తాడేపల్లి: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనలో తనను మించిన వారు లేరంటూ చంద్రబాబు ప్రతీరోజూ గొప్పలు చెప్పుకోవడం ఒకవైపు కనిపిస్తూ ఉంటే, ఆయన పరిపాలనలో ఘోర వైఫల్యాలు మరోవైపు కనిపిస్తాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్’ఎక్స్’లో చంద్రబాబు పాలనపై మండిపడ్డారు వైఎస్ జగన్.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణం. రాష్ట్రంలో ఉన్న పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలను పూర్తిగా రాజకీయ కక్షసాధింపులకు వాడుకుంటున్న చంద్రబాబుగారు ప్రజల భద్రతనే కాదు, ఈ రకంగా ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతను కూడా గాలికి వదిలేశారు. లేని కల్తీ లడ్డూ వ్యవహారాన్ని సృష్టించి, అందులో రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరికించడంపై చంద్రబాబుకి ఉన్న శ్రద్ధ, ఆలయాలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించడంలో లేదు.
ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పుడు ప్రైవేటు ఆలయం అంటూ, ఎలాంటి సమాచారం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? రాష్ట్రంలో దేవాదాయశాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు ఎక్కువగా వస్తున్నారని తెలిసినప్పుడు బందోబస్తు కల్పించడం అన్నది ప్రభుత్వానికి ఉన్న కనీస బాధ్యత. ప్రొద్దుటూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం, అనకాపల్లి సమీపంలోని శ్రీ సూర్యనారాయణస్వామి వారి దేవస్థానం, ద్వారంపూడిలోని అయ్యప్పస్వామి ఆలయం, సీతానగరం విజయకీలాద్రిపై చినజీయర్‌స్వామి కట్టిన వివిధ దేవాలయాలు సహా రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
పర్వదినాలు, వేడుకల సమయాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. మరి వీరికి భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని, తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెప్తోందని అంటే…,దీని అర్థం తప్పు జరిగినట్టే కదా? చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చరిత్రలో తొలిసారి తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో 7గురు బలయ్యారు. కాని, ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది.
ఇప్పుడు మళ్లీ కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 9 మంది మరణించారు. మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తొక్కిసలాట జరిగిన వెంటనే వైద్యుడైన, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించి, సత్వర చికిత్స అందించి, ఇద్దరు భక్తుల ప్రాణాలను కాపాడటమే కాదు, గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. మా డాక్టర్ అప్పలరాజును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.


