
బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్ర మరోసారి సల్మాన్‌ఖాన్‌పై విరుచుకుపడ్డారు. ‘భారత్’ సినిమా వసూళ్లలో వెనుకపడ్డ అతన్ని ‘పేపర్ టైగర్’గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. సల్మాన్‌ఖాన్ తాజా చిత్రం 'భారత్' బాక్సాఫీస్ రిపోర్టును పంచుకొంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘సల్మాన్ నటించిన భారత్ చిత్రానికి హైప్, భారీ ప్రమోషన్ కల్పించినా కనీసం ఒక వారంపాటు కూడా వసూళ్లు నిలకడగా రాబట్టలేకపోయింది. ఇలాంటి ఫిల్మీ సూపర్‌స్టార్‌లను ఏమని పిలవాలి?’ అని పేర్కొన్న ఆమె.. పేపర్ టైగర్ పేరిట హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇటువంటి వారిని పూజించడం మానుకోవాలని సల్మాన్ అభిమానులకు సలహా ఇచ్చింది.
బాలీవుడ్ కండలవీరునిపై ఇలాంటి ట్వీట్‌లు చేయడం సోనాకి కొత్తేమి కాదు. భారత్ మూవీ నుంచి ప్రియాంక జోనస్ తప్పుకోవడంపై ట్వీట్ చేయడాన్ని తప్పుబడుతూ ఆమె గతంలో కూడా ఇలాగే ట్వీట్ చేశారు. ప్రియాంకను సమర్థిస్తూ తనదైన రీతిలో ట్వీట్‌తో ఘాటుగా జవాబిచ్చారు. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి.. ఆమెను చంపేస్తామని బెదిరింపు మెయిల్స్ కూడా చేశారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన భారత్ మూవీలో సల్మాన్‌కు జోడిగా కత్రినా కైఫ్ నటించిన సంగతి తెలిసిందే.