ఆది నుంచి దగా | Andhra Pradesh High Court to give opportunity to choose post according to merit in DSC | Sakshi
Sakshi News home page

ఆది నుంచి దగా

Sep 17 2025 5:55 AM | Updated on Sep 17 2025 5:55 AM

Andhra Pradesh High Court to give opportunity to choose post according to merit in DSC

దగా డీఎస్సీతో ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువునా ముంచిన కూటమి సర్కారు

నోటిఫికేషన్‌ మొదలు ఫలితాల వెల్లడి దాకా కుతంత్రమే

అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో దరఖాస్తు దశలోనే లక్షలాది మందికి అన్యాయం

ప్రశ్న పత్రాల్లో తప్పులున్నాసవరించకుండా ఫలితాలు వెల్లడి

రోజుకో విధంగా మారిపోయిన మార్కులు

ఇదివరకెన్నడూ లేని విధంగా మెరిట్‌ లిస్ట్‌ ఇవ్వకుండానే ఎంపిక

తక్కువ మార్కులొచ్చిన వారికి ముందుగా కాల్‌ లెటర్లు

మేము మెరిట్‌ లిస్టులో ఉన్నా కాల్‌ లెటర్లు రాలేదని పలువురి ఆందోళన

సమస్య పరిష్కరించాల్సింది పోయి రాజకీయ విమర్శలు

రెండు మూడు ఉద్యోగాలు సాధించినా నచ్చిన పోస్టు ఎంచుకునే అవకాశం లేకుండా చేసిన వైనం

మెరిట్‌ ప్రకారం పోస్టు ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌

ఆ తీర్పును లెక్కచేయకుండా హడావుడిగా అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

ఆపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లిన ప్రభుత్వం.. సింగిల్‌ జడ్జి తీర్పు సమర్ధించిన బెంచ్‌

మళ్లీ మొదటికొచ్చిన డీఎస్సీ2025 ఎంపిక ప్రక్రియ

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చేసింది. ఏళ్ల తరబడి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడ్డ అభ్యర్థులకు అసంబద్ధ నిబంధనలు, నిర్ణయాలతో మెరిట్‌ను పట్టించుకోకుండా అన్యాయం చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్టయింది. నోటిఫికేషన్‌లో కూటమి ప్రభుత్వం పోస్టుల ప్రాధా­న్యం మెలిక పెట్టి అభ్యర్థుల ప్రతిభను మంటగలిపే ప్రయత్నం చేసింది. దీనిపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

దాదాపు ఏడాదిన్నరగా జరుగుతున్న డీఎస్సీ ప్రక్రియలో కూటమి ప్రభుత్వం అడుగడుగునా తప్పులు చేయడం చూస్తుంటే కాలయాపన కోసమే ఇలా చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గతేడాది జూన్‌ 12న తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. అప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ప్రకటించిన 6,100 పోస్టులకు ఇవి అదనం అని అభ్యర్థులు భావించగా, ఆ వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత అనేక డ్రామాలు నడిపి నోటిఫికేషన్‌ను ఆలస్యం చేసి అభ్యర్థుల్లో గందరగోళం నింపింది. రెండు రోజుల క్రితం ఫలితాలు ప్రకటించే దాకా ఇదే గందరగోళం కొనసాగించడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలు కలుగుతున్నాయి.

తప్పుడు లెక్కలు.. భర్తీ ప్రక్రియలో సాగదీతలు
⇒ మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అంటూ ఎన్నికల వరకు నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఉన్నవి 16,347 పోస్టులే అన్నారు. కానీ సమాచార హక్కు చట్టం కింద విద్యా శాఖ ఇచ్చిన సమాధానంలో ఆంధ్రప్రదేశ్‌లో 27,409 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంగీకరించారు.

గతేడాది డిసెంబర్‌ నాటికే డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, అనేక కారణాలతో వాయిదాలు వేసి దాదాపు 11 నెలల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 19న డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.

అభ్యర్థుల అర్హత మార్కుల పెంపుతో ఆందోళన
మెగా డీఎస్సీ2025 నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీలో 50 శాతం, పీజీటీ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. ఇలా కనీస అర్హత మార్కులు ఉండాలని నిబంధన విధించి, దరఖాస్తు దశలోనే లక్షలాది మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది.

ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు టీచర్లుగా పని చేస్తున్న వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్‌ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది.

