
చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం
గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచిపై దాడి దారుణం
వైఎస్సార్‌సీపీ ప్రాబల్యం తట్టుకోలేక టీడీపీ కార్యకర్తలతో దాడి చేయించిన వైనం
ఆ వీడియో చూస్తే దాడి ఎంత అన్యాయమో.. ఎంత హేయమో కన్పిస్తుంది
చంద్రబాబే స్వయంగా టీడీపీ శ్రేణులను ప్రోత్సహిస్తూ దాడులు చేయిస్తున్నారు
మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు సీఎం పదవిలో ఉండే అర్హత ఉందా?
శాంతిభద్రతలను కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు?
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది.
వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీలో ఉండడం, వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయలేదు. దీంతో రాజకీయంగా ఆ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు.
ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా
టీడీపీ మూకలు మారణాయుధాలతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. నాగమల్లేశ్వరరావు అన్న, మాజీ
ఎంపీపీ వేణుప్రసాద్‌తో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీకి స్థానికంగా బలమైన నాయకత్వాన్ని అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలకు నాగమల్లేశ్వరరావు అడ్డుగా ఉన్నాడనే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.
నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందిస్తారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలిజేయాలని అంబటి మురళీకృష్ణకు వైఎస్ జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుని ప్రజలకు మంచి చేయాలనుకున్న నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.