breaking news
Narsampet Assembly Constituency
-
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో రాత్రి 12.51 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ నెల 26న హనుమకొండలో పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయినట్లు గుర్తించారు. దాదాపు గంటపాటు శ్రమించి తొమ్మిదిసార్లు సీపీఆర్ నిర్వహించగా.. కొంత స్పందన కనిపించింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు.యశోద ఆస్పత్రిలో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే సుదీర్ఘకాలం స్పృహలో లేకపోవడం, ఆక్సిజన్ లోపం కారణంగా మెదడుకు నష్టం జరిగినట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో నాడీ సంబంధిత స్పందనలో ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.తెలంగాణ ఉద్యమం ద్వారా.. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి.. సాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన చురుగ్గా పనిచేశారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన.. 2001లో అప్పటి తెరాస (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2015లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. పలువురు పార్టీ నేతలు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు. -
పట్టణం.. పోలింగ్‌కు దూరం
* గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నామమాత్రమే * నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 87.59 శాతం పోలింగ్ * ఎల్బీనగర్లో అత్యల్పంగా 47 శాతం మాత్రమే నమోదు * తెలంగాణ వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 72.45 శాతం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గురువారం రాత్రికి అందిన తుది సమాచారం ప్రకారం 72.45 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో 85 శాతం పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ఎల్బీనగర్లో అత్యల్పంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదైతే.. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం నామమాత్రంగా పోలింగ్ జరగడం గమనార్హం. వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో అత్యధికంగా 87.59 శాతం పోలింగ్ జరగ్గా, నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గం 86 శాతంతో రెండో స్థానంలో నిలిచిందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అత్యల్పంగా పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో ఎల్బీనగర్(47.00%), శేరిలింగంపల్లి(49.50%), నాంపల్లి(49.86) ఉన్నాయి. నర్సంపేట, ఆలేరు కాకుండా అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాల వరుసలో డోర్నకల్ (85.87%) నర్సాపూర్ (85%), భువనగిరి (84.99%), సూర్యాపేట (84.29%) ఉన్నాయి. ఈ ఎన్నికల్లో యువ ఓటర్లు అధిక స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల భారీ పోలింగ్ నమోదైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా మాజీ మంత్రులు, ముఖ్యనాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో అత్యధికంగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా పోలింగ్ జరగడం ఎవరికి అనుకూలం.. ఎవరికి వ్యతిరేకం? అన్న అంశంపై రాజకీయ పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా పోలింగ్ జరిగితే..రాష్ట్ర రాజధాని నగరం, దాని శివార్లలోని నియోజకవర్గాల్లో మాత్రం అతితక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంపై అధికారులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. తాము ప్రజలను ఎంతగా చైతన్యపరిచినప్పటికీ.. వారు ఓటింగ్‌కు దూరంగా ఉంటే తాము చేసేదేమిటని ఓ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి ఓటు హక్కు వినియోగం గురించి ప్రచారం చేశామని అధికారులు చెప్పారు. గిరిజన నియోజకవర్గాల్లో సైతం 80 శాతం పైగా పోలింగ్ జరిగితే విద్యావంతులుండే ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ తక్కువ జరగడం గమనార్హం. జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. మెదక్(80.17), నల్లగొండ(80.17), ఖమ్మం(80), వరంగల్(78.74), నిజామాబాద్ (70.20), కరీంనగర్(72.21), ఆదిలాబాద్(72.71), రంగారెడ్డి(61.11), మహబూబ్‌నగర్(74.25), హైదరాబాద్(53.30)


