
సూదికీ దిక్కులేదు... దూది కూడా దొరకడం లేదు
ప్రభుత్వాస్పత్రుల్లో మందులు లేక.. బయట కొనలేక పేదల అవస్థలు
జ్వరం గోళీలూ కరువే.. నొప్పులు, గ్యాస్ నివారణ బిళ్లలకూ కటకటమంత్రితో మిలాఖత్..
మందుల సరఫరా చేయని కాంట్రాక్ట్ సంస్థ
దూది కూడా రోగులే తెచ్చుకోవాలని సూచిస్తున్న వైద్య సిబ్బంది
ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఎక్కడా లభించని వైనం
మందులన్నీ సరఫరా చేస్తున్నామంటున్న సర్కారు
ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయి పరిస్థితులు
108 శో‘కాల్’.. డయల్ చేసినా పలకదు.. ప్రాణాలు పోతున్నా రాదు
బాబు ఏలుబడిలో 108 అంబులెన్స్ సేవలు అస్తవ్యస్తం
సరైన నిర్వహణ లేక మూలనపడ్డ 100కుపైగా వాహనాలు
మిగిలినవీ ఫోన్ చేస్తే ఎప్పుడొస్తాయో తెలియని దుస్థితి
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ ఆపదలో ఆదుకోని ఆపద్బాంధవి
నిర్వహణ కాంట్రాక్టు అస్మదీయులకు కట్టబెట్టేందుకు అత్యుత్సాహం
సేవలందించడంలో మాత్రం శ్రద్ధ చూపని టీడీపీ కూటమి సర్కారు
అంపశయ్యపై ఆరోగ్యశ్రీ.. నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ. 3,500 కోట్ల బాకీ.. ఆరోగ్య ఆసరాకు తిలోదకాలు
ఉచిత వైద్యం అందించబోమంటూ తేల్చి చెబుతున్న యాజమాన్యాలు
సేవల విస్తరణ పట్టించుకోని ప్రభుత్వం.. నిలిచిన ఎంపానెల్‌మెంట్
మే 13న సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి దాక రాష్ట్రంలో 108 సేవలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య బాధితులు అత్యవసర సాయం కోసం డయల్ చేసినా కలవలేదు. 5 గంటలకు పైగానే అంతరాయం ఏర్పడింది. గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్యం పాలైనవారు వైద్యసేవలు అందక తీవ్ర అవస్థలు పడ్డారు. సకాలంలో వైద్యం అందక కొందరు ప్రాణాలు విడిచారు.
మే 29న విజయవాడ కనకదుర్గ వారధిపై గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన వృద్ధురాలు గుడిపూడి భవానీని బస్సు ఢీకొట్టగా రెండు కాళ్లకూ తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్... బాధితురాలికి వైద్యం అందించాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ను ఆదేశించారు. భవానీకి తీవ్ర రక్తస్రావం అవుతుండగా... అరుణ్ పలుసార్లు 108కు కాల్ చేసినా సమాధానం లేదు. సమయానికి ప్రైవేట్ అంబులెన్స్ అటుగా రావడంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
గుంటూరు కలెక్టరేట్ సమీపంలో ఓ గృహిణి స్పృహ తప్పి పడిపోగా కుటుంబ సభ్యులు 108కు కాల్ చేశారు. కాల్ సెంటర్ సిబ్బంది వివరాలు తీసుకున్నాక అంబులెన్స్ సిబ్బంది లైన్‌లోకి వచ్చి ఆ ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ కాల్ కట్ చేశారు. దీంతో ప్రైవేట్ వాహనంలో బాధితురాలిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అంబులెన్స్ సకాలంలో వచ్చి, లైఫ్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇటీవల విజయవాడ కరెన్సీ నగర్‌లో రోడ్డుపై ఇసుక మేటను తప్పించబోయి స్కూటీ మీద నుంచి వృద్ధుడు పడిపోయాడు. తలకు తీవ్ర గాయమైంది. అక్కడివారు 108కు ఫోన్ చేస్తే అరగంటైనా రాలేదు. బాధితుడి కుటుంబ సభ్యులే వృద్ధుడిని తీసుకెళ్లారు.
అనారోగ్యంగా ఉండి 108ని పిలిస్తే రాదు... ఒంట్లో శక్తి లేకున్నా ఓపిక చేసుకుని సొంతంగానే ఆస్పత్రికి వెళ్తే కనీసం మందులుండవు... గాయాలైతే దూది కూడా బాధితులే కొనుక్కోవాలి... ఒకవేళ ప్రైవేటులో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అవసరమైతే ఇక ప్రాణాలు గాల్లో దీపమే...! మధుమేహ బాధితులైనా... తీవ్ర వ్యాధుల పీడితులైనా అంతే...! వైద్యం దైవాధీనమే..! చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఏలుబడిలో ఇదీ పరిస్థితి..! నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్లీ వచ్చాయి..!
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరా చేసేశాం. ఎక్కడా కొరత లేదు’ అంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. విలేజ్ క్లినిక్స్ నుంచి జిల్లా కేంద్రాల్లోని బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లోనూ కొరత వేధిస్తోంది. అన్ని బోధనాస్పత్రులను బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సల్లో వినియోగించే ఎసెన్షియల్ యాంటీబయోటిక్స్ కొరత వేధిస్తోంది. విలేజ్ క్లినిక్స్‌లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200పైగా, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి.
కానీ, ఏ ఆస్పత్రిని పరిశీలించినా ఈ మందులేవీ లేవు. జ్వరం, గ్యాస్, బీపీ, నొప్పుల వంటి చిన్నచిన్న సమస్యలతో వచ్చేవారినీ బయట కొనుక్కోమంటూ సిబ్బంది చిట్టీలు రాస్తున్నారు. సర్జికల్స్‌లో.. క్షతగాత్రులే గాయాల శుభ్రం, కట్టు కోసం దూది, డ్రెస్సింగ్ మెటీరియల్ తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మధుమేహ బాధితుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ అన్ని ఆస్పత్రుల్లో కొరత ఉందని వైద్యులు, సిబ్బంది చెబుతున్నారు. ఔట్ పేషంట్లకు (ఓపీ) నెలకు 3, 4 అవసరం ఉంటే.. ఒకటి, రెండే ఇచ్చి మిగిలినవి బయట కొనుక్కోమని సూచిస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు, వైఎస్సార్, సీఎం సొంత జిల్లా చిత్తూరుతో పాటు మిగిలిన చోట్ల ఇదే పద్ధతి కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా ఆస్పత్రిలో సర్జరీకి వచ్చిన రోగులనే సూదులు, సూచర్, ఇతర మెటీరియల్స్ కొనుక్కోమని సూచిస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పారాసిటమాల్, బీపీ మందులు, బీ కాంప్లెక్స్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇన్సులిన్ కొరత నెలకొంది.
మంత్రి చేతిలో మాత్ర..
వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) నుంచి సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా సరఫరా కాని మందులను స్థానికంగా పీఎంబీజేకే కార్యక్రమం కింద కొనాలని కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, ఓ మంత్రితో డీల్ కుదుర్చుకున్న సంస్థతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాస్పత్రులు ఎంవోయూ చేసుకున్నాయి. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినా ఆ సంస్థ మందులను సరఫరా చేయడం లేదని సూపరింటెండెంట్లు వాపోతున్నారు.
ఏ మందులు సరఫరా చేయలేరో చెబితే... ప్రత్యామ్నాయం చూసుకుంటామని కోరుతున్నా అది కూడా చేయడం లేదు. సమయానికి మందులు సరఫరా చేయకపోతే జరిమానాలు విధించడం, ఇదే తంతు కొనసాగితే సంస్థను బ్లాక్ లిస్టింగ్ చేస్తారు. కానీ, తమకు వచ్చిన బిజినెస్‌పై కమీషన్ ముట్టజెప్పేలా మంత్రితో సరఫరాదారులు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వారిపై జరిమానాలు విధించడానికి వీల్లేకుండా పోతోందని అధికారులు చెబుతున్నారు.

