పట్టణం.. పోలింగ్‌కు దూరం | Highest turnout in Narsampet Assembly Constituency in Telangana | Sakshi
Sakshi News home page

పట్టణం.. పోలింగ్‌కు దూరం

May 2 2014 1:03 AM | Updated on Sep 17 2018 6:08 PM

పట్టణం.. పోలింగ్‌కు దూరం - Sakshi

పట్టణం.. పోలింగ్‌కు దూరం

తెలంగాణలోని పది జిల్లాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గురువారం రాత్రికి అందిన తుది సమాచారం ప్రకారం 72.45 శాతం పోలింగ్ నమోదైంది.

* గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నామమాత్రమే
* నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 87.59 శాతం పోలింగ్
* ఎల్బీనగర్‌లో అత్యల్పంగా 47 శాతం మాత్రమే నమోదు
* తెలంగాణ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 72.45 శాతం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గురువారం రాత్రికి అందిన తుది సమాచారం ప్రకారం 72.45 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 85 శాతం పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ఎల్బీనగర్‌లో అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైతే.. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం నామమాత్రంగా పోలింగ్ జరగడం గమనార్హం.

వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 87.59 శాతం పోలింగ్ జరగ్గా, నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం 86 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అత్యల్పంగా పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో ఎల్బీనగర్(47.00%), శేరిలింగంపల్లి(49.50%), నాంపల్లి(49.86) ఉన్నాయి. నర్సంపేట, ఆలేరు కాకుండా అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాల వరుసలో డోర్నకల్ (85.87%) నర్సాపూర్ (85%), భువనగిరి (84.99%), సూర్యాపేట (84.29%) ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు అధిక స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల భారీ పోలింగ్ నమోదైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా పోలింగ్ జరగడం ఎవరికి అనుకూలం.. ఎవరికి వ్యతిరేకం? అన్న అంశంపై రాజకీయ పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ జరిగితే..రాష్ట్ర రాజధాని నగరం, దాని శివార్లలోని నియోజకవర్గాల్లో మాత్రం అతితక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంపై అధికారులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు.

తాము ప్రజలను ఎంతగా చైతన్యపరిచినప్పటికీ.. వారు ఓటింగ్‌కు దూరంగా ఉంటే తాము చేసేదేమిటని ఓ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఓటు హక్కు వినియోగం గురించి ప్రచారం చేశామని అధికారులు చెప్పారు. గిరిజన నియోజకవర్గాల్లో సైతం 80 శాతం పైగా పోలింగ్ జరిగితే విద్యావంతులుండే ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ తక్కువ జరగడం గమనార్హం.
 
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
మెదక్(80.17), నల్లగొండ(80.17), ఖమ్మం(80),  వరంగల్(78.74), నిజామాబాద్ (70.20), కరీంనగర్(72.21), ఆదిలాబాద్(72.71), రంగారెడ్డి(61.11), మహబూబ్‌నగర్(74.25), హైదరాబాద్(53.30)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement