ఇదిగో నవ లోకం

Designing Cities Specifically For Women - Sakshi

నారీ నగరి

మహిళల కోసం కట్టిన మహా నగరాలు ఎలా ఉంటాయి? మహిళల కోసం నగరాలా! భువిపై అవెక్కడ? ఎవరు కట్టారని? సరే. ఇదే ప్రశ్న ఇంకొకలా. మహిళలు కనుక తమ కోసం మహానగరాలు కట్టుకుంటే అవి ఎలా ఉంటాయి? కట్టుకోవడం అంటే డిజైన్‌ చెయ్యడం. ఏ మహా నగర నిర్మాణమైనా మనుషులందరి కోసమే అయినప్పుడు మహిళలెందుకు ప్రత్యేకంగా నగరాలకు డిజైన్‌ చెయ్యడం? ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడున్న నగరాలన్నీ పురుషుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పురుషులు ప్లాన్‌ చేసి కట్టినవే. స్త్రీల అవసరాలను, వసతులను, సదుపాయాలను మనసులో పెట్టుకుని ప్లాన్‌ చెయ్యాలంటే స్త్రీ మనసు ఉండాలి. పురుషుల వల్ల అది అయ్యే పని కాదు కనుక.. స్త్రీలే స్వయంగా డిజైన్‌ చేసి కట్టించాలి.

ఒకవేళ వాళ్లకు అలా కట్టించే అవకాశం వస్తే ఏయే సౌకర్యాలకు, కనీసావసరాలకు స్త్రీలు ప్రాధాన్యం ఇస్తారు? ఇప్పుడీ సందేహం కూడా ఏ పురుష పుంగవునికో రాలేదు. ఆదా కోలా అనే మహిళకు వచ్చింది. స్పెయిన్‌ దేశపు ముఖ్య నగరం బార్సిలోనాకు నాలుగేళ్లుగా ఆమె మేయర్‌. నగరంలో మంచి మంచి ‘ఉమెన్‌ ఫ్రెండ్లీ’ మార్పులు తెచ్చారు. వాటితో సరిపెట్టుకోక.. మహిళకు స్వర్గధామంగా ఉండే నగరం ఎలా ఉండాలో నగర మహిళల్ని అడిగి తెలుసుకుని ఒక నివేదికను తయారు చేసే పనిని ‘కలెక్టివ్‌ పంత్‌ 6’ అనే నిర్మాణ సంస్థకు ఆమె పురమాయించారు. ఆ సంస్థ ప్రతినిధులు బార్సిలోనాలోని మహిళల అభిప్రాయాలను సేకరించి మేయర్‌ కోలాకు సర్వే ఫలితాల నివేదికను సమర్పించారు. నివేదికలో ప్రధానంగా ఆరు అంశాలు అండర్‌లైన్‌తో ఉన్నాయి.

ఎక్కడిక్కడ వాష్‌రూమ్స్‌ అందుబాటులో ఉండటం, మహిళలు గేమ్స్‌ ఆడేందుకు రోడ్‌ సైడ్‌ మైదానాలు, అనుౖÐð న రోజువారీ ప్రయాణ సదుపాయాలు, రోడ్లపై పూర్తిగా కార్లను నిషేధించడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు నీడపట్టున కాసేపు కూర్చునే వసతి, లేట్‌ నైట్‌ పార్టీలను నిషేధం.. నగరంలో ఈ ఆరూ ఉండాలని మహిళలు కోరుకున్నట్లు నివేదికలో ఉంది. మామూలు ఇంటి నిర్మాణానికే ఇంట్లో ఆడవాళ్ల వసతి, సదుపాయాల గురించి పట్టించుకోని మనకు ఒక మహానగరాన్నే ఆడవాళ్లకు వెసులుబాటుగా నిర్మించడం అనే ఆలోచన ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే బార్సిలోనాలో ఉన్నదెవరు? మహిళా మేయర్‌. సూపర్‌ మేడమ్‌ మీరు.   
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top