
ధరల స్థిరీకరణ నిధి పచ్చి దగా.. మార్కెట్‌లో జోక్యం లేనేలేదు
రైతులను గాలికొదిలేసిన కూటమి సర్కార్
మిరప నుంచి టమాటా వరకు ఒకే దుస్థితి
కోత ఖర్చులు కూడా దక్కక పంటలను దున్నేస్తున్న వైనం.. మరికొన్ని చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు
అయినా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న పెద్దలు
గతంలో అడుగడుగునా అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. మద్దతు ధర కల్పనకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
ఐదేళ్లలో రూ.7,796 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోలు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు సైతం కొనుగోలు
నేడు ఆ భరోసా లేక ఊరూరా రైతుల గగ్గోలు
ధాన్యం నుంచి టమాటా వరకు.. మిరప నుంచి పత్తి వరకు.. పొగాకు మొదలు బత్తాయి వరకు.. కోకో మొదలు కూరగాయల వరకు.. ఏ పంట చూసినా మద్దతు ధర కరువు. పెట్టిన పెట్టుబడి దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, పొగాకు.. ఇలా అన్ని పంటల రైతులదీ దయనీయ పరిస్థితి. తుదకు పూలు, కూరగాయలకు కూడా మంచి ధర లేని దుస్థితి. కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయం పనికిరానిదైపోయింది. అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలతో గోడు చాటుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. మొద్దు నిద్ర వీడలేదు.
సాక్షి, అమరావతి : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. «మిరప మొదలుకొని టమాటా వరకు ఏ పంట చూసినా ధర లేక రైతులు నష్టపోతుంటే అండగా నిలిచేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్‌లో కంటి తుడుపు చర్యగా రూ.300 కోట్లు కేటాయించినప్పటికీ, ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదు. ఓ వైపు కరువు, మరో వైపు తుపాన్‌లు, వరదలు, అకాల వర్షాలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పంటలు ముందెన్నడూ లేని రీతిలో తెగుళ్లు, చీడపీడల బారిన పడి దిగుబడులు దిగజారిపోయాయి.
చివరికి చేతికొచ్చిన పంటకు మద్దతు ధర దక్కక రైతులు విలవిల్లాడి పోతున్నారు. కూలీల ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి లేక కొంత మంది రైతులు తమ పంటలను పశువుల మేతకు వదిలేస్తే.. మరికొంత మంది రైతులు కల్లాల్లోనే దున్నేస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితిలో పంటల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖాధికారులు పంపిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసిందే తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏకోశానా ఉన్నట్టు కన్పించలేదు. కేంద్రానికి లేఖలు పేరిట మిరప రైతును మోసగించినట్టే పొగాకు రైతులను అడ్డగోలుగా మోసగించింది.
ఖరీఫ్ పంట చివరి దశకు వచ్చిన తర్వాత కందులు, పెసలు, శనగ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కొద్ది మొత్తంలో కందులు, పెసలు, శనగలు సేకరించారు. ఇందుకోసం ఖర్చు చేసిన నిధులన్నీ కేంద్రానివే. గత సీజన్‌లో క్వింటా 27 వేలకు పైగా పలికిన తేజా రకం మిరప సైతం ఈసారి రూ.8 వేలకు మించి పలకడం లేదని గగ్గోలు పెడుతూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళన బాట పట్టినా మద్దతు ధర అంటూ హంగామా చేసిన కూటమి ప్రభుత్వం తుదకు చేతులెత్తేసింది.
ఆ ఐదేళ్లూ అన్నదాతకు పండగ
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా, ధర లేని ప్రతీసారి మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. తద్వారా ఆయా పంటల ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలిచారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది.
చివరికి 2023–24 రబీ సీజన్‌లో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే మార్కెట్‌లో జోక్యం చేసుకొని రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి భరోసా కల్పించింది. మరో వైపు 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించి వరి రైతులకు అండగా నిలిచింది. ప్రతి రైతుకు జీఏల్‌టీ (గన్ని, లేబర్, ట్రాన్స్‌పోర్టు) భారాన్ని సైతం నాటి ప్రభుత్వమే భరించింది.
పెట్టుబడిలో సగం కూడా దక్కలేదు
రెండెకరాల్లో టమాటా పంట వేశాను. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి అయ్యింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి 25 కిలోల బాక్స్ రూ.100 నుంచి రూ.150కి మించి పలకలేదు. 2 ఎకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.20 వేలు కూడా రాలేదు. ఇంత అధ్వాన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టాలపాలైనా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. – కృష్ణమూర్తి, అయినగల్, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా
గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నాం
నాకున్న కొద్దిపాటి కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నా. గత ఏడాది కిలో రూ.800–1200 వరకు ధర పలికింది. కానీ ఈ ఏడాది రూ.550కి మించి కొనడం లేదు. సరైన గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం కిలో రూ.900కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా కంపెనీలను ఒప్పించాలి. – తూత బాలాజీ కుమార్, తడికలపూడి, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లా
ఎకరాకు రూ.50 వేలు నష్టపోయా
18 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశాను. గతేడాది ఎకరాకు 17–18 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 11–12 క్వింటాళ్లకు మించి రాలేదు. గతేడాది నాణ్యమైన పొగాకు క్వింటాకు రూ.16–18 వేలు ధర పలుకగా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా సరే క్వింటాకు రూ.14–15 వేల వరకు దక్కింది. కానీ ఈ ఏడాది తేమ శాతం సాకుతో క్వింటాకు రూ.2500 నుంచి రూ.3 వేలకు మించి ఇవ్వడం లేదు. గతేడాది ఎకరాకు రూ.లక్షకుపైగా మిగిలితే ఈ ఏడాది ఎకరాకు రూ.50 వేలకుపైగా నష్టపోవాల్సి వచ్చిoది. – నర్సెట్టి శ్రీనివాసరావు, ఇనగొల్లు, బాపట్ల జిల్లా
ఈ ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలం
రాష్ట్రంలో ధాన్యం సహా మిరప, పత్తి, పొగాకు, మినుము, పెసర, శనగ, కంది తదితర పంట ఉత్పత్తుల ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఈ సీజన్‌లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలమైంది. – జీ.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం