వెరవని ధీరత్వం

Bibi Gulab Kaur Special Story - Sakshi

స్త్రీ శక్తి

ఇరవయ్యవ శతాబ్దపు తొలి రోజులు. భారతీయ మహిళలకు జెండర్‌ ఈక్వాలిటీ అనే పదం కూడా తెలియదు. అయినప్పటికీ సమానత్వ సాధన కోసం పోరాడాల్సిన సమయంలో అంతకంటే గొప్ప పోరాటానికి తమ జీవితాలను అంకితం చేశారు. మహిళల గొంతు ఇంటి నాలుగ్గోడలకు కూడా వినిపించని రోజుల్లో జాతీయోద్యమం కోసం గళమెత్తారు. మగవాళ్లతో పాటు ఉద్యమించారు.వారిలో పంజాబ్‌కు చెందిన బీబీ గులాబ్‌ కౌర్‌ ఒకరు.

జాతీయోద్యమంలో పోరాడిన ధీరవనితల్లో అరుణా అసఫ్‌ అలీ, లక్ష్మీ సెహగల్, సుచేతా కృపలాని, తారా రాణి, కనకలత వంటి కొన్ని పేర్లు మాత్రమే మనకు గుర్తుకు వస్తుంటాయి. జాతీయోద్యమ ముఖచిత్రంలో తొలి పేజీల్లో చోటు చేసుకున్న ఈ మహిళామణులతోపాటు మరెందరో స్త్రీలు.. రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల స్థాయిలో ఎవరి శక్తి మేరకు వాళ్లు పోరాడారు. ఆ పోరాట యోధులలో పంజాబ్‌ రాష్ట్రం తమ ఆడపిల్లలకు నేటికీ రోల్‌మోడల్‌గా చూపించుకుంటున్న ఒక యోధురాలు గులాబ్‌ కౌర్‌.

గమ్యాన్ని మార్చిన ప్రయాణం
గులాబ్‌ కౌర్‌ది పంజాబ్‌లోని సంగ్రూర్‌ జిల్లా, బక్షివాలా గ్రామం. 1890లో పుట్టిన గులాబ్‌... జాతీయోద్యమంలో అడుగు పెట్టే వరకు అందరిలా మామూలమ్మాయే. మాన్‌సింగ్‌ అనే విద్యావంతుడిని పెళ్లి చేసుకుంది. మితిమీరిన సంపన్నులు కాకపోయినా సౌకర్యంగా జీవించగలిగిన సంపన్నత కలిగిన కుటుంబమే వాళ్లది. అయినప్పటికీ అతడికి అమెరికా వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది. భార్యతోపాటు బయలుదేరాడు. ఫిలిప్పీన్స్‌ మీదుగా అమెరికా చేరడానికి వారి నౌకాయానం మొదలైంది. ఆ ప్రయాణమే గులాబ్‌ను జాతీయోద్యమం వైపు నడిపించింది.

‘విడిపోయిన’ భార్యాభర్తలు
అమెరికా ప్రయాణంలో వారితోపాటు గధర్‌ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ల మాటల ద్వారా గులాబ్‌కు వలస పాలనలో మగ్గుతున్న భారతదేశ విముక్తి కోసం పోరాడాల్సిన అవసరం తెలిసి వచ్చింది. భార్యాభర్తల మధ్య ‘వెనక్కి వెళ్లి జన్మభూమి కోసం పోరాటం చేయటమా, ముందుకు వెళ్లి కోరుకున్నంత ధనాన్ని సంపాదించుకుని విలాసవంతంగా జీవించడమా’ అనే చర్చ మొదలైంది. మాన్‌సింగ్‌ ప్రయాణాన్ని కొనసాగించడానికే మొగ్గు చూపించాడు. గులాబ్‌ భర్తను వ్యతిరేకించ లేదు, అలాగని అతడిని అనుసరించనూ లేదు. అతడిని అమెరికాకు పంపించి, తాను ఫిలిప్పీన్స్‌ నుంచి వెనక్కి వచ్చి జాతీయోద్యమంలో పాల్గొన్నది!

అక్షరమే ఆయుధం
గులాబ్‌ కౌర్‌ పంజాబ్‌ రాష్ట్రంలోని కపుర్తల, హోషియార్‌ పూర్, జలంధర్‌లలో  క్షేత్రస్థాయిలో పనిచేశారు. యువకులను సాయుధ పోరాటం వైపు మరలించారు. వలస పాలనలో భారతీయులకు ఎదురవుతున్న వివక్షను కథనాలుగా రాశారు. అప్పటికే బ్రిటిష్‌ సేనల నిఘా కళ్లు ఆమె మీదకు ఉన్నాయి. బ్రిటిష్‌ పాలకుల పట్ల భారతీయుల్లో చెలరేగుతున్న వ్యతిరేకతను ఆమె కళ్లకు కట్టినట్లు రాస్తూ, రహస్యంగా ప్రింట్‌ చేసి కార్యకర్తల ద్వారా గ్రామాలకు చేరవేశారు. ఆమె రచనలు చదివిన యువకులు ఉత్తేజంతో ఉరికేవాళ్లు. ఆమె అక్షరాలు బ్రిటిష్‌ పాలకులకు కంట్లో నలుసుగా మారి ప్రశాంతతను దూరం చేశాయి. జర్నలిస్టుగా ఆమె రాసే రాతలు పాఠకులను ఉద్రేక పరిచేటట్లుగానూ, వలస పాలకుల నిబంధనలకు విరుద్ధంగానే ఉన్నాయనే నెపంతో ఆమె మీద రాజద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గులాబ్‌ కౌర్‌ను లాహోర్‌లోని షామి ఖిలా జైల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. ఆ చిత్రహింసలను భరించలేక, రెండేళ్ల శిక్ష కాలం పూర్తి కాకముందే ఆమె 1931లో ప్రాణాలు వదిలారు గులాబ్‌ కౌర్‌. పంజాబ్‌ వాసులు ఇప్పటికీ గులాబ్‌ కౌర్‌ను గర్వంగా తలుచుకుంటారు. – మంజీర

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top