రైతు దంపతులను  మింగిన సాగు రుణాలు

Anantapur Farmer Suicide In Chandrababu Naidu Government - Sakshi

మూడేళ్లు దాటినా ఎక్స్‌గ్రేషియా ఇవ్వని ప్రభుత్వం

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని చాలవేముల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, రాజ్యలక్ష్మి దంపతులకు ఐదుగురు సంతానం. వీరు తమకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. వర్షాభావం వల్ల తరచూ వ్యవసాయంలో నష్టాలొచ్చాయి. దీంతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి గ్రామ సమీపంలోని కొండలపై ఉన్న గాలిమరల వద్ద కాపలాదారునిగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చేదెలా? వర్షాలు రాకపోవడం వల్ల తన కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఈ దిగులుతో సుబ్బారెడ్డి 2015 డిసెంబర్‌ 29న గుండెపోటుతో మృతి చెందాడు.

ఇంటి పెద్దదిక్కు మరణించడంతో కుంగిపోయిన అతని భార్య రాజ్యలక్ష్మి భర్త చనిపోయిన తెల్లారే 30వ తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయం కోసం చేసిన అప్పుల బాధతో తల్లడిల్లిన తల్లిదండ్రులు చనిపోవడంతో వారి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు అనాథలయ్యారు. దీంతో సుబ్బారెడ్డి అన్న శివారెడ్డి ఆ పిల్లల బాధ్యత తీసుకున్నారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ నలుగురు పిల్లలకు ఉచిత విద్యనందిస్తోంది.

గాయత్రి 10వ తరగతి, స్రవంతి 8వ తరగతి, శ్రావణి 3వ తరగతి, తేజశ్విని, ప్రణయ్‌కుమార్‌రెడ్డి 1వ తరగతి చదువుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. తమ మనవరాళ్లు, మనుమడిని ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకోవాలని సుబ్బారెడ్డి తల్లి చిన్న కుళ్లాయమ్మ వేడుకుంటున్నది. ‘ఇప్పటి వరకు ఆపద్బంధు కింద రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. పిల్లల భవిష్యత్తు అంతుపట్టడం లేదు. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి’ అని ఆమె కోరారు. – కాకనూరు హరినాథరెడ్డి, సాక్షి, పుట్లూరు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top