సామర్థ్యాలకు సాన | Capabilities to the grindstone | Sakshi
Sakshi News home page

సామర్థ్యాలకు సాన

Mar 2 2015 11:17 PM | Updated on Sep 2 2017 10:11 PM

సామర్థ్యాలకు సాన

సామర్థ్యాలకు సాన

హైదరాబాద్‌లోని కెఎఫ్‌సి కౌంటర్‌లో మాటలు రాని కుర్రాడు మౌనంగా పనిచేసుకుపోతున్నాడు

మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

హైదరాబాద్‌లోని కెఎఫ్‌సి కౌంటర్‌లో మాటలు రాని కుర్రాడు మౌనంగా పనిచేసుకుపోతున్నాడు. గుజరాత్‌లోని సిల్వాసా పట్టణంలో పదో తరగతి చదివిన అమ్మాయి చురుగ్గా కంప్యూటర్‌తో పనిచేస్తోంది. కర్నాటకలో ఓ రైతు ఎప్పటికంటే పదివేలు ఎక్కువ మిగులు వచ్చిందని సంతోషిస్తున్నాడు. ఇలా దేశవ్యాప్తంగా లక్షలామందిలోని నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రోత్సాహం అందిస్తున్నది ఒకటే సంస్థ. అది డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్.

 డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకులు డాక్టర్ కె. అంజిరెడ్డి ఆలోచనల ప్రతిరూపమైన ఈ ఫౌండేషన సమాజంలో నిరాదరణకు లోనయిన అనేక మందిలో జీవితేచ్ఛను నింపుతోంది. 1996 నుంచి దేశంలోని ఇరవై రాష్ట్రాల్లో పేదరిక నిర్మూలన, జీవనప్రమాణాల పెరుగుదల, విద్యాభివృద్ధి, నైపుణ్యాల పెంపు, వ్యవసాయరంగాలలో రెడ్డీస్ ఫౌండేషన్ సేలవందిస్తోంది. 45 రోజులు, 60 రోజుల శిక్షణ తరగతుల్లో ఇక్కడ శిక్షణ పొంది వృత్తి నైపుణ్యం సాధించి ప్రయోజనం పొందిన వారు మూడు లక్షలకు పైగా ఉన్నారు.

బహుళ జాతి కంపెనీల్లో ‘ప్రత్యేక’ ఉద్యోగాలు

జెపి మోర్గాన్, యాక్చెంచర్, డెల్ వంటి బహుళజాతి కంపెనీల సమన్వయంతో రెడ్డీస్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన వారు తర్వాత ఆ కంపెనీల్లో ఉద్యోగులుగా స్థిరపడుతున్నారు. ప్రత్యేకమైన సామర్థ్యం (స్పెషల్లీ ఏబుల్డ్) కలిగిన వారికి శిక్షణను ఇక్కడ ప్రత్యేకంగా ఇస్తారు. వివిధ కెఎఫ్‌సి సెంటర్లలో కనిపించే బదిరులు కూడా ఇక్కడ శిక్షణ పొందిన వారే. నిపుణులు వారికి సంజ్ఞల ఆధారంగా శిక్షణనిస్తారు. వారు ఏ ఉద్యోగంలో చేరబోతారో ఆ ఉద్యోగంలో చేయాల్సిన పనులను ప్రత్యేకంగా నేర్పిస్తారు. అలాగే ఉద్యోగంలో చేరిన తర్వాత వారితో పనిచేయించుకోవాల్సిన సహోద్యోగికి కూడా (ప్రత్యేక సామర్థ్యం కలిగిన వారికి ఎలా పనిచెప్పాలనే విషయంలో) తగిన శిక్షణనిస్తారు. కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి కంపెనీలను తరగతి గదికి ఆహ్వానించి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారిలోని నైపుణ్యాన్ని ప్రదర్శింపజేస్తారు. ఇలాంటి వారు నెలకు ఐదారువేల జీతంతో ఉద్యోగంలో చేరి, ఐదారేళ్లలో మంచి వేతనం అందుకుంటున్నారు.
 ఫొటోలు: జి.రాజేష్
 
సేవలు విస్తృతం!

 
కెఎఫ్‌సి, ఐమ్యాక్స్, ఎయిర్‌టెల్, ఐడియా, కార్వి, కాఫీ డే, పిజ్లా కార్నర్‌లలో పని చేస్తున్న ఫిజికల్లీ చాలెంజ్‌డ్  పీపుల్ మా దగ్గర శిక్షణ పొందిన వారే. అలాగే రైతులకు 9 రాష్ట్రాల్లో 27 ప్రదేశాల్లో శిక్షణనిస్తున్నాం. మా శిక్షకులు నేలసారాన్ని పరిశీలించి సూచనలివ్వడం వల్ల రైతులు పంటకు వేసే ఎరువుల ఖర్చు తగ్గడం, దిగుబడి పెరగడం వంటి ప్రయోజనాలు సాధిస్తున్నారు. నైపుణ్యం పెంచే శిక్షణ తరగతులు ఏడాది పొడవునా జరుగుతుంటాయి. మా సేవలు ఇంత మందికే అనే పరిమితులేవీ ఉండవు. ఎంతమంది వచ్చినా శిక్షణనిస్తాం.
 - ప్రణవ్ కుమార్ చౌదరి,
 డెరైక్టర్ (ఆపరేషన్స్), డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్
 
మనదేశంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ చట్టం 2013లో రూపొందింది. కిందటి ఏడాది అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వెయ్యికోట్ల లావాదేవీలు నిర్వహించే సంస్థలు వారి లాభాల్లో రెండు శాతాన్ని సమాజశ్రేయస్సు కోసం ఖర్చు చేయాలి. ఆకలి, దారిద్య్రం, పోషకాహారలోపం, ఆరోగ్యం, విద్యాభివృద్ధి,  నైపుణ్యాభివృద్ధి, లింగవివక్ష నిర్మూలన, ఉపాధికల్పన, పర్యావరణ పరిరక్షణ, జంతుసంరక్షణ, జాతీయ వారసత్వ సంపద, కళలు, సంస్కృతి, క్రీడలు వంటి అంశాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటి చట్టం రాకముందే తన సంస్థ ద్వారా ఆ పనులన్నీ చేసి చూపించిన దార్శనికుడు డాక్టర్ కల్లం అంజిరెడ్డి. దేశవ్యాప్తంగా రెడ్డీస్ ఫౌండేషన్ శిక్షణ కేంద్రాలు 99 ఉన్నాయి.
 టోల్ ఫ్రీ నంబరు... 1800 425 1545

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement