కేర్‌ సెంటర్‌

Care Sanga Reddy is taking a call center at a government hospital - Sakshi

గర్భిణి అయ్యాక కేర్‌ తీసుకోవాలి. ప్రసవం అయ్యాక కేర్‌ తీసుకోవాలి.కనీసం ఐదేళ్ల వరకైనా..కంట్లో ఒత్తులు వేసుకుని బిడ్డను పొత్తిళ్లలో పెట్టుకుని కేర్‌ తీసుకోవాలి.బిడ్డ కేర్‌ ఒక్కటే కాదు.. తల్లి కేర్‌ కూడా... ఇంత కేర్‌ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని కాల్‌ సెంటర్‌ తీసుకుంటోంది.అందుకే అది..కాల్‌ సెంటర్‌ మాత్రమే కాదు.  కేర్‌ సెంటర్‌ కూడా!

‘‘హలో.. లక్ష్మమ్మా.. ఆరోగ్యం ఎలా ఉంది.. ఈ నెల డాక్టర్‌ దగ్గరకు పోయినవా.. స్కానింగ్‌ చేసిండ్రా.. మందులు వేసుకుంటున్నవా.. ఏం ప్రాబ్లం లేదు కదా.. పండంటి బిడ్డను కనాలే’’ – ఫోన్‌లో ఓ ఆత్మీయ పలకరింపు.‘‘నా ఆరోగ్యం అదీ మంచిగనే ఉంది. డాక్టర్‌ దగ్గరకు పోయిన.. స్కానింగ్‌ చేసి కడుపుల బిడ్డ మంచిగనే ఉందని చెప్పిండ్రు.. నా బరువు ఇంకా పెరగాలే అని చెప్పిండ్రు.. అది సరే.. ఇంతకీ మీరెవరమ్మా.. నేను కడుపుతో ఉన్న అని మీకెట్ల తెలుసు. నా నంబరు మీకెవరు ఇచ్చిండ్రు’’ అవతలి నుంచి సమాధానం.‘‘అమ్మా.. మేము సంగారెడ్డి సర్కారు దవాఖానా కాల్‌ సెంటర్‌ నుంచి మాట్లాడుతున్నం. మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్నట్లు మీ ఏరియా ఎఎన్‌ఎం ద్వారా మాకు తెలిసింది. మీ ప్రసవం జరిగి, పుట్టే పిల్లలకు ఐదేళ్ల టీకాలు వేసే దాకా మేం అప్పుడప్పుడు ఫోన్‌ చేస్తం. మీ ఆరోగ్యం ఎట్ల ఉందో ఎప్పటికప్పుడు చెప్తూ ఉండండి’’.సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. గర్భిణులు, బాలింతల కోసం ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ ద్వారా ప్రతీ రోజూ వెళ్లే సుమారు వంద ఫో¯Œ  కాల్స్‌ సంభాషణ.. ఇంచు మించు ఈ రీతిలోనే సాగుతూ ఉంటుంది.

మాతృత్వం ఓ వరం 
గర్భం దాల్చింది మొదలు.. ప్రసవం.. శిశు సంరక్షణ వరకు తల్లీ బిడ్డల ఆరోగ్య రక్షణ ఓ సవాలు. ముఖ్యంగా గ్రామీణ  ప్రాంతాలలో ఈ అంశాలపై చాలా మందికి అవగాహన ఉండదు. ఇలాంటి వారి కోసం గతంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన మాణిక్కరాజ్‌ కణ్ణన్‌ ఓ వినూత్న ఆలోచన చేశారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించే జిల్లా కలెక్టర్‌.. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య పరమైన సూచనలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ ‘కాల్‌ సెంటర్‌’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరి 10న జిల్లా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమైన ఈ కాల్‌ సెంటర్‌ ఏడాదిలో దాదాపు 32వేల మంది గర్భిణులు, బాలింతలకు వైద్య పరమైన సూచనలు, సలహాలు అందించింది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, సబ్‌ సెంటర్‌ ఎఎన్‌ఎంలు అక్కడి గర్భిణుల సమాచారం సేకరించి, వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. ఈ సమాచారం నేరుగా ‘కాల్‌ సెంటర్‌’ డాష్‌ బోర్డు మీదకు చేరుతుంది. ఇలా ప్రతీ రోజూ సుమారు వంద మంది గర్భిణులు, బాలింతలకు వైద్య పరమైన సూచనలు, సమాచారాన్ని కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు చేరవేస్తూ ఉంటారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ నేతృత్వ నిర్వహణలో ఉన్న ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 6812 మంది చిన్నారులకు వేక్సినేషన్‌ లభించింది. 