చంద్రబాబు ‘బీమా’లో ఆరోగ్యశ్రీ చిక్కి శల్యం
పేదల సంజీవని ఆరోగ్యశ్రీని కూటమి ప్రభుత్వం అంపశయ్య పైకి ఎక్కించింది. బీమా రూపంలో... ప్రజారోగ్యాన్ని దళారుల చేతిలో పెడుతూ గద్దెనెక్కిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ క్రమంలో ప్రణాళికబద్ధంగా పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం దగ్గర నిధుల్లేవు.. కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్‌తో సరిపెట్టుకోవాలని స్వయంగా టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చెప్పారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వం నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లు చెల్లింపులు సక్రమంగా చేయడం లేదు.
ప్రస్తుతం రూ.3,500 కోట్లు బకాయి పడింది. దీంతో చికిత్సలు అందించబోమని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య శ్రీని విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసి, చిట్టచివరి నిరుపేద, మధ్య తరగతి పౌరుడికి సేవలందేలా గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. 2019కి ముందు చంద్రబాబు పాలనలో 919 నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో మొక్కుబడిగా అమల వుతున్న ఆరోగ్యశ్రీని వైఎస్ జగన్ ఏకంగా 2,371కు తీసుకుని వెళ్లారు. వీటిలో 200పైగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి.
వీలైనన్ని ఎక్కువ ఆస్పత్రులకు అనుమతులివ్వడం ద్వారా మార్కెట్‌లో పోటీ పెంచి ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం ఉచితంగా అందేలా చేశారు. సేవలకు ముందుకు వచ్చిన ఆస్పత్రుల నుంచి ఎప్పటికప్పుడు దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులిచ్చారు. ప్రతి వారం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపానెల్ కమిటీ భేటీ అయి దరఖాస్తుల పరిశీలన, ఆమోదం వంటి కార్యకలాపాలు నిర్వహించేది. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు. 140కు పైగా ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ అనుమతి కోసం చేసిన అభ్యర్థనపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. కొత్తగా ఏర్పాటైన ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ అనుమతులు కావాలంటూ ట్రస్ట్ చుట్టూ చక్కర్లు కొడుతున్నా ఫలితం లేకపోతోంది.
2014–19 మధ్య చంద్రబాబు పాలనలోనూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. రూ.700 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. వీటిని చెల్లిండమే కాక ఏడాది తిరగకుండానే అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి ఊపిరిలూదారు. తెల్ల కార్డు ఉన్నవారికే ఆరోగ్యశ్రీ అనే నిబంధనను సవరించి, రూ.5 లక్షల వార్షికాదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు కూడా వర్తింపజేశారు. దీంతో 1.40 కోట్లపైగా కుటుంబాలు పథకం పరిధిలోకి వచ్చాయి. 1,059 ప్రొసీజర్‌లను ఏడాదిలోనే 2059కు, ఐదేళ్లలో 3,257కు పెంచారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ప్రొసీజర్‌ను అదనంగా ఆరోగ్యశ్రీలో చేర్చిన పాపాన పోలేదు. పైగా గత ప్రభుత్వంలో చికిత్స తర్వాత రోగులకు నెలకు రూ.5 వేల మేర అందించిన ఆరోగ్య ఆసరాను.. నిరుడే నిలివేశారు. ఏడాదికి రూ.400 కోట్ల మేర ఈ సాయం అందించాల్సి ఉంది.
5 వేల కాల్స్‌కు నో రెస్పాన్స్
గతంలో కాల్ సెంటర్‌కు వివిధ ప్రమాద, అనారోగ్య బాధితులకు సాయం కోసం రోజుకు 12 వేల నుంచి 13 వేల కాల్స్ వచ్చేవి. ప్రస్తుతం 8 వేల కాల్స్ మాత్రమే వస్తున్నాయి. అన్ని సందర్భాల్లో 108 వాహనాలు బాధితులకు అండగా నిలవడం లేదు. జూన్‌లో ఏకంగా 4500–5,000 ఉదంతాల్లో బాధితులకు సాయం అందలేదు. మరోవైపు కిందిస్థాయి ఆస్పత్రుల నుంచి మెరుగైన వైద్యానికి పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను పట్టించుకోవడమే లేదు.
ప్రతిసారీ మందులు బయటే కొంటున్నా...
నరాల సంబంధిత సమస్యకు గతంలో సర్జరీ చేశారు. అయినా కాళ్ల నొప్పులు తగ్గడం లేదు. ప్రతి నెల విజయవాడ జీజీహెచ్‌కు చికిత్స కోసం వస్తుంటా. స్టాక్ లేదు.. మందులు బయట కొనమని సిబ్బంది చీటీ రాస్తున్నారు. రూ.500 ఖర్చవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చూపించుకుని మందులు కొనే స్తోమత లేకనే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నాం. ఇక్కడ కూడా మందులు బయటికి రాస్తున్నారు. – శ్రీనివాసరావు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుడు విజయవాడ
ప్రాణం పోతున్నా రాని 108
ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసిన నిమిషాల్లోనే కుయ్ కుయ్‌మంటూ వచ్చిన అంబులెన్సులు నేడు ప్రాణాలు పోతున్నా రావడం లేదు. కూటమి ప్రభుత్వం రాగానే అప్పటి నిర్వహణ సంస్థను వెళ్లగొట్టి అస్మదీయ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటివరకు ఉన్న నిర్వహణ సంస్థకు బిల్లులు చెల్లించకుండా వేధించింది. దీంతో అత్యవసర వైద్యసేవల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎలాగూ వెళ్లగొట్టేస్తున్నారని నిశ్చయించుకుని పాత సంస్థ వాహనాల నిర్వహణను వదిలేసింది. 100 నుంచి 200 మేర వాహనాలు అధ్వాన స్థితికి చేరాయి.
రాష్ట్రంలో 768 అంబులెన్స్‌లు ఉండగా 731 ఆన్‌రోడ్ సేవలు అందించాలి. మిగతావి బ్యాకప్. కానీ, ఏ రోజూ 731 వాహనాలు ఆన్‌రోడ్ సేవల్లో ఉండడం లేదు. మరమ్మతుల పేరుతో నిత్యం 100 వాహనాలు షెడ్‌లకు చేరుతున్నాయి. ఉన్న అరకొర వాహనాలు సమయానికి ఘటనా స్థలాలకు వెళ్లడంలేదు. మే నెల సగటు రెస్పాన్స్ సమయాన్ని గమనిస్తే.. పట్టణాల్లో ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వెళ్లాల్సి ఉండగా 10 నిమిషాల మేర ఆలస్యంగా వెళ్లాయి.
గ్రామాల్లో 20 నిమిషాలకు గాను 28 నుంచి 30 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాలకు గాను 5 నుంచి 10 నిమిషాలకు పైగా ఆలస్యంగా చేరుకున్నాయి. గత నెల నుంచి ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థ భవ్య నిర్వహణ చేపట్టింది. కొత్త కాంట్రాక్ట్ ప్రమాణాల్లో గోల్డెన్ అవర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కాల్ సెంటర్‌కు ఫోన్ వచ్చిన గంటలో అంబులెన్స్ ప్రమాద స్థలి నుంచి రోగిని ఆస్పత్రికి చేర్చాలి. అయినా నిర్దేశిత సమయంలోపు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలు అందడం లేదు.
108... వైఎస్ జగన్ తొలి ఏడాది పాలనకు నేటికీ ఎంత తేడా?
చంద్రబాబు ‘108’లను ఏడాదిలోనే అస్తవ్యస్తంగా మార్చగా, గతంలో ఏడాది లోనే వైఎస్ జగన్ వాటిని బలోపేతం చేశారు. 2019కి ముందు ఈ అంబులెన్స్ సేవలు 336 వాహనాలతో అరకొరగా ఉండేవి. అంటే.. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. ఈ క్రమంలో ఏడాది కూడా తిరగకుండానే వైఎస్ జగన్ సర్కారు 412 అంబులెన్స్‌ల కొనుగోలు చేసింది. వీటిని 2020 జూలై 1న ప్రారంభించారు. 26 నవజాత శిశు అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు.
ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కి పెరిగింది. ఇందుకోసం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. రూ.4.76 కోట్లతో 2022 అక్టోబరులో 20 కొత్త 108లను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీంతో 108ల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కి.మీ.కు పైగా తిరిగిన వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్సులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా అత్యవసర సేవలను బలోపేతం చేయడం ద్వారా ఐదేళ్లలో 45 లక్షల మంది బాధితులకు అండగా నిలిచారు.