
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై వంచన
మొత్తం 16 కేటగిరీల్లో కేవలం 5 కేటగిరీల్లోనే వర్తింపు
పల్లె నుంచి పల్లెకు మాత్రమే ప్రయాణించే అవకాశం
కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీకే పథకం పరిమితం
మహిళలు రాష్ట్రం అంతటా పర్యటించవచ్చని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు
రాష్ట్రం కాదు కదా.. జిల్లాలోనూ పూర్తిగా ఉచితంగా ప్రయాణించే అవకాశమివ్వని వైనం
‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు.. శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు.. టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్లి సత్యన్నారాయణస్వామిని దర్శనం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చు అని హామీ ఇస్తున్నా...!’ ఇదీ ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికిన హామీ!
ఈ మాట నమ్మి బస్సు ఎక్కితే ఆడపడుచులు బొక్కబోర్లా పడిపోయినట్లే.. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి తిరుమలకు కాదు కదా వారుంటున్న గ్రామం నుంచి అదే జిల్లాలోని పలాసకు కూడా డైరెక్టుగా పోలేరు. బాబుగారి ఉచిత బస్సులో పక్క జిల్లాకే కాదు పక్క నియోజకవర్గానికి కూడా పోలేరు. పల్లె నుంచి పక్క పల్లెకు మాత్రమే పోగలుగుతారు. అది కూడా ఆ పల్లెల్లో బస్సు తిరిగితేనే.. ఎందుకంటే మన పల్లెల్లో ఇప్పటికే చాలా బస్సులు ఎత్తేశారు.. చాలా పల్లెలకు అసలు బస్సులే లేవు మరి...
సాక్షి, అమరావతి: ‘బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ..’ అని మరోసారి నిరూపితమైంది! అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తన ట్రేడ్ మార్కు వెన్నుపోటు రాజకీయం చూపించారు! ‘స్త్రీ శక్తి’ పథకం పేరిట మరోసారి తన కుయుక్తి ప్రదర్శించారు. ఏడాదికిపైగా కాలయాపన తరువాత ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఆదిలోనే నీరుగార్చారు. పథకం అమలుపై లెక్కలేనన్ని పరిమితులు విధించారు. మొత్తం 16 కేటగిరీ ఆర్టీసీ బస్సు సర్విసులు ఉంటే కేవలం ఐదు కేటగిరీ బస్సులకే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తద్వారా రాష్ట్రం అంతటా కాదు కదా కనీసం జిల్లా అంతా ఉచితంగా ప్రయాణించే అవకాశం కూడా లేకుండా చేశారు.
స్త్రీలకు టికెట్ ప్రయాణమే..!
ఆర్టీసీ మొత్తం 16 కేటగిరీల్లో బస్ సర్విసులను నిర్వహిస్తోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేటగిరీ సర్విసుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చెప్పిందో తెలుసా..? కేవలం ఐదంటే ఐదు మాత్రమే! ఏసీ కేటగిరీలో వెన్నెల, డాల్ఫిన్ క్రూయిజర్, అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర, మెటోలగ్జరీ, 9ఎం ఇ.బస్ సర్విసులను ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఇక నాన్ ఏసీ కేటగిరీల్లో స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, ఎస్‌ఏపీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్విసులు నడుపుతోంది. మొత్తం 11,256 బస్ సర్విసులు నిర్వహిస్తోంది.
ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సర్విసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు కేటగిరీలు.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఏసీ కేటగిరీలో ఉన్న ఏడు సర్విసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాదని తేల్చి చెప్పింది. పోనీ నాన్ ఏసీ కేటగిరీలో ఉన్న 9 కేటగిరీల్లో అయినా పూర్తిగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తుందా? అంటే అదీ లేదు. వాటిలో కూడా ముఖ్యమైన స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎస్‌ఏపీ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని, టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రకటించింది.

మరోసారి మహిళలకు మోసం..
చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుయుక్తితో మహిళలను వంచించింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవాలి కానీ మహిళలకు అందకూడదనే రీతిలో దుర్భుద్ధితో వ్యవహరించింది. అందుకే అన్ని ఏసీ సర్వీసులు, నాన్ ఏసీ సర్వీసుల్లో కూడా నాలుగు కేటగిరీల్లో అమలు చేయబోమని ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కేవలం ఒక్క కేటగిరీలోనే అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లోనే ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పింది. పోనీ సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో అయినా పూర్తిగా ఈ పథకాన్ని అమలు చేస్తారా అంటే అదీ లేదు. నాన్ స్టాప్ సర్విసుల్లో ఈ పథకం అమలు చేయబోమని ప్రకటించి దొంగ దెబ్బ తీసింది. ఆర్టీసీ చాలా ఏళ్లుగా రెండు పట్టణాల మధ్య సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసులను నిలిపివేసింది.
వాటిని నాన్ స్టాప్ సర్విసులుగా మార్చివేసింది. ఉదాహరణకు.. శ్రీకాకుళం– విజయనగరం, శ్రీకాకుళం – విశాఖపట్నం, విశాఖపట్నం – అనకాపల్లి, విశాఖపట్నం – రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం– కాకినాడ, విజయవాడ – ఏలూరు, విజయవాడ – బందరు, విజయవాడ– గుంటూరు, ఒంగోలు – మార్కాపురం, నెల్లూరు– తిరుపతి, తిరుపతి– శ్రీకాళహస్తి, తిరుపతి – చిత్తూరు, తిరుపతి– మదనపల్లి, కడప – కర్నూలు... ఇలా రాష్ట్రంలోని ఏ రెండు ప్రధాన పట్టణాల మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్ సర్విసులను నాన్ స్టాప్ సర్వీసులుగా మార్చేసింది.
ఎక్స్‌ప్రెస్ సర్విసులు పేరుకు 1,560 ఉన్నాయి. కానీ వాటిలో దాదాపు 950 సర్విసులు నాన్ స్టాప్ సర్విసులే. అంటే వాటిలో ఉచిత ప్రయాణం పథకం వర్తించదు. కేవలం జిల్లాలో కొన్ని పల్లెలు, పట్టణాల మధ్య తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, నగరాల్లో సిటీ ఆర్డినరీ సర్విసుల్లోనే ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మహిళలు టికెట్ లేకుండా రాష్ట్రం అంతా కాదు కదా కనీసం తమ జిల్లా అంతా కూడా ప్రయాణించే అవకాశం లేదని తేల్చి చెప్పింది.
దాహరణకు శ్రీకాకుళం నుంచి పలాస, ఇచ్చాపురం వెళ్లాలంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సు సర్విసులు లేవు. అల్ట్రా డీలక్స్ బస్సులే శరణ్యం. ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయరు. అదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఉంది. తిరుమలకు వెళ్లే సప్తగిరి సర్వీసుల్లో ఉచిత ప్రయాణం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరిట చంద్రబాబు మరోసారి మహిళలను మోసం చేశారన్నది తేటతెల్లమైంది.