తమకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారంటూ జూపాడుబంగ్లా సాక్షి విలేకరి నాగభూషణంపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.
కర్నూలు : ఓటమి భయంతో టీడీపీ దాడులకు పాల్పడుతోంది. తాజాగా తమకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారంటూ జూపాడుబంగ్లా సాక్షి విలేకరి నాగభూషణంపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో నాగభూషణం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
కాగా పలు చోట్ల వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పరిధిలోని వట్లూరు పంచాయితీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టిడిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా గతకొన్నిరోజులుగా ఇరుపార్టీల కార్యకర్తలకు గొడవలు జరుగుతున్నాయి. పంచాయితీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ పార్టీ కార్యకర్తపై టీడీపీ నాయకులు దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు.