కీళ్లెంచి మేలెంచు

 Arthritis Can Lead To Many Different Types Of Complications - Sakshi

ఆర్థరైటిస్‌ అంటే కీళ్ల దగ్గర వచ్చే రుగ్మత. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏదో కీళ్లలో నొప్పి వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేసి పెయిన్‌కిల్లర్‌ వేసుకుంటే సరిపోదు. చికిత్స తీసుకోకపోతే రోగి ఆయుర్దాయం 10 నుంచి 15 ఏళ్లు తగ్గిపోయే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే... చాలా రకాల కీళ్లవాతాల్లో ఆర్థరైటిస్‌ అనేది చాలా సాధారణంగా చూసే మొదటి లక్షణం. అవి ఆర్థరైటిస్‌ లక్షణంతో మొదలై కాలక్రమేణా శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

దాంతో కీళ్లవాతాలు పూర్తిగా ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని తేలిగ్గా తీసుకోకూడదు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం కూడదు. పైగా వీటి  నిర్ధారణ కూడా అంత తేలిక కాకపోవడంతో వీలైనంత త్వరగానూ, జాగ్రత్తగానూ గుర్తించడం కూడా ఎంతో అవసరం. ఈ నెల 12న ‘వరల్డ్‌ ఆర్థరైటిస్‌ డే’ సందర్భంగా ఆ రుగ్మతపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.

కీళ్ల దగ్గర తీవ్రమైన నొప్పి, విపరీతమైన వాపు, బాగా బిగుసుకుపోయినట్లుగా కావడాన్ని ఆర్థరైటిస్‌గా వ్యవహరిస్తారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంటే... ఎన్నో రకాల కీళ్లవాతాలను కలుపుకొని ఆర్థరైటిస్‌ రుగ్మతలుగా వ్యవహరిస్తారు. వీటిల్లో కొన్ని ఎముకల సమస్యలు వయసు పెరుగుతూ పోతున్నకొద్దీ ఏర్పడే అరుగుదల కారణంగా వస్తాయి. ఇక మరికొన్ని మాత్రం మన సొంత వ్యాధి నిరోధక శక్తి మన కణాలనే పరాయివిగా పరిగణించి దాడి చేయడం వల్ల మన దేహంలోని ఎన్నో కీలకమైన కణజాలాలు, వ్యవస్థలు దెబ్బతింటాయి.

దాంతో చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడే అవకాశముంది. మనం మన రోజువారీ పనుల్లో ఏది  చేయడానికైనా కీళ్లు సరిగా పనిచేయడం అవసరం. అయితే కీళ్లల్లో ఏర్పడే ఈ వ్యాధుల కారణంగా అంగవైకల్యం కూడా రావచ్చు. ఫలితంగా వృత్తులు, ఉపాధులు కోల్పోవడం వంటి సామాజిక పరిణామాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ సమస్య కారణంగా మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపోతారు. అంతేకాదు... కొన్ని రకాల కీళ్లవాతాల కారణంగా అంటువ్యాధులు, క్యాన్సర్‌ వంటి జబ్బులొచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి.

ఆర్థరైటిస్‌కు కారణాలు...
ముందుగా చెప్పినట్లుగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆర్థరైటిస్‌ అన్న ఓ సమస్య ఒక వయసు దాటాక అనివార్యంగా అందరిలోనూ కనిపించేందుకు అవకాశం ఉంది. ఎముకల్లో అరుగుదల కారణంగా కనిపించే ఇలాంటి సమస్యను ఆస్టియో ఆర్థరైటిస్‌గా చెబుతారు. ఇది చాలా సాధారణమైన, సాహసమైన సమస్య.అయితే కొందరిలో జన్యులోపాల కారణంగా మన రోగనిరోధక వ్యవస్థ తప్పుదారి పడుతుంది. ముందుగానే చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన తమ సొంతకణాలనే హాని చేయడానికి వచ్చిన పరాయి కణాలుగా పరిగణించి వాటిని తుదముట్టించడానికి మన రోగనిరోధక వ్యవస్థ... శత్రుసంహారం కోసం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది.

