ఇంటింటా పౌష్టికాహార ‘పుట్ట’! | Sakshi
Sakshi News home page

ఇంటింటా పౌష్టికాహార ‘పుట్ట’!

Published Tue, Jan 7 2020 3:17 AM

The door Nutritional mushrooms - Sakshi

మన దేశంలో ప్రజలు తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారు. ఈ లోపాన్ని భర్తీ చేయగలిగినవి పుట్టగొడుగులు. వీటిలోని పోషక విలువలు, ఔషధగుణాల గురించి తెలిసినప్పటికీ.. ప్రజలకు అందుబాటులోకి తేవడం అంతగా సాధ్యపడటం లేదు. పుట్టగొడుగులు పట్టణాలు, నగరాల్లో కూడా అరుదుగానే అందుబాటులో ఉంటున్నాయి. ధర ఎక్కువగా ఉండటం వల్ల ఉన్నత వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి పోషకాల గనులైన పుట్టగొడుగులు ఇప్పటికీ అందని ద్రాక్షల్లాగే మిగిలిపోయాయి. వీటి పెంపకానికి నైపుణ్యం అవసరం. విత్తన లభ్యత కూడా పెద్ద సవాలుగా ఉంది. అయితే, పుట్టగొడుగులను ఎక్కడో పెంచి తీసుకువచ్చి దుకాణాల్లో ప్రజలకు అమ్మేదానికి బదులు.. ‘పుట్టగొడుగులను అందించే సంచి’ని అమ్మటం ఉత్తమమైన పని అని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనాసంస్థ (ఐ.ఐ.హెచ్‌.ఆర్‌.) శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందుకోసం వారు  ‘రెడీ టు ఫ్రూట్‌(ఆర్‌.టి.ఎఫ్‌.)’ బ్యాగ్‌ సాంకేతికతకు రూపకల్పన చేశారు.

ఒక్కో బ్యాగ్‌తో 300 గ్రా. పుట్టగొడుగులు
కిలో బరువుండే బ్యాగ్‌ను తెచ్చుకొని ఇంట్లో ఎండ తగలని, గాలి పారాడే చోట వేలాడదీసి ఉంచితే.. ఐదు లేక 6 రోజుల్లో 200–300 గ్రాముల పుట్టగొడుగుల దిగుబడి వస్తుంది. ఈ బ్యాగ్‌ను బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో ముందుగా బుక్‌ చేసుకున్న వారికి లాభాపేక్ష లేకుండా రూ. 20లకే విక్రయిస్తోంది. అయితే, దీన్ని తయారు చేసే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు అంతకన్నా ఎక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుంది.
‘రెడీ టు ఫ్రూట్‌(ఆర్‌.టి.ఎఫ్‌.)’ బ్యాగ్‌ను ఉత్పత్తి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వారికి బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌ ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలకు సాంకేతికతను అందించడంతోపాటు, ఏడాదిలో 3 దఫాలు శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది.   

పుట్టగొడుగుల  పెంపకానికి వరిగడ్డితో బ్యాగ్‌ల తయారీపై శిక్షణ పొందుతున్న మహిళలు

బ్యాగ్‌ ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు చేసుకోదలచిన వారు ఐఐహెచ్‌ఆర్‌ రూపొందించిన మల్టీఫ్యూయల్‌ బాయిలర్, స్టెరిలైజేషన్‌ యూనిట్, మోటారుతో నడిచే చాఫ్‌ కట్టర్‌లను రూ. 5–6 లక్షల ఖర్చుతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న 3–4 గదుల షెడ్‌/భవనంలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. స్పాన్‌ను ఐఐహెచ్‌ఆర్‌ లేదా మరెక్కడి నుంచైనా తెచ్చుకొని బ్యాగ్‌లను ఉత్పత్తి చేసుకొని వినియోగదారులకు అమ్ముకోవచ్చు. ఈ యూనిట్‌ ద్వారా రోజుకు కిలో బరువైన బ్యాగ్‌లు 100 వరకు (2 కిలోల బ్యాగులైతే 50 వరకు) ఉత్పత్తి చేయొచ్చు.

బ్యాగ్‌లలో పుట్టగొడుగులు పెంచుతున్న గృహిణులు

స్పాన్‌ ఉత్పత్తి కీలకం
పుట్టగొడుగుల పెంపకంలో స్పాన్‌ (విత్తనం) లభ్యత కీలకాంశం. అయితే, పుట్టగొడుగుల స్పాన్‌ను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే రూ. 20 లక్షల పెట్టుబడితోపాటు 1500 చదరపు అడుగుల పక్కా భవనంలో వసతి అవసరమవుతుంది. స్పాన్‌ ఉత్పత్తి సాంకేతికతను ఐఐహెచ్‌ఆర్‌ అందిస్తోంది. శిక్షణ కూడా ఇస్తోంది. శిక్షణ కాలం 5 రోజులు. ఫీజు ఒక్కొక్కరికి రూ. 7 వేల వరకు ఉంటుంది.  

ప్రభుత్వ శాఖలు కోరితే రాష్ట్రాల్లోనూ శిక్షణ
‘రెడీ టు ఫ్రూట్‌(ఆర్‌.టి.ఎఫ్‌.)’ బ్యాగ్‌లను, పుట్టగొడుగుల స్పాన్‌ ఉత్పత్తి సాంకేతికతలపై ఐఐహెచ్‌ఆర్‌ శాస్త్రవేత్తలు వివిధ రాష్ట్రాలకు వచ్చి కూడా శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ/ఉద్యాన శాఖల కోరిక మేరకు కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో ఇటువంటి శిక్షణా తరగతులు జరిగాయి. కర్ణాటక ప్రభుత్వం 5 చోట్ల పుట్టగొడుగుల స్పాన్‌ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆయా పరిసర ప్రాంతాల్లో ప్రజలకు బ్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. చలికాలంలో ఆయిస్టర్‌ పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణం మిల్కీ మష్రూమ్స్‌ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇతర సమాచారం కోసం ప్రభుత్వ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు సంప్రదించాల్సిన చిరునామా:
అధిపతి, విస్తరణ–సాంఘిక శాస్త్రాల విభాగం, ఐసిఎఆర్‌–ఐఐహెచ్‌ఆర్, హెసరఘట్ట, బెంగళూరు – 560089.
Email: Venkattakumar.R@icar.gov.in
http://www.iihr.res.in/


5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు
పుట్టగొడుగులను అందించే ఈ రెడీ మేడ్‌ బ్యాగ్‌ ప్రత్యేకత ఏమిటంటే.. దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు సులభంగా ఐదారు రోజుల్లో తాజా పుట్టగొడుగులను కళ్లముందే పెంచుకోవచ్చు. పాలిథిన్‌ క్యారీ బ్యాగ్‌లో శుద్ధి చేసిన వరి గడ్డి ముక్కలతోపాటు పుట్టగొడుగుల విత్తనం చల్లి, మూతి కట్టేస్తారు. ఈ బ్యాగును వినియోగదారుడు కొని తెచ్చి ఇంట్లో ఒక మూలన పెట్టుకొని, దానికి అక్కడక్కడా చిన్న బెజ్జాలు చేస్తే చాలు. ఆ బెజ్జాల్లో నుంచి పుట్టగొడుగులు మొలుస్తాయి. వాటిపై నీటి తుంపరలను రోజుకోసారి పిచికారీ చేస్తుంటే చాలు.

బ్యాగ్‌పై పుట్టగొడుగులు పెరగడానికి వీలుగా చిన్న బెజ్జం చేస్తున్న దృశ్యం

కేవలం 5,6 రోజుల్లో తాజా పుట్టగొడుగులు వంటకు సిద్ధమవుతాయి. ఇలా ఎవరికి వారు ఇంట్లోనే పెద్ద హైరానా ఏమీ లేకుండా సునాయాసంగా పుట్టగొడుగులు పెంచుకోవచ్చు. మరీ ముదిరిపోక ముందే కోసుకుంటే చాలు. ఈ పని చేయడానికి నైపుణ్యం ఏమీ అవసరం లేదు. చదువు లేని గృహిణులు కూడా సులభంగా ఈ పద్ధతిలో పుట్టగొడుగులను ఇంట్లోనే పెంచుకోగలుగుతారు. తాజా పుట్టగొడుగులను కూర వండుకోవచ్చు లేదా ఎండబెట్టి పొడి (ఏడాది వరకు నిల్వ చేసుకోవచ్చు) చేసి రోజువారీగా ఆహార పదార్థాల్లో కలిపి వాడుకుంటూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చని ఐ.ఐ.హెచ్‌.ఆర్‌. శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బ్యాగ్‌పై మొలిచిన పుట్టగొడుగులపై నీటి పిచికారీ

పోషక గనులు.. ఔషధ గుణాలు!
పుట్టగొడుగులు కూడా మొక్కల్లాంటివే. మొక్కల్లో మాదిరిగా క్లోరోఫిల్‌ ఉండదు కాబట్టి తెల్లగా ఉంటాయి. పోషకాల గని వంటివి పుట్టగొడుగులు. ప్రొటీన్లు, బి విటమిన్లు ఉన్నాయి. విటమిన్‌ డిని కలిగి ఉండే ఏకైక శాకాహారం పుట్టగొడుగులు మాత్రమే. వీటిల్లోని ఐరన్‌ ఆహారంగా తీసుకున్న వారికి ఇట్టే వంటపడుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్‌ పుష్కలంగా ఉంది. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కాబట్టి టైప్‌ –2 మధుమేహ రోగులు సైతం నిశ్చింతగా తినవచ్చు. సోడియం అతి తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగి ఉండి కొలెస్ట్రాల్‌ అసలు లేని కారణంగా పుట్టగొడుగులు హృద్రోగులకు అద్భుత ఆహారం.

రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపకరిస్తాయి. పుట్టగొడుగులు శాకాహారులకు అద్భుతపోషకాల వనరు మాత్రమే కాదు, మాంసాహారం వాడకాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి రుచికరమైన సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని ఐ.ఐ.హెచ్‌.ఆర్‌.లోని మష్రూమ్‌ లాబ్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డా. మీరా పాండే తెలిపారు. ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ పుట్టగొడుగులు ఇప్పటికీ భారతీయ ప్రజల రోజువారీ ఆహారంలో భాగం కాలేకపోతున్నాయి. అందుకోసమే ఇంటింటా పుట్టగొడుగులు పెంచుకునే సులభమార్గాన్ని తాము రూపొందించినట్లు డా. మీరా పాండే ‘సాక్షి’తో అన్నారు.

డా. మీరా పాండే

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Advertisement
Advertisement