బాబుపై ‘సంఘ్’ వార్!

బాబుపై ‘సంఘ్’ వార్! - Sakshi


* టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను ఓడించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ పథకం

 

హైదరాబాద్: తెలంగాణ తెచ్చిన పార్టీగా బీజేపీకున్న గుర్తింపును ఆసరా చేసుకుని తెలంగాణలో బలపడేందుకు పొత్తు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు పన్నిన ఎత్తుకు కమలం పార్టీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ పైఎత్తులు వేస్తోంది. తెలంగాణలో బీజేపీని పనిగట్టుకొని దెబ్బతీసిన చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆ సంస్థ భావిస్తోంది. టీడీపీతో పొత్తు వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని స్థానిక నేతలు గట్టిగా వాదించినా.. తన లాబీయింగ్‌తో బీజేపీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకున్న బాబు తీరుపై ఆర్‌ఎస్‌ఎస్ మండిపడుతోంది.కర్ణాటక తరహాలో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలనుకున్న తన ఆలోచనలకు చంద్రబాబు గండికొట్టడంతో ఈ ఎన్నికల్లో ఆయన పార్టీని దెబ్బతీయాలన్న నిశ్చయానికొచ్చింది. అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ ఓటమే లక్ష్యంగా పథక రచన చేసింది. ఎన్డీయే గూటిలో చేరినట్టు చంద్రబాబు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒకటో అరో వచ్చే ఎంపీ స్థానాలతో కేంద్రంలో బీజేపీ లాభపడనుంది. అందువల్ల లోక్‌సభ స్థానాల్లో దేశం అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తూనే, అసెంబ్లీ స్థానాల్లో తమ్ముళ్లను ఓడించాలన్నది ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహం. దీంతో క్రాస్ ఓటింగ్ నినాదాన్ని అందుకుంది.క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు సమాచారం

రాష్ట్రానికి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు రెండు రోజుల క్రితమే దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీ బలంగా ఉన్న అసెంబ్లీ స్థానాలను ఎంపిక చేసి.. ఆయా ప్రాంతాల్లోని ఆర్‌ఎస్‌ఎస్ క్షేత్రస్థాయి కార్యకర్తలకు సమాచారమిచ్చారు. ఒక్కో ఊరిలో కనీసం వందమంది ఓటర్లకు తమ సందేశం చేరవేయాలని ఆదేశించారు. లోక్‌సభ వరకు టీడీపీ అభ్యర్థికే ఓటు వేసి, అసెంబ్లీకి మాత్రం టీడీపీ అభ్యర్థికి కాకుండా ఇతరులకు ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరచాలని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పేర్కొన్నారు.ఆ ‘ఇతరుల్లో’ కాంగ్రెస్ అభ్యర్థి ఉండకూడదని కూడా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఓటర్లకు పూర్తి స్థాయిలో స్పష్టతనివ్వాలని సూచించారు. లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మేలు చేస్తుందని, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి వేసే ప్రతి ఓటు బీజేపీకి నష్టం చేస్తుందని విడమర్చి చెప్పాల్సిందిగా సంఘ్ ముఖ్యలు సూచించినట్టు సమాచారం.టీఆర్‌ఎస్-కాంగ్రెస్-టీడీపీ/బీజేపీ త్రిముఖ పోటీలో చాలా మంది అభ్యర్థులు వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించే అవకాశమున్నందున, ఒక్కో అసెంబీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వంద మంది ఓటర్లకు తమ సమాచారం చేరితే లక్ష్యం నెరవేరుతుందని సంఘ్ గట్టిగా నమ్ముతోంది. ఈ క్రాస్ ఓటింగ్ నినాదాన్ని క్షేత్ర స్థాయిలో బీజేపీ కార్యకర్తలకు అందించి.. వారి సహకారాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top