తత్ఫలితంగా... ఆ యాంటీబాడీస్‌ దాడి కారణంగా... ఆ వ్యక్తి తాలూకు ఎముకలు, కీళ్లు, కండరాలు, ఇక కొన్ని సందర్భాల్లో వివిధ కీలకమైన అవయవాలు సైతం దెబ్బతింటాయి. ఇదే సమయంలో పర్యావరణంలోని హాని చేసే క్రిములు, రసాయనపదార్థాలు, కాలుష్యాలు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అప్పటికే ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి. దీనికి తోడు ఒకవేళ ఆ వ్యక్తికి పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే... అవి వ్యాధి తాలూకు దుష్ప్రభావాలను మరింతగా పెంచుతాయి. ఇక కొన్ని రకాల ఆర్థరైటిస్‌లు వంశపారంపర్యంగా కొనసాగుతుంటాయి.

ఆర్థరైటిస్‌లలో ప్రధాన రకాలైన ఆటోఇమ్యూన్‌ వ్యాధులివి...
రకరకాల ఆర్థరైటిస్‌ల కారణంగా రకరకాల కీళ్ల సమస్యలు వస్తాయి. ఇలాంటి కీళ్లవాతాల్లో లూపస్‌ (సిస్టమిక్‌ లూపస్‌ ఎరిథమెటోసిస్‌–ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ (ఆర్‌ఏ), గౌట్, షోగ్రన్స్‌ డిసీజ్, స్కీ›్లరోడర్మా వంటివి ప్రధానమైనవి. అలాగే మయోసైటిస్, వాస్కులైటిస్, యాంకైలోజింగ్‌ స్పాండిలైటిస్, సోరియాసిస్, సార్కాయిడ్‌ వంటివి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే కీళ్లవాతాలు. ఇవి కూడా ఆర్థరైటిస్‌లాగే మొదలవుతాయి.

ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయంటే...
ఇలాంటి ఆటోఇమ్యూన్‌ కీళ్లవాతాలు ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంటాయి. వారి జీవితంలోని అన్ని దశల్లోనూ తీవ్రమైన ప్రభావం చూపెడతాయి. ఇక యాంకైలోజింగ్‌ స్పాండలైటిస్, కొన్ని రకాలైన వాస్కులైటిస్‌ వంటివి పురుషుల్లో ఎక్కువగా వస్తుంటాయి. సాధారణంగా... వయసు పెరగడం వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌ మినహా మిగతా రకాల కీళ్లవాతాలు ఏ వయసు వారిలోనైనా కనిపించడానికి అవకాశం ఉంది.
వ్యాధి లక్షణాలు
ఒక్కో రకమైన కీళ్లవాతానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా వ్యక్తం కాకపోవచ్చు కూడా. వ్యాధి తీరు, తీవ్రత, రోగి వయసు, రోగికి ఉన్న ఇతర వ్యాధులపై ఆధారపడి వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే తీరు మారుతూ ఉంటుంది. తొలిదశలో ఏ రకమైన కీళ్లవాతంలోనైనా లక్షణాలన్నీ సాధారణమైన ఇతర వ్యాధుల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. ఉదాహరణకు సాయంత్రమయ్యేసరికి జ్వరం రావడం, అలసట, నెమ్మదిగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు ప్రారంభదశలో కనిపిస్తాయి.

ఈ సాధారణ లక్షణాలు ఇతర వ్యాధుల్లో సైతం కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. కీళ్ల దగ్గర విపరీతమైన నొప్పి, వాపు వచ్చి... అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేసరికి రోగి పరిస్థితి దిగజారిపోయి సొంతపనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ సమస్య ముఖ్యంగా చిన్న కీళ్ల మీద తన ప్రభావం చూపిస్తే... యాంకైలోజింగ్‌ స్పాండిలైటిస్‌ అనేది వెన్నుపూసలు, పెద్దకీళ్లపై ప్రభావం చూపిస్తుంది.

కీళ్లవాతం కారణంగా వచ్చే సంక్లిష్ట సమస్యలు
►ఆర్థరైటిస్‌ కాలక్రమేణా ఎన్నో రకాలైన సంక్లిష్టమైన సమస్యలకు దారితీస్తుంది. ఎముకలను బాగా పెళుసుగా తయారు చేస్తుంది. దాంతో చిన్నపాటి దెబ్బకు సైతం, ఒక్కోసారి ఎలాంటి గాయాలు లేకపోయినా ఎముక విరిగిపోతుంది.
►నరాల మీద ఒత్తిడి కలిగించి, స్పర్శలో మార్పు రావడం, కాళ్లూ–చేతులు పట్టుకోల్పోవడం జరుగుతుంది.
►ఈ సమస్య వచ్చిన కొందరిలో నోరు, కళ్లు విపరీతంగా పొడిబారిపోతాయి.
►గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలూ తలెత్తుతాయి.

వ్యాధి నిర్ధారణ...
తొలిదశలో వ్యాధి నిర్ధారణ ఒకింత కష్టమైన పనే. అయినప్పటికీ రుమటాలజిస్ట్‌లు ఈ వ్యాధికి సంబంధించిన నిపుణులు కావడం వల్ల రోగి లక్షణాలనూ, కొన్ని వైద్యపరీక్షల తర్వాత అవసరమైన రక్తపరీక్షలు చేయించి, వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిస్తారు. అయితే ఒక్కోసారి ఈ పరీక్షలలో సానుకూల ఫలితాలు ఉన్నంత మాత్రన కూడా వ్యాధి ఉన్నట్లు కాదు. ఈ పరీక్షలలో ఎన్నో ‘నాన్‌–రుమటలాజికల్‌’ జబ్బులు కూడా ‘ఫాల్స్‌ పాజిటివ్‌’ ఫలితాలను ఇవ్వవచ్చు. అంటే వ్యాధి లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు రిపోర్టులు రావచ్చు.

అలాగే ఒకే జబ్బులో ఎన్నో యాంటీబాడీస్‌ పాజిటివ్‌గా ఉండవచ్చు. అందువల్లనే రుమటాలజిస్టులు తమ అనుభవంతో అసలైన వ్యాధినీ... వ్యాధిలేకపోయినా ఉన్నట్లుగా కనిపించే ఫాల్స్‌పాజిటివ్‌ అంశాలను గుర్తించి, తగిన మందులను సూచిస్తారు. అయితే ఒక్కోసారి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకపోవడం వల్ల వ్యాధి లేనివారికి కూడా ఉన్నట్లు పరిగణించి మందులు వాడితే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో రుమటాలజిస్టులను సంప్రదిస్తే వారు చాలా నిశితంగా (మెటిక్యులస్‌గా) రోగిని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు.

చికిత్స
ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స విధానాలు ఉంటాయి. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్‌ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దమోతాదులో స్టెరాయిడ్స్‌ వాడటంతో పాటు ‘డిసీజ్‌ మాడిఫైయింగ్‌ డ్రగ్స్‌’ అనేవి మొదలుపెట్టాలి. దాదాపు 10 – 20 శాతం మందిలో ఎన్ని రకాల మందులు వాడుతున్నప్పటికీ ఒక్కోసారి జబ్బుతీవ్రతను అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటివారిలో బయలాజిక్స్‌ అనే మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్‌ పనిచేయవు. బయాలజిక్స్‌ను సూచించే సమయంలో... వ్యాధి తీవ్రత, దాని కారణంగా ప్రభావితమైన అవయవాలతో పాటు రోగి బరువు, స్త్రీ/పురుషుడు అన్న అంశం, మహిళలైతే గర్భవతా అనే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

చికిత్సతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు
►లక్షణాలు కనిపించడం మొదలైన కొన్ని వారాల నుంచి నెలల వ్యవధిని ‘విండో ఆఫ్‌ ఆపర్చునిటీ’ అంటారు. ఈ సమయంలో రుమటాలజిస్ట్‌లను సంప్రదించి, తగిన చికిత్స పొందే వ్యక్తులలో రుమాటిక్‌ ప్రభావాల కారణంగా కలిగే దీర్ఘకాలిక సమస్యలను అరికట్టవచ్చు.