ప్రయోగాత్మకం.. ఫలితం అద్భుతం
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పనిచేసే ఈ కాల్‌ సెంటర్‌ ఆదివారం, ప్రభుత్వ సెలవు రోజులను మినహాయించి.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పనిచేస్తుంది. పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయి నుంచి సేకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. గర్భిణులకు సంబంధించి మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు నాలుగు పర్యాయాలు కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌ చేస్తారు. స్కానింగ్‌ చేయించుకున్నారా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారా, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారా, డాక్టర్‌ను కలిశారా, బరువు పెరుగుతోందా, మందులు వాడుతున్నారా, స్కానింగ్‌లో కానీ రిపోర్టుల్లో ఏమైనా సమస్య ఉన్నట్లు డాక్టర్లు చెప్పారా.. వంటి ప్రశ్నలు అడుగుతారు. వారు చెప్పే విషయాల్లో.. ఏదైనా సమస్య ఉంటే కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు నమోదు చేసుకుని డీఎంహెచ్‌ఓ ద్వారా సంబంధిత వైద్యాధికారుల దృష్టికి తీసుకెళ్తారు. పనిలో పనిగా వారికి సమీపంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు, అందుబాటులో ఉండే సేవలు తదితరాల గురించి వివరిస్తారు. రక్తహీనతతో ఎదురయ్యే సమస్యలు, ఐరన్, ఫోలిక్‌ మాత్రల వినియోగం వంటి అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. డెలివరీ తేదీ దగ్గరపడే సమయంలో వారు ఏ ఆసుపత్రిలో చేరాలనుకుంటున్నారో ముందే తెలుసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలనుకుంటే వైద్యులకు కాల్‌ సెంటర్‌ ద్వారా ముందే సమాచారం ఇస్తారు. 

రిటర్న్‌ కాల్స్‌తో.. కొత్త ఉత్సాహం
కాల్‌ సెంటర్‌ ప్రారంభమైన నాటి నుంచి ఒక్కో గర్భిణి లేదా బాలింతతో కనీసం డజను సార్లు మాట్లాడి ఉంటాం. మా నుంచి ఫోన్‌ వెళ్లిన వెంటనే.. వాళ్లే మమ్మలను ఎలా ఉన్నారని పలకరిస్తారు. ప్రసవం తర్వాత చాలా సార్లు రిటర్న్‌ కాల్‌ చేసి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. వారి నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. చాలా సార్లు కాల్‌సెంటర్‌ పనివేళలతో సంబంధం లేకుండా ఫోన్‌లు వచ్చినా.. వివరాలు చెప్తూ ఉంటాం. ఇక్కడ జిల్లా ఆసుపత్రిలో ప్రసవించే వారు.. తమ శిశువును చూసి వెళ్లాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ విచిత్ర అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. డెలివరీ డేట్‌ దగ్గర పడినందున ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా ఓ నిండు గర్భిణికి సూచించాం. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఆ మహిళ భర్త ఫోన్‌ చేసి.. తన భార్యకు నొప్పులు రావడం లేదంటూ ఆందోళన పడుతూ ఫోన్‌ చేశాడు. అక్కడున్న డాక్టర్లు చూసుకుంటారు, ఆందోళన పడొద్దని చెప్పాం.. మరుసటి రోజు ఫోన్‌ చేసి తాను టెన్షన్‌ పడి ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరాడు. ఏదేమైనా.. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగినట్లు మాకు వచ్చే రిటర్న్‌ కాల్స్‌ చెప్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న అపోహలను తొలగించడమే మా విధి.. బాధ్యత.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు
గత ఏడాది జూన్‌ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్లను అందిస్తోంది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. రెడ్‌ క్రాస్‌ ద్వారా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి.. నిర్వహణకు సంబంధించి శాలిని, గౌతమి అనే ఇద్దరు యువతులకు శిక్షణ ఇప్పించాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎప్పుడు ఆసుపత్రికి వెళ్లాలి, డాక్టర్లు ఏ సమయంలో అందుబాటులో ఉంటారు, ప్రసవానికి ఎప్పుడు ఆసుపత్రికి రావాలి అనే ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు సిబ్బంది తేదీల వారీగా తెలియ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కాల్‌ చేయడమే కాదు.. అవతలి నుంచి వచ్చే అనుమానాలు, ఫిర్యాదులు, ఇబ్బందులు.. ఏవైనా దృష్టికి తెస్తే కాల్‌ సెంటర్‌ ఉద్యోగులు ఓపికగా వారికి సూచనలు ఇస్తారు. నిజామాబాద్, హైదరాబాద్‌ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కాల్‌సెంటర్‌ పనితీరును ఇటీవలే పరిశీలించి వెళ్లారు. 
 – డాక్టర్‌ శశాంక్‌ దేశ్‌పాండే, కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జి 
– దండు దయానందం, సాక్షి, సంగారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top