‌ చేశాం. ఆ రోజంతా అమ్మా, నాన్న.. వాళ్ల స్నేహితులతో గడిపా. ఇప్పటికీ ఏ రోజు టైమ్‌ దొరికినా వాళ్లకు ఇష్టమైనవి వండిపెడ్తా. ముగ్గురం కలిసే భోంచేస్తాం.. ఇష్టమైన సినిమా చూస్తాం.. కబుర్లు చెప్పుకుంటాం.– ఏ. అపరాజిత, ఇండిపెండెంట్‌ కన్సల్టెంట్‌.

సందర్భం క్రియేట్‌ చేసుకుంటున్నాం..
పెళ్లయిన ఆడపిల్లలకు తోబుట్టువులను కలుసుకోవాలన్నా ఒక అకేషన్‌ ఉండాలి.. అత్తింట్లో పర్మిషన్‌ ఉండాలి. అందుకే సిబ్లింగ్స్‌ అండ్‌ కజిన్స్‌ను  కలుసుకునే సందర్భాన్ని క్రియేట్‌ చేసుకొని ఆ డేను డేట్‌ విత్‌ సిబ్లింగ్స్‌ అండ్‌ కజిన్స్‌గా ఎంజాయ్‌ చేస్తున్నాం.– ఏలేటి రమ్య, దుబాయ్‌

అమ్మానాన్నలతో అపరాజిత
మనం ఉండే రోజు !
దీని గురించి విన్న పెద్ద తరం ‘‘ఏంటో ఉన్నదాన్ని నాశనం చేసుకొని.. మళ్లీ దాన్ని నిలబెట్టుకునే వెర్రి ప్రయత్నాల పిదప కాలం.. పిదప బుద్ధులు కాకపోతే?’’ అంటూ  పెదవి విరవొచ్చు. ‘‘ముందు ఓల్డేజ్‌ హోముల్లో పెట్టిన మమ్మల్ని ఇంటికి తెచ్చుకోండి’’ అంటూ నొసలు చిట్లించనూ వచ్చు! దొరికన ఒక్కరోజైనా అయిన వాళ్లతో డేట్‌కెళ్లే హడావుడిలో ఉంది యూత్‌! ఆ లిస్ట్‌లో ఓల్డేజ్‌ హోమ్‌లోని గ్రాండ్‌ పేరెంట్స్‌ కూడా ఉండొచ్చు. కాబట్టి పాశ్చాత్య పైత్యం.. ఫ్యాషన్‌ ప్రకోపం అంటూ వాళ్ల మనసుల్ని చిన్నబుచ్చకుండా.. కనీసం ఈ కొత్త తీరుగానైనా పాత పద్ధతిని తిరిగి నిలబెట్టుకునే యత్నం చేస్తున్నందుకు పెద్ద మనసుతో  ఆనందపడదాం!– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top