►క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చికిత్సలో ఒక భాగం. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు.

►ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా ఉన్న బరువును తగ్గించుకోవాలి. ఒంటి బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది.
   
► పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి.

►క్యాల్షియమ్‌ సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి.

►కీళ్లవాతానికి సంబంధించిన అపోహలను పక్కన పెట్టాలి.

►కీళ్లలో నొప్పి వంటివి కనిపిస్తే... దాన్ని తేలిగ్గా తీసుకోకుండా, అది ఆర్థరైటిస్‌కు సంబంధించిన వ్యాధేమోనని అనుమానించి రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే తుంచేస్తే... ఎన్నో అనర్థాలు తప్పుతాయనీ, జీవనశైలి, జీవననాణ్యత మెరుగుపడతాయని గుర్తుంచుకోవడం మంచిది.

గుర్తించడం ఎలా...
►ఇంగ్లిష్‌ అక్షరం ‘ఎస్‌’తో మూడు ‘ఎస్‌’ల సహాయంతో ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అదెలాగంటే...

►స్వెల్లింగ్‌ (వాపు) – చిన్న కీళ్లదగ్గర వాపు రావడం.

►స్టిఫ్‌నెస్‌ (బిగదీసుకుపోవడం) – ఉదయాన్నే30 నిమిషాలకు పైనే కీళ్లు బిర్రుగా పట్టుకుపోవడం/బిగుసుకుపోవడం.

స్క్వీజ్‌: చేతిని చిన్నగా నొక్కినా (స్క్వీజ్‌ చేసినా) విపరీతమైన నొప్పి రావడం. పైన పేర్కొన్న మూడు ‘ఎస్‌’లతో కూడిన లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఆర్థరైటిస్‌ సమస్య ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు దాన్ని ఆర్థరైటిస్‌ సమస్య కావచ్చేమోనని అనుమానించాలి.

►చర్మంపై ఎర్రని మచ్చలు, దద్దుర్లు, మాననిపుండ్లు, చర్మం కుళ్లిపోవడం అనేవి లూపస్‌తో పాటు వాస్కులైటిస్‌ వంటి కీళ్లవాతాలలో ఎక్కువగా జరుగుతుంటుంది. లూపస్‌ వ్యాధిగ్రస్తుల్లో ముక్కుకు ఇరువైపులా బుగ్గల మీద సీతాకోకచిలుక ఆకృతితో ‘బటర్‌ఫ్లై రాష్‌’ అనే కండిషన్‌ వచ్చి అక్కడ కందిపోయినట్లుగా కనిపిస్తుంది.

►వైద్యచికిత్స తీసుకోని రుమటాయిడ్‌ వ్యాధిగ్రస్తుల్లో చర్మం కింద బొడిపెలు ఏర్పడతాయి.

►మరికొందరిలో చలికాలంలో చల్లటినీళ్లు తగిలినప్పుడు వేళ్లు నీలంగా, ఎర్రగా, తెలుపురంగులోకి మారిపోతాయి. ఇలా కావడాన్ని ‘రెనాడ్స్‌ ఫినామినా’ అంటారు. ఇది అనేక రకాల కీళ్లవాతాల్లో కనిపిస్తుంది.

►లూపస్‌ అనే సమస్యలో... నోటిలో కురుపులు, పూత రావడం, జుట్టు రాలిపోవడం, మహిళల్లోనైతే తరచూ గర్భస్రావాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి ముదిరినప్పుడు ఊపిరితిత్తులపైన, గుండెపైన ఒక పొర ఏర్పడి, వాటి చుట్టూ నీరు చేరుతుంది. దాంతో ఊపిరితీసుకునే సమయంలో నొప్పి రావడంతో పాటు దగ్గు, ఆయాసం కనిపిస్తాయి. ఇవే లక్షణాలు టీబీలోనూ కనిపించడం వల్ల ఒక్కోసారి రోగి తాలూకు వ్యాధి నిర్ధారణ తప్పుగా జరిగి... టీబీ మందులు వాడటం కూడా సంభవించవచ్చు. టీబీ మందులు ఎంత వాడినా మెరుగుదల కనిపించకపోవడం, రోగి తాలూకు ఇతర లక్షణాలు బయటపడటం జరిగినప్పుడు మాత్రమే కీళ్లవాతం అనే అనుమానం వచ్చి అప్పుడు రుమటాలజిస్ట్‌ను సంప్రదిస్తారు. అయితే అప్పటికే వ్యాధి తీవ్రరూపం దాల్చి అనేక సమస్యలకు కారణమవుతుంది.

►మరికొందరిలో రక్తకణాలు తగ్గిపోవడం, తరచూ రక్తహీనత కలగడం, కామెర్లు రావడం కూడా జరుగుతాయి.

►చిన్న వయసులోనే కిడ్నీ సమస్య రావడం, అధిక రక్తపోటు వంటివి కూడా కీళ్లవాతం తాలూకు సంకేతాలే.

►కీళ్లవాతం కారణంగా మెదడు, నరాలు ప్రభావితమైనప్పుడు... తరచూ ఫిట్స్‌ రావడం, అకస్మాత్తుగా చూపుపోవడం, పక్షవాతం రావడం వంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయి.

►సాధారణంగా నడుమునొప్పి అనేది వయసు మీద పడ్డాక కనిపించే సమస్య. అలా కాకుండా యుక్తవయసులోనే విపరీతమైన నడుమునొప్పి. మెడ, మడమల నొప్పులతో పాటు నిద్ర లేవగానే నడుము దగ్గర బిర్రుగా పట్టేసినట్లు ఉండటం,  తరచూ విరేచనాలు లాంటి లక్షణాలు స్పాండైలోఆర్థరైటిస్‌లో కనిపిస్తాయి.

►జ్ఞాపకశక్తి మందగించడం, రోజువారీ జీవన కార్యకలాపాలపై ఆ ప్రభావం కనపడటం అన్నది రుమాటిక్‌ వ్యాధుల్లో కనిపించే ప్రధాన లక్షణం.

►రోగులకు ఇటు శారీరకంగా, అటు మానసికంగా బలహీనపరిచే వ్యాధుల్లో కీళ్లవాతాలు చాలా ముఖ్యమైనవి. చికిత్స కూడా ఒకింత సంక్లిష్టంగానే ఉంటుంది. దాంతో ఈ రోగుల్లో ఆందోళన, నిరాశ, కుంగుబాటు (డిప్రెషన్‌) కారణంగా ఆత్మహత్యాధోరణులు ఎక్కువగా కనిపిస్తాయి.

అపోహలూ – వాస్తవాలు
►విశ్రాంతి వల్ల కీళ్లవాకీళ్ల  వాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి.

►ఆర్థరైటిస్‌ ఒక వయసు దాటాకే కనిపిస్తుందని కొందరి అపోహ. అది పూర్తిగా వాస్తవం కాదు. ఆస్టియో ఆర్థరైటిస్‌ మాత్రమే వయసు పెరిగాక కనిపిస్తుంది. మిగతావి ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు.

►పిల్లలకు ఆర్థరైటిస్‌ రాదని కొందరు అపోహపడుతుంటారు. కానీ కొన్ని ఆర్థరైటిస్‌ సమస్యలు పిల్లల్లోనూ కనిపించవచ్చు.

►ఆర్థరైటిస్‌ వచ్చినవారు దుంపకూరలూ, మాంసాహారం తినకూడదని కొందరు భావిస్తారు. అయితే అది వాస్తవం కాదు. పోషకాహారలోపం ఏర్పడకుండా ఉండేందుకు వాటిని తీసుకోవచ్చు.

►దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. కాని ఇది వాస్తవం కాదు.

డాక్టర్‌ విజయ ప్రసన్న పరిమి
సీనియర్‌ కన్సల్టెంట్‌ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top