breaking news
Nagamallesvara rao
-
రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌తో రక్తమోడుతోన్న రాష్ట్రం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నెన్స్‌లతో రాష్ట్రం రక్తమోడుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు.. అదీ వీలుకాకపోతే, తన వాళ్లను ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వరరావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్సీపీలో ఉండడం, వారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయలేదు. దీంతో రాజకీయంగా ఆ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు.నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా టీడీపీ మూకలు మారణాయుధాలతో చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. నాగమల్లేశ్వరరావు అన్న, మాజీ ఎంపీపీ వేణుప్రసాద్‌తో వైఎస్ జగన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం పార్టీ నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. వైఎస్సార్సీపీకి స్థానికంగా బలమైన నాయకత్వాన్ని అందిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కుటుంబాన్ని చూసి ఓర్వలేక ఈ దారుణానికి పాల్పడ్డారని అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామంలో విచ్చలవిడిగా చేస్తున్న అక్రమాలకు నాగమల్లేశ్వరరావు అడ్డుగా ఉన్నాడనే ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.నాగమల్లేశ్వరరావు కుటుంబానికి వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందిస్తారని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని తనకు ఎప్పటికప్పుడు తెలిజేయాలని అంబటి మురళీకృష్ణకు వైఎస్ జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుని ప్రజలకు మంచి చేయాలనుకున్న నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు సోదరుడికి వైఎస్ జగన్ ఫోన్
సాక్షి,గుంటూరు: టీడీపీ నేతల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు సోదరుడు వేణు ప్రసాద్‌తో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా నాగమల్లేశ్వరరావు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
అభిమానంపై ఆంక్షలు
అక్కడ ఎలాంటి బహిరంగ సభ నిర్వహించడానికో వెళ్లడం లేదు... కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఉలిక్కిపడుతోంది...! అక్కడ ఏ బల ప్రదర్శన కోసమో వెళ్లడం లేదు... కానీ, పోలీసు యంత్రాంగం చేత కొర్రీలు పెట్టిస్తోంది...! అమిత జనాదరణ ఉన్న ప్రతిపక్ష నేతనుఆంక్షలతోఅడ్డుకోవాలని చూస్తోంది...! ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న సర్కారు.. లేనిపోని నిబంధనలతో అడ్డంకులు సృష్టిస్తోంది..! పోలీసులు, కూటమి నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను భగ్నం చేయాలని ప్రయత్నాలు సాగిస్తోంది..! సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం తలపెట్టిన పర్యటనతో కూటమి సర్కారు కలవరం చెందుతోంది. ప్రతిపక్ష నేత తమ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్తుండడాన్ని కూడా ప్రభుత్వం సహించలేకపోతోంది. రెంటపాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొర్లకుంట వెంకటేశ్వరరావు కుమారుడు నాగమల్లేశ్వరరావు వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటూ గ్రామ ఉప సర్పంచ్ అయ్యారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన జూన్ 4 నుంచి ఆయనను పోలీసులు, కూటమి నేతలు వేధించడం మొదలుపెట్టారు. దీంతో జూన్ 6న పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడి జూన్ 9న మృతి చెందారు. రెడ్‌బుక్ పాలనలో భాగంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు బలైన వైఎస్సార్సీపీ తొలి కార్యకర్త నాగమల్లేశ్వరరావు. ఇటీవలే ఆయన సంవత్సరీకం పూర్తయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించనున్నారు. అభిమానాన్ని కొలవగలరా..? వైఎస్ జగన్ పర్యటనకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తారనే అంచనాకు వచి్చన కూటమి ప్రభుత్వం, పోలీసులు అనుమతుల పేరుతో అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. మాజీ ముఖ్యమంత్రి, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నవారు. ఆయన వస్తున్నారంటే ప్రజలు స్వచ్ఛందంగా కదిలివస్తారు. అయినా సరే కూటమి నేతల ప్రోద్బలంతో పోలీసులు ఆయన పర్యటనకు వీలైనన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ సత్తెనపల్లి ఇన్చార్జి డాక్టర్ సుదీర్ భార్గవ్‌రెడ్డి కోరిన అనుమతిని తిరస్కరిస్తున్నారు. పేర్లు కావాలి... అన్ని కార్లు వద్దు.. వైఎస్ జగన్ పర్యటన సమన్వయకర్తల పేర్లు అడగడం, వాహనాల సంఖ్యపై పరిమితి విధించడం వంటి చర్యలకు పోలీసులు పాల్పడుతున్నారు. ఆయన కాన్వాయ్ కాకుండా మరో మూడు వాహనాలు, వందమందితోనే వెళ్లాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు అని ఎన్నో నిబంధనలు పెడుతున్నారు. వాస్తవానికి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత పర్యటనకు అన్ని విధాలా ఏర్పాట్లు చేయడం పోలీసుల బాధ్యత. కానీ, దీనికి పూర్తి విరుద్ధంగా కొర్రీలు పెడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ పర్యటనపై కార్యకర్తల్లో గందరగోళం సృష్టించి సత్తెనపల్లి రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారని, ఏం చేసినా పర్యటన జరిగి తీరుతుందని పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. జననేతకు జనాదరణ.. వ్యతిరేకత ప్రవాహంలో కూటమి ఇటీవల వైఎస్ జగన్ చేస్తున్న పర్యటనలకు ప్రజాదరణ పోటెత్తుతోంది. దీనిని చూసి తట్టుకోలేక ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంది. మరోవైపు కూటమి సర్కారు రోజురోజుకు వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది. సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైంది. హామీలను గాలికొదిలేసి రెడ్‌బుక్ పాలన సాగిస్తోంది. ఈ ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుతుండడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధిస్తూ పన్నాగాలు పన్నుతోంది. ట్రావెల్స్ యజమానులకు బెదిరింపులు అభిమాన నేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటనకు వస్తుండడంతో జిల్లాలోని వైఎస్సార్సీపీ అభిమానులు సత్తెనపల్లి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వచ్ఛందంగా ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. అయితే, వీరిని నిలువరించే ప్రయత్నంలో ఉన్న పోలీసులు.. ట్రావెల్స్ యజమానులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టు సమాచారం. బుధవారం సత్తెనపల్లి వైపు వస్తే కేసులు రాసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని అడ్డుకోలేరని వైఎస్సార్సీపీ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు పోలీసులకు సహకరించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. తన కుమారుడు నాగమల్లేశ్వరరావు జ్ఞాపకార్థం 30 వేలమందికి భోజనాలు పెట్టాలని వెంకటేశ్వరరావు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ పోలీసుల సూచనల నేపథ్యంలో విరమించుకున్నారు. పోలీసులు చెప్పిన విధంగా నాగమల్లేశ్వరరావు ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సత్తెనపల్లి: రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటనకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి డాక్టర్ గజ్జల సు«దీర్‌భార్గవ్‌రెడ్డి అనుమతి కోరారని, దానికి సంబంధించి పూర్తి సమాచారం కోరగా ఇవ్వలేదని, దీంతో తిరస్కరించామని ఎస్పీ పేర్కొన్నారు. అనవసరంగా భారీఎత్తున జన సమీకరణ చేయొద్దని చెప్పారు.వైఎస్ జగన్ పర్యటన సాగుతుందిలాబుధవారం ఉదయం 9 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లిలోని స్వగృహం నుంచి రోడ్డు మార్గంలో రెంటపాళ్లకు బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు రెంటపాళ్ల చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12 గంటలకు రెంటపాళ్ల నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి 1.30కు తాడేపల్లి చేరుకుంటారు. -
‘ప్రకాశం’ ఇంజనీర్ క్షేమమే!
కంపెనీ మేనేజర్‌తో మాట్లాడించిన కిడ్నాపర్లు ఒంగోలు/హైదరాబాద్: అస్సాంలో అపహరణకు గురైన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెంకు చెందిన ఇంజనీర్ నాగమల్లేశ్వరరావు సురక్షితంగా ఉన్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ పీ ప్రమోద్‌కుమార్ ఆదివారం వెల్లడించారు. తాను ఈ విషయంపై అస్సాంలోని డిమా హసావొ జిల్లా ఎస్పీ వేదాంత ఎం రాజ్‌ఖోవాతో మాట్లాడానన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగమల్లేశ్వరరావు చేత కిడ్నాపర్లు ఫోన్లో వశిష్ట కనస్ట్రక్షన్స్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ సత్యనారాయణతో మాట్లాడించారని ఎస్పీ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నానని ఇంజనీర్ ఆయనతో చెప్పారన్నారు.