ప్రశ్నల్లో తప్పులున్నాసరిచేయకుండానే ఎంపిక
డీఎస్సీ ప్రశ్నల్లో అనేక తప్పులు దొర్లినా విద్యా శాఖ సరిచేయలేదు. అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించినా రెస్పాన్స్‌ షీట్లలో జవాబులు గుర్తించినట్టు లేకపోవడంతో ఖంగుతిన్నారు. ఒక్కో అభ్యర్థి 160 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించినా 60 నుంచి 20 ప్రశ్నలకు అసలు సమాధానాలు గుర్తించనట్టుగా నమోదైంది.

అభ్యర్థులు గుర్తించిన జవాబుకు ఖాళీ చూపడం, లేదా చుక్కలు నమోదవడం, జవాబు మారిపోవడం (జంబ్లింగ్‌)తో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ప్రకటించిన ఫైనల్‌ ‘కీ’లో అనేక లోపాలను అభ్యర్థులు గుర్తించారు. వాటికి ఆధారాలను సైతం విద్యా శాఖకు పంపించారు. కానీ ఆయా అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికీ తెలియలేదు.

ఆపై మెరిట్‌ లిస్ట్, సెలక్షన్‌ లిస్ట్‌ లేకుండా నేరుగా ‘సెలెక్టెడ్‌’ అభ్యర్థుల ఫోన్లకు మెసేజ్‌లు పంపి సరి్టఫికెట్‌ వెరిఫికేషన్‌కు పిలిచారు. పరీక్ష రాసిన 3,36,307 మంది మెరిట్‌ను ప్రకటించకుండా కేవలం 16,437 పోస్టులకు గాను అంత మందికే మెసేజ్‌ పంపడం గమనార్హం.

కాల్‌ లెటర్ల జారీలో ‘టెస్టింగ్‌’
ఒకే కేటగిరీకి చెందిన వారిలో వెనక ఉన్న వారికి తొలుత లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పాటు అభ్యర్థుల డీఎస్సీ మార్కులు రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ పాసైనట్టు ప్రకటించి, తర్వాత వెబ్‌సైట్‌ నుంచి డేటా తొలగించి, నాట్‌ క్వాలిఫైడ్‌ అని ప్రకటించడం గమనార్హం.

ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ)ల ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్‌లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్‌ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాసవలేదని కాల్‌ లెటర్లు నిలిపివేశారు. ‘మేము మెరిట్‌ లిస్టులో ఉన్నా కాల్‌ లెటర్లు రాలేదు’ అంటున్న వారు వేలల్లో జిల్లాల్లో కౌన్సెలింగ్‌ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు
డీఎస్సీ నోటిఫికేషన్‌ దగ్గర నుంచి కాల్‌ లెటర్ల జారీ, సరి్టఫికెట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పణంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడిచింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు ఆయా పరీక్షలను వేర్వేరుగా హాల్‌ టికెట్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు.

16,347 ఉపాధ్యాయ పోస్టులకు 3,36,307 మంది అభ్యర్థులు 5,77,694 దరఖాస్తులు సమరి్పంచారు. ఇందులో ప్రతిభ గల అభ్యర్థులు ఎస్జీటీతో పాటు స్కూల్‌ అసిస్టెంట్, టీజీటీ మూడు పోస్టులు సాధించారు. మెరిట్‌ ప్రకారం మూడు పోస్టులకు కాల్‌ లెటర్లు పంపాల్సి ఉన్నా దరఖాస్తులో మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్న పోస్టుకే కాల్‌ లెటర్లు పంపారు.

దీంతో అభ్యర్థి సాధించిన పోస్టుల్లో నచ్చిన పోస్టు ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ఇలా దాదాపు 4 వేల మంది ఉన్నత అవకాశం కల్పోయారు. ఇలా డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం అడుగడుగునా కుట్ర పూరితంగానే వ్యవహరించింది.

కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ నిర్వహణలో పలు లోపాలు ఉన్నాయని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. డీఎస్సీపై 104 వరకు కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యత తీసుకున్నప్పటికీ, అర్హత సాధించాక నచ్చిన పోస్టును ఎంచుకునే అవకాశం లేకుండా చేయడం సరికాదని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సైతం ప్రభుత్వం బేఖాతరు చేస్తూ సోమవారం హడావుడిగా తుది ఫలితాలను ప్రకటించేసింది. ఆపై ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌కు వెళ్లగా చుక్కెదురైంది. దీన్ని బట్టి ప్రభుత్వం ప్రతి దశలోనూ కుట్ర పూరితంగానే వ్యవహరించిందని స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement